Skip to main content

Career guidance: పచ్చని కెరీర్‌కు అగ్రి కోర్సులు, ప్రవేశ విధానం, భవిష్యత్తు అవకాశాలు తదితర వివరాలు ఇవే..

అగ్రికల్చర్, అగ్రికల్చర్‌ అనుబంధ కోర్సులు, హార్టికల్చర్, వెటర్నరీ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ స్టేట్‌ అగ్రికల్చర్‌ యూనివర్సిటీ (పీజేటీఎస్‌ఏయూ).. ఉమ్మడి కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభించింది. దీనికి టీఎస్‌ ఎంసెట్‌(బైపీసీ/ఎంపీసీ)లో ర్యాంకు సాధించిన విద్యార్థులు అర్హులు. 2023–24 విద్యాసంవత్సరానికి తెలంగాణ రాష్ట్రంలోని.. పీజేటీఎస్‌ఏయూ, శ్రీ కొండా లక్ష్మణ్‌ హార్టికల్చర్‌ యూనివర్సిటీ, పీవీ నరసింహరావు వెటర్నరీ యూనివర్సిటీల్లో.. వివిధ కోర్సుల్లో అడ్మిషన్‌ కల్పించనున్నారు. ఈ నేపథ్యంలో.. ఈ మూడు వర్సిటీల్లో అందుబాటులో ఉన్న కోర్సులు, ప్రవేశ విధానం, భవిష్యత్తు అవకాశాలు తదితర వివరాలు..
career opportunities for agriculture courses in pjtsau
  • తెలంగాణ అగ్రికల్చర్‌ యూనివర్సిటీలో పలు కోర్సులు
  • ఎంసెట్‌ బైపీసీ, ఎంపీసీ స్ట్రీమ్‌ ర్యాంకు ఆధారంగా ప్రవేశాలు
  • హార్టికల్చర్, వెటర్నరీ యూనివర్సిటీల్లోనూ కోర్సులు
  • పీజేటీఎస్‌ఏయూ ఆధ్వర్యంలో ఉమ్మడి కౌన్సెలింగ్‌
  • 2023 సంవత్సరానికి మొదలైన దరఖాస్తు ప్రక్రియ

అగ్రికల్చర్, అనుబంధ కోర్సులకు సంబంధించి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మూడు యూనివర్సిటీల పరిధిలో ఎనిమిది కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అగ్రికల్చరల్, వెటర్నరీ సైన్స్, ఫిషరీ సైన్స్, హార్టికల్చర్‌ సైన్స్‌ల కోర్సులను మూడు యూనివర్సిటీలు అందిస్తున్నప్పటికీ.. ప్రవేశ ప్రక్రియను మాత్రం ఉమ్మడి కౌన్సెలింగ్‌ విధానంలో నిర్వహిస్తున్నారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో.. ఉమ్మడి కౌన్సెలింగ్‌ జరుగుతుంది. దీనికోసం అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

చ‌ద‌వండి: Job Opportunities: అగ్రికల్చర్‌ కోర్సులు.. అందించేను అవకాశాలు

పీజేటీఎస్‌ఏయూ కోర్సులు

  • అగ్రికల్చరల్‌ బీఎస్సీ–ఆనర్స్‌: మొత్తం సీట్లు–720. వీటిలో 200 సీట్లను సెల్ఫ్‌ ఫైనాన్స్‌ సీట్లుగా పేర్కొన్నారు.
  • బీఎస్సీ ఆనర్స్‌ కమ్యూనిటీ సైన్స్‌: మొత్తం సీట్లు–43(5 సెల్ఫ్‌ ఫైనాన్స్‌ సీట్లు).
  • బీటెక్‌–అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్‌: మొత్తం సీట్లు–29(9 సెల్ఫ్‌ ఫైనాన్స్‌ సీట్లు).
  • బీటెక్‌ ఫుడ్‌ టెక్నాలజీ: మొత్తం సీట్లు–30(10 సీట్లు సెల్ఫ్‌ ఫైనాన్స్‌ సీట్లు).
  • బీఎస్సీ ఆనర్స్‌–కమ్యూనిటీ సైన్స్‌: మొత్తం సీట్లు 42(5సెల్ఫ్‌ ఫైనాన్స్‌ సీట్లు) (ఎంపీసీ స్ట్రీమ్‌).

పీవీ నరసింహరావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ కోర్సులు

  • బీవీఎస్సీ అండ్‌ ఏహెచ్‌: మొత్తం సీట్లు–174.
  • బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిషరీ సైన్స్‌(బీఎఫ్‌ఎస్‌సీ): మొత్తం సీట్లు–39. 
  • ఏపీ రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం–ఏపీలో­ని కాలేజ్‌ ఆఫ్‌ ఫిషరీసైన్స్‌ ముత్తుకూరు(నెల్లూరు జిల్లా)లో 11 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

శ్రీ కొండా లక్ష్మణ్‌ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం కోర్సులు

  • బీఎస్సీ ఆనర్స్‌ హార్టికల్చర్‌–204 కోర్సులు. వీటి­లో 34 సీట్లను సెల్ఫ్‌ ఫైనాన్స్‌ సీట్లుగా పేర్కొన్నారు.

ఎంసెట్‌ బైపీసీ/ఎంపీసీ

  • తెలంగాణ రాష్ట్రంలోని అగ్రికల్చర్, వెటర్నరీ, ఫిషరీ సైన్స్, అనుబంధ కోర్సులకు సంబంధించి టీఎస్‌ ఎంసెట్‌ బైపీసీ/ఎంపీసీ స్ట్రీమ్‌లో ఉత్తీర్ణత ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. 
  • బీఎస్సీ అగ్రికల్చర్‌ ఆనర్స్, కమ్యూనిటీ సైన్స్, బీవీఎస్సీ అండ్‌ ఏహెచ్, బీఎఫ్‌ఎస్‌సీ, బీఎస్సీ ఆనర్స్‌–హార్టికల్చర్‌ కోర్సుల సీట్లను ఎంసెట్‌ బైపీసీ స్ట్రీమ్‌ ర్యాంకుతో భర్తీ చేస్తారు.
  • బీటెక్‌ అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్,బీటెక్‌ ఫుడ్‌ టె­క్నాలజీ సీట్లలో ఎంసెట్‌ ఎంపీసీ స్ట్రీమ్‌ ర్యాంకు ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. దీంతోపాటు బీఎస్సీ ఆనర్స్‌ కమ్యూనిటీ సైన్స్‌లో మొత్తం 42 సీట్లను ఎంపీసీ స్ట్రీమ్‌ ర్యాంకు ఆధారంగా భర్తీ చేస్తారు. 
  • హోమ్‌ సైన్స్‌లో మూడేళ్ల డిప్లొమా పూర్తి చేసుకున్న వారికి సూపర్‌ న్యూమరరీ కోటా కింద 8 సీట్లు అందుబాటులో ఉంటాయి.

అర్హత

  • బైపీసీ స్ట్రీమ్‌ కోర్సులు: ఇంటర్‌ బైపీసీ ఉత్తీర్ణత సాధించాలి. బీవీఎస్‌సీ అండ్‌ ఏహెచ్‌ కోర్సుకు బైపీసీలో 50 శాతం మార్కులు తప్పనిసరి. దీంతోపాటు టీఎస్‌ ఎంసెట్‌ బైపీసీ స్ట్రీమ్‌లో ఉత్తీర్ణత ఉండాలి. 
  • ఎంపీసీ స్ట్రీమ్‌ కోర్సులు: ఇంటర్‌ ఎంపీసీ ఉత్తీర్ణతతోపాటు ఎంసెట్‌ ఎంపీసీ స్ట్రీమ్‌లో అర్హత సాధించాలి. 

ఫార్మర్స్‌ కోటా విధానం

అగ్రికల్చర్, అనుబంధ కోర్సుల్లోని సీట్లను భర్తీ చేసే క్రమంలో ఫార్మర్స్‌ కోటా విధానాన్ని కూడా అ­మలు చేస్తున్నారు. ఒక ఎకరానికి తక్కువ కాకుండా భూమి ఉన్న రైతుల కుటుంబాలకు చెందిన పిల్లల­కు అగ్రికల్చర్‌ యూనివర్సిటీ, హార్టికల్చర్‌ యూనివర్సిటీ కోర్సుల్లో 40 శాతం సీట్లు, వెటర్నరీ యూనివర్సిటీ కోర్సుల్లో 25శాతం సీట్లు కేటాయిస్తారు. ఈ కోటా సీట్లు పొందాలనుకునే విద్యార్థులు ఒక­టో తరగతి నుంచి ఇంటర్మీడియెట్‌ మధ్యలో కనీసం నాలుగేళ్లు గ్రామీణ ప్రాంతాల్లో చదివుండాలి.

చదవండి: After Inter: ఇంటర్ తర్వాత.. ఎన్నెన్నో అవకాశాలు

పెరుగుతున్న పోటీ

  • అగ్రికల్చర్‌ అనుబంధ కోర్సుల్లో ప్రవేశాలకు గత కొన్నేళ్లుగా విద్యార్థుల నుంచి ఆదరణ లభిస్తోంది. దీంతో వీటికి పోటీ పెరుగుతోంది. గత ఏడాది కౌన్సెలింగ్‌ ఆయా కోర్సుల్లో చివరి ర్యాంకులను పరిశీలిస్తే.. 
  • బీఎస్సీ అగ్రికల్చర్‌ కోర్సులో స్థానిక కోటాలో నాన్‌–ఫార్మర్‌ కేటగిరీలో 3,299వ ర్యాంకు, ఫార్మర్‌/రూరల్‌ కోటాలో 5,705వ ర్యాంకు చివరి ర్యాంకులుగా నిలిచాయి. 

ఉజ్వల అవకాశాలు

అగ్రికల్చర్‌ కోర్సులకు డిమాండ్‌ పెరగడానికి ఈ రంగంలో లభిస్తున్న ఉపాధి అవకాశాలే కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. కోర్సుల వారీగా భవిష్యత్తు అవకాశాల వివరాలు..

అగ్రికల్చర్‌ బీఎస్సీ

వ్యవసాయ సాగు విధానాల్లో ఆధునిక పద్ధతులు, నూతన పరికరాల వినియోగం వంటి నైపుణ్యాలను అందించే కోర్సు ఇది. దీన్ని పూర్తి చేసుకున్న వారికి ప్రైవేటు రంగంలో విత్తన ఉత్పాదక సంస్థలు, పౌల్ట్రీ ఫామ్స్‌లో ఉద్యోగాలు లభిస్తాయి. ప్రభుత్వ విభాగంలో వ్యవసాయ శాఖలో అగ్రికల్చర్‌ ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌ వంటి కొలువులు సొంతం చేసుకోవచ్చు. బ్యాంకుల్లో రూరల్‌ బ్యాంకింగ్‌ ఆఫీసర్లుగా చేరే వీలుంది.

బీవీఎస్‌సీ అండ్‌ ఏహెచ్‌

పేరుకు ముందు డాక్టర్‌ హోదా.. కెరీర్‌ పరంగా ఉన్నత స్థానాలు అందుకునేందుకు దోహదం చేస్తు­న్న కోర్సు.. బ్యాచిలర్‌ ఆఫ్‌ వెటర్నరీ సైన్స్‌ అండ్‌ యానిమల్‌ హజ్బెండరీ(బీవీఎస్‌సీ అండ్‌ ఏహెచ్‌). జంతువులకు వచ్చే వ్యాధులు, నివారణ చర్యలు, పశువుల గర్భధారణ పద్ధతులు తదితర అంశాల్లో నైపుణ్యం కల్పించే కోర్సు ఇది. వీరికి పౌల్ట్రీ ఫారా­లు, ప్రభుత్వ, ప్రైవేటు పశువైద్య ఆసుపత్రులు, పశుసంవర్థక శాలలు, వన్యమృగ సంరక్షణ కేంద్రాలు, జంతు ప్రదర్శన శాలలు, డెయిరీ ఫామ్స్, గొర్రెల పెంపక కేంద్రాల్లో ఉద్యోగాలు లభిస్తాయి.

హార్టికల్చర్‌ సైన్స్‌

పర్యావరణంపై ఆసక్తి ఉన్న వారికి సరైన కోర్సు.. బీఎస్సీ హార్టికల్చర్‌ సైన్స్‌. ఈ కోర్సును పూర్తి చేసుకున్న వారికి స్టేట్‌ హార్టికల్చర్‌ మిషన్, నాబార్డ్‌ సహా పలు బ్యాంకుల్లో ఉద్యోగాలు లభిస్తాయి. అదేవిధంగా ప్రైవేట్‌ డ్రిప్‌ ఇరిగేషన్‌ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, మైక్రో ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ల్లోనూ ఉపాధి అవకాశాలు విస్తృతం అవుతున్నాయి. ఉన్నత విద్య పరంగా పీజీ స్థాయిలో ఫ్రూట్‌ సైన్స్, వెజిటబుల్‌ సైన్స్, ఫ్లోరికల్చర్, ప్లాంటేషన్‌ అండ్‌ స్పైస్‌ క్రాప్‌ ప్రత్యేక అంశాలుగా ఎమ్మెస్సీ చదివే అవకాశం ఉంది.

బీఎఫ్‌ఎస్‌సీ

బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిషరీస్‌ సైన్స్‌..సంక్షిప్తంగా బీఎఫ్‌ఎస్‌సీ. చేపల పెంపకం,సేకరణకు సంబంధించి ప్ర­త్యేక పద్ధతులు అనుసరించేందుకు అవసరమ­య్యే నైపుణ్యాలు అందించే కోర్సు ఇది. దీన్ని పూర్తిచేసుకున్న వారికి ఆక్వాకల్చర్‌ కంపెనీలు, ఆక్వా రీసెర్చ్‌ సంస్థలు ప్రధాన ఉపాధి వేదికలుగా నిలుస్తున్నాయి.

చదవండి: డిప్లొమా నుంచే కెరీర్‌కు బాటలు.. రూ.25వేల ప్రారంభ వేత‌నంతో కొలువులు..

బీటెక్‌–ఫుడ్‌ టెక్నాలజీ

బెపీసీ విద్యార్థులకు అందుబాటులో ఉన్న మరో కోర్సు.. బీటెక్‌–ఫుడ్‌ టెక్నాలజీ. ఆహార ఉత్పత్తుల తయారీ, నాణ్యత, ప్రాసెసింగ్‌ సంబంధిత నైపుణ్యాలు అందించే కోర్సు ఇది. దీన్ని పూర్తి చేయడం ద్వారా ఫుడ్‌ ప్రొడక్షన్‌ యూనిట్స్, ప్యాకేజ్డ్‌ ఫుడ్‌ మ్యాన్యుఫ్యాక్చరింగ్‌ సంస్థల్లో కొలువుదీరొచ్చు. దీంతోపాటు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్స్, క్రాప్‌ పొడక్షన్‌ కంపెనీలలో మేనేజ్‌మెంట్‌ విభాగాల్లో ఉద్యోగాలు లభిస్తాయి.

బీటెక్‌ అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్‌

వ్యవసాయ ఉత్పత్తులు, పరికరాల డిజైన్, నిర్వహణకు సంబంధించిన నైపుణ్యాలు అందించే కోర్సు ఇది. మైక్రో ఇరిగేషన్‌ పరికరాలు, ప్రాసెసింగ్‌ పరికరాలు, గ్రీన్‌ హౌస్‌ల నిర్మాణం పర్యవేక్షణ వంటి నైపుణ్యాలు లభిస్తాయి. ఈ కోర్సు పూర్తి చేసుకున్న అభ్యర్థులు అగ్రి ఎక్విప్‌మెంట్‌ సంస్థలు, క్రాప్‌ పొడక్షన్‌ కంపెనీల్లో సాంకేతిక విభాగాల్లో కొలువులు సొంతం చేసుకోవచ్చు.

బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్‌

సామాజిక అంశాలు, విలువలు, సామాజిక అభివృద్ధిలో సాంకేతికతను వినియోగించే నైపుణ్యాల­ను అందించే కోర్సు ఇది. కోర్సులో భాగంగా ఫుడ్‌ అండ్‌ న్యూట్రిషన్, హ్యూమన్‌ డెవలప్‌మెంట్, ఫ్యా­మిలీ స్టడీస్, అపరెల్‌ డిజైన్, రిసోర్స్‌ మేనేజ్‌మెంట్, కన్సూ్యమర్‌ సైన్సెస్‌ వంటి అంశాలపై అవగాహన కల్పిస్తారు. ఈ కోర్సు ఉత్తీర్ణులకు హాస్పిటల్స్, చైల్డ్‌కేర్‌ ఇన్‌స్టిట్యూట్స్, సోషల్‌ వెల్ఫేర్‌ ఆర్గనైజేషన్స్, ఎన్‌జీఓలలో ఉద్యోగావకాశాలు లభిస్తాయి.

ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
  • బైపీసీ స్ట్రీమ్‌ రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లింపునకు చివరి తేది: 15.07.2023
  • బైపీసీ స్ట్రీమ్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: జూలై 17,2023
  • బైపీసీ స్ట్రీమ్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తు సవరణ అవకాశం: జూలై 18, 19 తేదీలు
  • ఎంపీసీ స్ట్రీమ్‌ రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లింపునకు చివరి తేది: 07.07.2023
  • ఎంపీసీ స్ట్రీమ్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది: 09.07.2023
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://ug.pjtsau.ac.in, https://btech.pjtsau.ac.in
Published date : 27 Jun 2023 06:16PM

Photo Stories