అగ్రికల్చర్ సైంటిస్ట్‌గా స్థిరపడాలనుకునే వారికి సదావకాశం.. ఏఎస్‌ఆర్‌బీ నెట్ 2021 నోటిఫికేషన్ విడుదల..!
ముఖ్యంగా ప్రభుత్వ విభాగాల్లో ఉన్నత కొలువులు సొంతం చేసుకోవాలని ఆశిస్తున్నారా?! సాగు రంగంలో సమున్నత కెరీర్ మీ లక్ష్యమైతే.. చక్కటి అవకాశం తలుపు తట్టింది! అదే... ఏఎస్‌ఆర్‌బీ–నెట్, ఏఆర్‌ఎస్, ఎస్‌టీఓ–2021 నోటిఫికేషన్ . కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని అగ్రికల్చరల్ సైంటిస్ట్ రీసెర్చ్ బోర్డ్(ఏఎస్‌ఆర్‌బీ).. ఏటా అగ్రికల్చర్ యూనివర్సిటీల్లో లెక్చర్‌షిప్ అర్హతకు, అదే విధంగా అగ్రికల్చర్ రీసెర్చ్ సర్వీసెస్‌లో సైంటిస్ట్ పోస్ట్‌లకు, సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తోంది. తాజాగా ఏఎస్‌ఆర్‌బీ–నెట్, ఏఆర్‌ఎస్, ఎస్‌టీఓలకు ఉమ్మడి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. వీటికి సంబంధించిన వివరాలు, అర్హతలు, అవకాశాల గురించి తెలుసుకుందాం..
‘అగ్రికల్చర్ కోర్సుల్లో ఉన్నత విద్య పూర్తి చేసినా.. అవకాశాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. ఇక్కడ ఉద్యోగాన్వేషణ కష్టమే.’ - అగ్రికల్చర్ కోర్సుల విషయంలో వినిపించే అభిప్రాయం ఇది. ఇలాంటి వాదనలకు ఫుల్‌స్టాప్ పెట్టేలా.. ప్రభుత్వ వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక వృత్తిలో అడుగు పెట్టేందుకు, అగ్రికల్చరల్ రీసెర్చ్ సర్వీసెస్‌లో సైంటిస్ట్‌లుగా, సీనియర్ టెక్నికల్ ఆఫీసర్‌గా కొలువుదీరేందుకు జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న పరీక్షే.. ఏఎస్‌ఆర్‌బీ–నెట్, ఏఆర్‌ఎస్, ఎస్‌టీఓ పరీక్ష.
అగ్రి వర్సిటీల్లో అధ్యాపక వృత్తికి ఏఎస్‌ఆర్‌బీ–నెట్ 2021..
- జాతీయ స్థాయిలో ఉన్న వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, అదే విధంగా రాష్ట్రాల పరిధిలోని అగ్రికల్చర్ యూనివర్సిటీల్లో అధ్యాపక వృత్తిలోకి ప్రవేశానికి నిర్వహించే అర్హత పరీక్ష.. ఏఎస్‌ఆర్‌బీ–నెట్. ఏఎస్‌ఆర్‌బీ–నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్‌లో ఉత్తీర్ణత ఆధారంగా.. అగ్రి యూనివర్సిటీల్లో లెక్చరర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్‌లకు పోటీ పడే అర్హత లభిస్తుంది.
- ఏఎస్‌ఆర్‌బీ నెట్‌ను మొత్తం అరవై విభాగాల్లో నిర్వహించనున్నారు. అభ్యర్థులు తమకు ఆసక్తి ఉన్న విభాగానికి అనుగుణంగా పీజీ స్థాయిలో సంబంధిత స్పెషలైజేషన్‌తో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. ఆ తర్వాత నెట్‌కు హాజరై.. సాధించిన స్కోర్ ఆధారంగా.. స్టేట్, సెంట్రల్ లెవల్ అగ్రి యూనివర్సిటీల్లో లెక్చరర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఏఎస్‌ఆర్‌బీ నెట్.. ఆన్‌లైన్ విధానంలో ఆబ్జెక్టివ్ పద్ధతిలో 150 మార్కులకు–150 ప్రశ్నలకు జరుగుతుంది. పరీక్ష సమయం రెండు గంటలు. అభ్యర్థులు ఎంపిక చేసుకున్న సబ్జెక్ట్ విభాగం నుంచే ప్రశ్నలు అడుగుతారు. ఏఎస్‌ఆర్‌బీ కేటగిరీల వారీగా నిర్దిష్ట ఉత్తీర్ణత శాతాలను పేర్కొంది. అన్–రిజర్వ్‌డ్, ఈడబ్ల్యూఎస్ వర్గాల విద్యార్థులు కనీసం 50 శాతం, ఓబీసీ వర్గాలు కనీసం 45 శాతం, ఎస్‌సీ, ఎస్‌టీ, పీడబ్ల్యూడీ వర్గాలు కనీసం 40 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది.
ఏఎస్‌ఆర్‌బీ నెట్– ముఖ్య సమాచారం..
- అర్హత: అగ్రికల్చర్ అనుబంధ విభాగాల్లో నెట్‌లో ఆసక్తి ఉన్న స్పెషలైజేషన్‌తో పీజీ ఉత్తీర్ణత సాధించాలి. చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వీరు సెప్టెంబర్ 19లోపు పీజీ ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.
- వయో పరిమితి: జనవరి 1 నాటికి 21 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ట వయో పరిమితి నిబంధన లేదు.
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
- ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: ఏప్రిల్ 5–ఏప్రిల్ 25, 2021.
- ఏఎస్‌ఆర్‌బీ–నెట్ తేదీలు: జూన్ 21 నుంచి జూన్ 27 వరకు.
- తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ.
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: http://www.asrb.org.in
రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్స్‌లో 65 ఎస్‌టీఓలు..
- అగ్రికల్చరల్ సైంటిస్ట్ రీసెర్చ్ బోర్డ్.. అగ్రి పీజీ ఉత్తీర్ణులకు సుస్థిర కొలువు దిశగా నిర్వహిస్తున్న మరో పరీక్ష.. సీనియర్ టెక్నికల్ ఆఫీసర్(ఎస్‌టీఓ) ఎగ్జామినేషన్. ఇందులో ఉత్తీర్ణత ఆధారంగా ఐసీఏఆర్, దాని అనుబంధ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్స్‌లో టి–6 లెవల్‌లో సీనియర్ టెక్నికల్ ఆఫీసర్‌గా కొలువు సొంతం చేసుకోవచ్చు. ఏడో వేతన సంఘం సిఫార్సు ప్రకారం–లెవల్–10 హోదాలో రూ.56,100– 1,77,500 వేతన శ్రేణితో ప్రారంభ వేతనం పొందొచ్చు.
- ఏఎస్‌ఆర్‌బీ తాజా నోటిఫికేషన్ ప్రకారం– దేశవ్యాప్తంగా ఐసీఏఆర్, ఐసీఏఆర్ అనుబంధ 64 రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్స్‌లో 65 పోస్ట్‌లను భర్తీ చేయనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో విశాఖపట్నంలోని సీఐఎఫ్‌టీ రీజనల్ సెంటర్‌లో ఒక పోస్ట్, హైదరాబాద్‌లోని డీపీఆర్‌లో ఒక పోస్ట్, నార్మ్‌లో ఒక పోస్ట్ చొప్పున అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు సంబంధిత విభాగాల్లోని స్పెషలైజేషన్‌తో పీజీ ఉత్తీర్ణత సాధించాలి.
- సీనియర్ టెక్నికల్ ఆఫీసర్స్ ఎంపికలో భాగంగా రాత పరీక్ష, ఇంటర్వూ్యలను నిర్వహిస్తారు. తొలి దశలో రాత పరీక్ష.. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌గా ఆబ్జెక్టివ్ విధానంలో 150 మార్కులకు ఉంటుంది.
- ఈ రాత పరీక్షలో మెరిట్ ఆధారంగా ఒక్కో పోస్ట్‌కు అయిదుగురు(1:5 నిష్పత్తి) చొప్పున పర్సనల్ ఇంటర్వూ్యకు ఎంపిక చేస్తారు.
- 30 మార్కులకు ఉండే పర్సనల్ ఇంటర్వూలో సంబంధిత పోస్ట్‌కు అభ్యర్థి సరితూగుతాడా లేదా, అభ్యర్థికి ఉన్న ఆసక్తి ఇతర అంశాలను పరిశీలిస్తారు.
- ఇంటర్వూలోనూ విజయం సాధించి మెరిట్ జాబితాలో నిలిచిన వారికి రిజర్వేషన్లను పరిగణనలోకి తీసుకొని నియామకాలు ఖరారు చేస్తారు.
ఎస్‌టీఓ (టి–6) పరీక్ష సమాచారం..
- అర్హత: సంబంధిత విభాగంలో పీజీ ఉత్తీర్ణత ఉండాలి.
- వయసు: ఏప్రిల్ 25,2021 నాటికి 21–35 ఏళ్ల మధ్యలో ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీ వర్గాలకు నిబంధనలకు అనుగుణంగా గరిష్ట వయో సడలింపు లభిస్తుంది.
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
- ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: ఏప్రిల్ 5–ఏప్రిల్ 25, 2021.
- ఎస్‌టీఓ పరీక్ష తేదీ: జూన్ 21–జూన్ 27, 2021.
- తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ.
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: http://www.asrb.org.in
ఏఆర్‌ఎస్ టెస్ట్.. 222 సైంటిస్ట్ పోస్టులు..
- ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్(ఐసీఏఆర్)లో.. శాస్త్రవేత్తలుగా కొలువుదీరడానికి ఏఎస్‌ఆర్‌బీ నిర్వహిస్తున్న ఎంపిక ప్రక్రియ.. ఏఆర్‌ఎస్ టెస్ట్. ఇందులో విజయం సాధించి నియామకం ఖరారు చేసుకుంటే.. పే బ్యాండ్–3తో రూ.15,600–39,100 శ్రేణితో కొలువు సాధించొచ్చు. అదే విధంగా రివైజ్డ్ గ్రేడ్ పే పేరిట మరో రూ.ఆరు వేలు అందుతుంది.
- ఏఎస్‌ఆర్‌బీ తాజాగా ప్రకటించిన నోటిఫికేషన్ ప్రకారం–మొత్తం 60 విభాగాల్లో 222 సైంటిస్ట్ పోస్ట్‌లను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు తాము దరఖాస్తు చేసుకునే విభాగానికి సంబంధించిన స్పెషలైజేషన్‌తో పీజీ ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఏఆర్‌ఎస్ ఎగ్జామినేషన్‌కు అన్–రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులు గరిష్టంగా ఆరుసార్లు, ఓబీసీ వర్గాల అభ్యర్థులు గరిష్టంగా తొమ్మిదిసార్లు మాత్రమే రాసేందుకు అనుమతి లభిస్తోంది. ఎస్‌సీ, ఎస్‌టీ వర్గాల విద్యార్థులు తమ వయో పరిమితి ముగిసేలోపు ఎన్నిసార్లయినా పరీక్ష రాయొచ్చు.
- అగ్రికల్చరల్ రీసెర్చ్ సర్వీసెస్‌లో సైంటిస్ట్ పోస్టుల భర్తీకి ఏఎస్‌ఆర్‌బీ మూడు దశల ఎంపిక ప్రక్రియ నిర్వహించనుంది. అవి.. ఏఆర్‌ఎస్ ప్రిలిమినరీ, ఏఆర్‌ఎస్ మెయిన్, వైవా–వాయిస్(పర్సనల్ ఇంటర్వూ).
- మొదటి దశ ప్రిలిమినరీ పరీక్షను ఆబ్జెక్టివ్ విధానంలో 150 మార్కులకు రెండు గంటల వ్యవధిలో నిర్వహిస్తారు.
- ప్రిలిమ్స్‌లో నిర్ణీత కటాఫ్ మేరకు మెరిట్ జాబితా రూపొందించి.. ఒక్కో పోస్ట్‌కు పదిహేను మంది(1:15 నిష్పత్తి) చొప్పున మెయిన్‌కు ఎంపిక చేస్తారు.
- మెయిన్ పరీక్ష మూడు గంటల వ్యవధిలో పూర్తిగా డిస్క్రిప్టివ్ విధానంలో 240 మార్కులకు పెన్ పేపర్ పద్ధతిలో జరుగుతుంది.
- మెయిన్ పరీక్ష∙మొత్తం మూడు విభాగాల్లో (పార్ట్–ఎ, బి, సి) ఉంటుంది. పార్ట్–ఎ నుంచి 40 షార్ట్ ఆన్సర్స్ కొశ్చన్స్ ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు. – పార్ట్–బిలో ఒక్కో ప్రశ్నకు అయిదు మార్కులు చొప్పున మొత్తం 20 ప్రశ్నలు ఉంటాయి. పార్ట్–సిలో ఆరు వ్యాస రూప ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు పది మార్కులు కేటాయించారు.
- మెయిన్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా ఒక్కో పోస్ట్‌కు అయిదుగురు(1:5 నిష్పత్తి) చొప్పున చివరి దశ వైవా–వాయిస్‌కు ఎంపిక చేస్తారు. ఈ దశలో నిపుణుల కమిటీ అభ్యర్థుల ఆసక్తిని, వ్యక్తిగత సామర్థ్యాలను పరిశీలిస్తుంది. ఇందులోనూ ప్రతిభ చూపిన అభ్యర్థులతో మెరిట్ జాబితా రూపొందించి పోస్ట్‌లు, రిజర్వేషన్లను పరిగణనలోకి తీసుకుంటూ తుది నియామకాలు ఖరారు చేస్తారు.
ఏఆర్‌ఎస్ టెస్ట్ ముఖ్య సమాచారం..
- అర్హత: అగ్రికల్చర్, అనుబంధ విభాగాలు, ఇతర నిర్దేశిత స్పెషలైజేషన్లతో పీజీ ఉత్తీర్ణత ఉండాలి.
- వయో పరిమితి: జనవరి 1, 2021 నాటికి 21 నుంచి 32 ఏళ్ల మధ్యలో ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం గరిష్ట వయోపరిమితిలో సడలింపు.
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
- ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: ఏప్రిల్ 5–ఏప్రిల్ 25.
- ఏఆర్‌ఎస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ తేదీ: జూన్ 21– జూన్ 27. ్ఠఠీ ఏఆర్‌ఎస్ ప్రిలిమినరీ– తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ.
- ఏఆర్‌ఎస్ మెయిన్స్ ఎగ్జామినేషన్ తేదీ: సెప్టెంబర్ 9, 2021
- ఏఆర్‌ఎస్ మెయిన్– తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: http://www.asrb.org.in
సద్వినియోగం చేసుకోవాలి..
అగ్రికల్చర్, అనుబంధ విభాగాల్లో పీజీ చదువుతున్న విద్యార్థులు.. ఏఎస్‌ఆర్‌బీ నోటిఫికేషన్‌ను సద్వినియోగం చేçసుకోవాలి. ఏఎస్‌ఆర్‌బీ–నెట్ ద్వారా జాతీయ స్థాయిలో అగ్రికల్చర్ యూనివర్సిటీల్లో అధ్యాపక వృత్తిలోకి ప్రవేశించొచ్చు. పరీక్షలో పీజీ స్థాయిలో ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది.
– ప్రొ.టి.గిరిధర కృష్ణ, రిజిస్ట్రార్, ఏఎన్‌జీఆర్‌ఏయూ