Skip to main content

కొలువుల క‌ల్పన‌లో అగ్రిక‌ల్చర‌ల్ సైన్స్‌.. అగ్రి కోర్సుల గురించి తెలుసుకోండిలా..

అగ్రికల్చరల్‌ సైన్స్‌.. వ్యవసాయ శాస్త్రం.. ఉపాధికి వన్నె తరగని రంగం! దేశంలో నేటికి 60 శాతం మందికి వ్యవసాయమే జీవనాధారం. ఇటీవల కాలంలో సాగు రంగం కొత్త పుంతలు తొక్కుతోంది.

సరికొత్త కొలువులకు వేదికగా మారుతోంది. వ్యవసాయ రంగానికి సంబంధించిన ప్రత్యేక కోర్సులు, నైపుణ్యాలు సొంతం చేసుకుంటే.. ఉజ్వల కెరీర్‌ ఖాయం అవుతోంది. డిప్లొమా నుంచి పీజీ, పీహెచ్‌డీ వరకూ.. అందుబాటులో ఉన్న వివిధ అగ్రికల్చర్‌ కోర్సులు, ఉన్నత విద్య, ఉద్యోగావకాశాల గురించి తెలుసుకుందాం..


అగ్రికల్చరల్‌ సైన్స్‌..డిప్లొమా నుంచి పీహెచ్‌డీ వరకూ.. ఎన్నో కోర్సులు. ముఖ్యంగా పదోతరగతి తర్వాత డిప్లొమా ఇన్‌ అగ్రికల్చర్‌ కోర్సులపై విద్యార్థుల్లో ఆసక్తి పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రెండేళ్ల అగ్రి డిప్లొమా కోర్సులను ఇంటర్మీడియెట్‌ తత్సమాన కోర్సులుగా గుర్తిస్తూ.. ఈ కోర్సుల ఉత్తీర్ణులు డిగ్రీ స్థాయిలో బీజెడ్‌సీ అనుబంధ కోర్సుల్లో, ఇతర డిగ్రీ కోర్సుల్లో చేరేందుకు అవకాశం కల్పిస్తూ ఈ ఏడాది ఫిబ్రవరిలో జీఓ జారీ చేశారు.


డిప్లొమా ఇన్‌ అగ్రికల్చరల్‌ సైన్స్‌..

పదో తరగతితోనే అగ్రికల్చరల్‌ సైన్స్‌ కోర్సుల్లో చేరేందుకు అవకాశం ఉంది. ముఖ్యంగా డిప్లొమా ఇన్‌ అగ్రికల్చరల్‌ సైన్స్‌లో ప్రవేశానికి అర్హత పదోతరగతి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయాలు(ఏఎన్‌జీఆర్‌ఏయూ –ఏపీ, పీజేటీఎస్‌ఏయూ–తెలంగాణ) రెండేళ్లు, మూడేళ్ల కాల వ్యవధి కలిగిన అగ్రికల్చర్, అనుబంధ డిప్లొమా కోర్సులను అందిస్తున్నాయి. ప్రధానంగా అగ్రికల్చర్‌ డిప్లొమా; విత్తన సాంకేతిక పరిజ్ఞానం(సీడ్‌ టెక్నాలజీ), సేంద్రీయ వ్యవసాయం(ఆర్గానిక్‌ ఫార్మింగ్‌), అగ్రికల్చర్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో అగ్రికల్చర్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ కోర్సు వ్యవధి మూడేళ్లు. కాగా,మిగతా మూడు డిప్లొమా కోర్సుల వ్యవధి రెండేళ్లు.

 
ఆంధ్రప్రదేశ్‌లో డిప్లొమా ఇన్‌ అగ్రికల్చరల్‌ సైన్స్‌లో ప్రవేశించాలంటే..ఆర్‌జీయూకేటీ–సెట్‌(ఏపీ ట్రిపుల్‌ ఐటీ ఎంట్రన్స్‌ టెస్ట్‌)లో అర్హత సాధించాలి. ఆ తర్వాత ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రత్యేకంగా కౌన్సెలింగ్‌ నిర్వహించి.. ఆర్‌జీయూకేటీ–సెట్‌లో మెరిట్, దరఖాస్తుల ఆధారంగా సీట్లుభర్తీ చేస్తుంది. వాస్తవానికి 2019–20వరకు ఏఎన్‌జీఆర్‌ఏయూ సొంత ఎంట్రన్స్‌ టెస్ట్‌ ద్వారా డిప్లొమా కోర్సుల సీట్ల భర్తీ చేసేది. 2020 నుంచి ఆర్‌జీయూకేటీ–సెట్‌ ద్వారా ప్రవేశం కల్పిస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో.. ప్రభుత్వ పాలిటెక్నిక్స్‌లో రెండేళ్లు, మూడేళ్ల వ్యవధిలోని డిప్లొమా కోర్సుల్లో 600కు పైగా సీట్లు, ప్రైవేటు పాలిటెక్నిక్స్‌లో మూడు వేలకుపైగా సీట్లు అందుబాటులో ఉన్నాయి.
 
తెలంగాణలోనూ డిప్లొమా స్థాయిలో డిప్లొమా ఇన్‌ అగ్రికల్చర్, డిప్లొమా ఇన్‌ అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్‌ సీడ్‌ టెక్నాలజీ, డిప్లొమా ఇన్‌ ఆర్గానిక్‌ అగ్రికల్చర్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. తెలంగాణలో పాలిసెట్‌ (పాలిటెక్నిక్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌)లో ర్యాంకు ఆధారంగా.. ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ స్టేట్‌ అగ్రికల్చర్‌ యూనివర్సిటీ ప్రత్యేక కౌన్సెలింగ్‌ నిర్వహించి ప్రవేశం కల్పిస్తోంది. యూనివర్సిటీ పరిధిలోని పాలిటెక్నిక్స్‌లో దాదాపు 250 సీట్లు, అనుబంధ ప్రైవేటు పాలిటెక్నిక్స్‌లో 600 కు పైగా సీట్లు అందుబాటులో ఉన్నాయి.


బ్యాచిలర్‌ డిగ్రీ కోర్సులు..

ఏపీలో అగ్రికల్చరల్‌ సైన్స్‌కు సంబంధించి పలు బ్యాచిలర్‌ డిగ్రీ కోర్సుల్లో చేరే వీలుంది. బీఎస్సీ అగ్రికల్చర్‌ సైన్స్‌(ఆనర్స్‌) కోర్సు, బీటెక్‌ ఫుడ్‌ టెక్నాలజీ, బీటెక్‌ అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్, బీఎస్సీ(ఆనర్స్‌) కమ్యూనిటీ సైన్స్‌ కోర్సులు ఏపీలో అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సుల కాల వ్యవధి నాలుగేళ్లు. ఈ కోర్సుల్లో చేరాలంటే.. ఎంసెట్‌లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. బీటెక్‌ అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్‌లో సీటు కోసం ఎంసెట్‌ ఎంపీసీ ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌లో ర్యాంకు సాధించాలి. అగ్రికల్చరల్‌ డిప్లొమా కోర్సుల విద్యార్థులకు అగ్రిసెట్‌ పేరుతో ప్రత్యేక ఎంట్రన్స్‌ నిర్వహించి..బీఎస్సీ(ఆనర్స్‌)కోర్సులోకి ప్రవేశం కల్పిస్తారు. మొత్తం సీట్లలో పది శాతం సీట్లను డిప్లొమా ఉత్తీర్ణులకు కేటాయిస్తారు. అగ్రికల్చర్‌/సీడ్‌ టెక్నాలజీ, ఆర్గానిక్‌ ఫార్మింగ్‌లో డిప్లొమా పూర్తి చేసుకున్న వారు ఈ అగ్రిసెట్‌కు అర్హులు. అగ్రి ఇంజనీరింగ్‌ సెట్‌ పేరుతో సొంత ఎంట్రన్స్‌ టెస్ట్‌ ద్వారా బీఎస్సీ(ఆనర్స్‌) అగ్రికల్చర్, బీటెక్‌–ఫుడ్‌ టెక్నాలజీ, బీటెక్‌–అగ్రికల్చర్‌ ఇంజనీరింగ్,బీఎస్సీ(ఆనర్స్‌)–కమ్యూనిటీ సైన్స్‌ కోర్సుల్లో సీట్ల భర్తీ చేస్తారు. బీటెక్‌ అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్‌లో మొత్తం సీట్లకు అదనంగా పదిహేను శాతం సీట్లను డిప్లొమా ఇన్‌ అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీలో ఉత్తీర్ణులకు అందుబాటులో ఉంచుతారు. అదే విధంగా బీఎస్సీ(ఆనర్స్‌)–కమ్యూనిటీ సైన్స్‌కు సంబంధించి డిప్లొమా ఇన్‌ ఫుడ్‌ హోమ్‌ సైన్స్‌ విద్యార్థులకు పది శాతం సూపర్‌ న్యూమరరీ సీట్లు అందుబాటులో ఉంటాయి.

తెలంగాణలో బ్యాచిలర్‌ స్థాయిలో బీఎస్సీ(ఆనర్స్‌) అగ్రికల్చర్, బీటెక్‌ అగ్రికల్చర్‌ ఇంజనీరింగ్, బీటెక్‌ ఫుడ్‌ టెక్నాలజీ, బీఎస్సీ(ఆనర్స్‌)కమ్యూనిటీ సైన్స్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రవేశానికి టీఎస్‌ ఎంసెట్‌లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. అగ్రికల్చరల్, అనుబంధ డిప్లొమా కోర్సులు పూర్తి చేసుకున్న వారికి అగ్రి సెట్, అగ్రి ఇంజనీరింగ్‌ సెట్‌ను నిర్వహించి.. సూపర్‌ న్యూమరరీ సీట్ల విధానంలో డిప్లొమా వారికి ప్రత్యేకంగా సీట్లను కేటాయిస్తారు.


పీజీ, పీహెచ్‌డీలో స్పెషలైజేషన్లు..

  1. అగ్రికల్చరల్‌ సైన్స్‌ కోర్సులతో బ్యాచిలర్‌ డిగ్రీ పూర్తి చేసుకున్న వారికి ఉన్నత విద్య కోణంలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్, పీహెచ్‌డీ స్థాయిలో పలు స్పెషలైజేషన్లను ఆయా కాలేజీలు అందిస్తున్నాయి. వీటిలో ప్రవేశించాలంటే ముందుగా.. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ రీసెర్చ్‌(ఐసీఏఆర్‌) జాతీయ స్థాయిలో నిర్వహించే ఐసీఏఆర్‌ ఆల్‌ ఇండియా కాంపిటీటివ్‌ ఎగ్జామినేషన్‌(ఏఐసీఈ)లో ర్యాంకు సొంతం చేసుకోవాలి. ఈ ఎంట్రన్స్‌ టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు.. వ్యవసాయ విశ్వవిద్యాలయాలు తదుపరి దశలో సొంతంగా నిర్వహించే కౌన్సెలింగ్‌కు హాజరైతే.. మెరిట్‌ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.
  2. ప్రస్తుతం పీజీ స్థాయిలో రెండేళ్ల వ్యవధిలో ఎమ్మెస్సీ(అగ్రికల్చర్‌), ఎంబీఏ(అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌), ఎంటెక్‌(అగ్రికల్చర్‌ ఇంజనీరింగ్‌), ఎమ్మెస్సీ (హోంసైన్స్‌) అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఎమ్మెస్సీ అగ్రికల్చర్‌లో ప్లాంట్‌ సైన్సెస్, ఫిజికల్‌ సైన్సెస్, ప్లాంట్‌ బయోటెక్నాలజీ, ఎంటమాలజీ అండ్‌ నెమటాలజీ, ఆగ్రానమీ, సోషల్‌ సైన్సెస్‌(అగ్రికల్చర్‌ ఎకనామిక్స్, అగ్రికల్చర్‌ ఎక్స్‌టెన్షన్‌), స్టాటిస్టికల్‌ సైన్సెస్‌(అగ్రికల్చరల్‌ స్టాటిస్టిక్స్‌) స్పెషలైజేషన్లు ఎంచుకునే అవకాశముంది.
  3. ఎంటెక్‌ అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్‌లో అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ పరిధిలో.. సాయిల్‌ అండ్‌ వాటర్‌ ఇంజనీరింగ్, ప్రాసెసింగ్‌ అండ్‌ ఫుడ్‌ ఇంజనీరింగ్, ఫార్మ్‌ మెషినరీ అండ్‌ పవర్‌ ఇంజనీరింగ్‌ తదితర కోర్సుల్లో చేరే వీలుంది.
  4.  పీహెచ్‌డీ స్థాయిలో పలు విభాగాల్లో పరిశోధనలు చేసే అవకాశం ఉంది. జెనెటిక్స్‌ అండ్‌ ప్లాంట్‌ బ్రీడింగ్, ప్లాంట్‌ పాథాలజీ, ఎంటమాలజీ, క్రాప్‌ సైకాలజీ, మాలిక్యులర్‌ బయాలజీ అండ్‌ బయో టెక్నాలజీ, అగ్రికల్చరల్‌ మైక్రోబయాలజీ, ఆగ్రానమీ, సాయిల్‌ సైన్స్, అగ్రికల్చరల్‌ ఎకనామిక్స్, అగ్రికల్చరల్‌ ఎక్స్‌టెన్షన్, సాయిల్‌ అండ్‌ వాటర్‌ ఇంజనీరింగ్, ప్రాసెసింగ్‌ అండ్‌ ఫుడ్‌ ఇంజనీరింగ్, ఫార్మ్‌ మెషినరీ అండ్‌ పవర్‌ ఇంజనీరింగ్‌ విభాగాల్లో పీహెచ్‌డీ అందుబాటులో ఉంది. పీహెచ్‌డీలో చేరేందుకు అభ్యర్థులు తాము ఎంచుకున్న విభాగానికి సంబంధించిన స్పెషలైజేషన్‌తో పీజీ పూర్తి చేసి.. ఐసీఏఆర్‌ నిర్వహించే జేఆర్‌ఎఫ్‌/ఎస్‌ఆర్‌ఎఫ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.
  5. అగ్రికల్చరల్‌ కోర్సులకు సంబంధించి దేశంలో ప్రతిష్టాత్మక మేనేజ్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్స్‌గా గుర్తింపు పొందిన ఐఐఎంలలోనూ అడుగు పెట్టే అవకాశం ఉంది. ఐఐఎం–అహ్మదాబాద్, లక్నో క్యాంపస్‌లలో ఫుడ్‌ అండ్‌ అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ పీజీ ప్రోగ్రామ్, అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌లు అందుబాటులో ఉన్నాయి. క్యాట్‌లో ఉత్తీర్ణత ఆధారంగా వీటిలో ప్రవేశం పొందొచ్చు.

ఇంకా చ‌ద‌వండి : part 2: డిప్లొమా నుంచే కెరీర్‌కు బాటలు.. రూ.25వేల ప్రారంభ వేత‌నంతో కొలువులు..

Published date : 21 May 2021 03:20PM

Photo Stories