Skip to main content

KGBV: పోస్టుల భర్తీకి పక్కా రూల్స్‌

కస్తూరిబా బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) టీచింగ్‌ పోస్టుల భర్తీ అత్యంత పారదర్శకంగా నిర్వహించేలా ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మార్గదర్శకాలను జారీ చేసింది.
KGBV
‘కేజీబీవీ’ పోస్టుల భర్తీకి పక్కా రూల్స్‌

కేజీబీవీల్లో మొత్తం 958 పోస్టుల భర్తీకి డిసెంబర్‌ 3న నోటిఫికేషన్ జారీ కావడం తెలిసిందే. ఈ పోస్టులన్నిటినీ పూర్తిగా మహిళా అభ్యర్థులతోనే భర్తీ చేస్తారు. పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం లేదు. విద్యార్హతలు, అనుభవం, మెరిట్‌ను ప్రాతిపదికగా తీసుకుని రిజర్వేషన్లను అనుసరించి అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్లను (పీజీటీ) పార్ట్‌టైమ్‌ ప్రాతిపదికన, మిగతా టీచర్లను కాంట్రాక్టు విధానంలో నియమించనున్నారు.

ఏడాది ఒప్పందం.. ఆపై షరతులతో పొడిగింపు

కేజీబీవీల్లో బోధనకు ఎంపికైన అభ్యర్థులకు అధికారికంగా నియామక ఉత్తర్వులు జారీ చేయరు. కౌన్సెలింగ్‌లో వారికి కేటాయించిన కేజీబీవీలో రిపోర్టు చేయాలని మాత్రమే సూచిస్తారు. అక్కడ వారు ఎంవోయూపై సంతకం చేయాల్సి ఉంటుంది. ఈ నియామక ఒప్పందం 12 నెలలకే పరిమితం. విద్యా సంవత్సరం చివరి రోజుతో అది ముగుస్తుంది. తదుపరి విద్యాసంవత్సరాలకు తిరిగి కొనసాగింపుపై కొత్త ఒప్పందం సంతృప్తికరమైన పనితీరు, ఆంగ్ల మాధ్యమంలో బోధనా సామర్థ్యం తదితరాలపై ఆధారపడి ఉంటుంది. ఆంగ్ల మాధ్యమంలో బోధనా సామర్థ్యం లేకున్నా, పేలవమైన పనితీరు ఉన్నా, నిధుల దుర్వినియోగం లాంటి ఇతర ఆరోపణలున్నా విద్యాసంవత్సరంలో ఏ సమయంలోనైనా ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండానే ఒప్పందాన్ని రద్దు చేస్తారు. ఈ పోస్టులలో నియమించే అభ్యర్థులకు భవిష్యత్తులో క్రమబద్ధీకరణ కోరే హక్కు గానీ, దావా వేసే వీలు కానీ ఉండదు. పోస్టులకు ఎంపికయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా నైట్‌ డ్యూటీలు నిర్వర్తించేందుకు అంగీకారం తెలపాలి. వీరికి కేంద్ర ప్రభుత్వ కమ్యూనిటీ ఎయిడ్, స్పాన్సర్‌షిప్‌ ప్రోగ్రాం (సీఏఎస్‌పీ) మార్గదర్శకాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వంపై ఎలాంటి అదనపు భారం పడకుండా వేతనాలను ఖరారు చేస్తారు. కేంద్ర ప్రాయోజిత పథకాల కాలవ్యవధికి లోబడే ఈ కాంట్రాక్టు, పార్ట్‌ టైమ్‌ పోస్టుల కొనసాగింపు ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు కౌన్సెలింగ్‌ తేదీ రోజు హాజరుకాకపోయినా, కేటాయించిన కేజీబీవీలో 15 రోజుల లోపు చేరకున్నా నియామకాన్ని రద్దు చేసి తదుపరి మెరిట్‌ అభ్యర్థిని ఎంపిక చేస్తారు. కౌన్సెలింగ్‌ అనంతరం 30 రోజులలోగా ఈ ప్రక్రియ పూర్తవుతుంది. ఆపై ఎలాంటి నియామకాలు ఉండవు. పోస్టుల వారీగా అభ్యర్థులకు కౌన్సెలింగ్‌ చేపడతారు. ఈ నియామకాల కోసం జిల్లా స్థాయిలో జాయింట్‌ కలెక్టర్‌ లేదా కలెక్టర్‌ నామినేట్‌ చేసే అధికారి చైర్మన్ గా కమిటీని ఏర్పాటు చేస్తారు. సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు డైరెక్టర్‌ మెంబర్‌ కన్వీనర్‌గా, డీఈవో, ఏపీఎంఎస్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ మెంబర్‌గా ఈ కమిటీ ఉంటుంది. రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్ల ప్రకారం రోస్టర్‌ పాయింట్ల ఆధారంగా ఆయా కేటగిరీల వారీగా పోస్టులను కేటాయిస్తారు. అభ్యర్థుల వయసు 2021 జూలై 1వతేదీ నాటికి 18 నుంచి 42 ఏళ్ల లోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 47 ఏళ్లు కాగా దివ్యాంగులకు 52 ఏళ్లుగా నిర్దేశించారు.

ప్రిన్సిపాళ్లు, పీజీటీలకు మెరిట్‌ మార్కులు ఇలా

  • అకడమిక్‌ అర్హతలో సాధించిన మార్కులు– 40 మార్కులు.
  • వృత్తిపరమైన అర్హతలో సాధించిన మార్కులు – 40 మార్కులు
  • 2 సంవత్సరాల అనుభవం – 10 మార్కులు
  • హయ్యర్‌ అకడమిక్‌ అర్హత – 5 మార్కులు
  • హయ్యర్‌ ప్రొఫెషనల్‌ అర్హత – 5 మార్కులు
  • ఏదైనా కేజీబీవీలో రెండేళ్లకన్నా తక్కువ కాకుండా పనిచేసిన వారికి, సంతృప్తికరమైన విధి నిర్వహణ, ఆరోపణలు లేనివారికి మెరిట్‌ జాబితాలో ప్రాధాన్యమిస్తారు.

సీఆర్టీలు, పీఈటీలకు మెరిట్‌ మార్కులు ఇలా

  • అకడమిక్‌ అర్హతలో సాధించిన మార్కులు – 30 మార్కులు
  • వృత్తిపరమైన అర్హతలో సాధించిన మార్కులు – 30 మార్కులు
  • టెట్‌లో సాధించిన మార్కులు – 20 మార్కులు
  • 2 సంవత్సరాల అనుభవం – 10 మార్కులు
  • హయ్యర్‌ అకడమిక్‌ అర్హత – 5 మార్కులు
  • హయ్యర్‌ ప్రొఫెషనల్‌ అర్హత – 5 మార్కులు
  • ఏదైనా కేజీబీవీలో రెండేళ్లకన్నా తక్కువ కాకుండా పనిచేసిన వారికి, సంతృప్తికరమైన విధి నిర్వహణ, ఆరోపణలు లేనివారికి మెరిట్‌ జాబితాలో ప్రాధాన్యమిస్తారు.

పీజీటీ వొకేషనల్ టీచర్ పోస్టులకు మెరిట్ మార్కులిలా

  • అకడమిక్‌ అర్హతలో సాధించిన మార్కులు – 60 మార్కులు
  • 2 సంవత్సరాల అనుభవం – 20 మార్కులు
  • హయ్యర్‌ అకడమిక్‌ అర్హత – 20 మార్కులు
  • ఏదైనా కేజీబీవీలో రెండేళ్లకన్నా తక్కువ కాకుండా పనిచేసిన వారికి, సంతృప్తికరమైన విధి నిర్వహణ,ఆరోపణలు లేనివారికి మెరిట్‌ జాబితాలో ప్రాధాన్యమిస్తారు.

చదవండి:

Good News: స్కూళ్ల టీచర్ల బదిలీలకు ఆమోదం

Teachers: సింగిల్‌ టీచర్‌ స్కూళ్లలోకి అదనపు టీచర్ల సర్దుబాటు

Teachers: పదవీవిరమణ వయసు పెంపు

Published date : 04 Dec 2021 11:45AM

Photo Stories