YS Jagan Mohan Reddy: బడిఈడు పిల్లలు స్కూల్లో ఉండాల్సిందే
బడి ఈడు పిల్లలు తప్పనిసరిగా స్కూల్లో చేరాలని, 100 శాతం జీఈఆర్ (గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్ రేషియో) సాధించే దిశగా ముందుకు సాగాలన్నారు. డ్రాప్ అవుట్స్ లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులు కోరితే తిరిగి ప్రవేశాలు కల్పించాలని ఆదేశించారు. విద్యాశాఖపై జూన్ 8న క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులను గ్లోబల్ స్థాయిలో తీర్చిదిద్దాలని సూచించారు. అందుకు అనుగుణంగా రాష్ట్రంలోని 45 వేల పాఠశాలల్లో ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులోకి తెచ్చే దిశగా అడుగులు ముందుకు వేయాలని చెప్పారు. మొదటి దశ నాడు–నేడు పూర్తి చేసుకున్న హైస్కూళ్లల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లు (ఐఎఫ్‌పీ) ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
చదవండి: Education: పాఠశాల నుంచేప్రయోగాత్మక విద్య
రెండు హైస్కూళ్ల చొప్పున అప్‌గ్రేడ్ చేయండి
ఇంటర్ విద్యను పటిష్టం చేయాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. అందుకోసం ప్రతి మండలంలో రెండు జూనియర్ కాలేజీలు చొప్పున.. ఒకటి బాలికలకు, రెండోది కో ఎడ్యుకేషన్ కోసం ఉండాలన్నారు. జనాభా అధికంగా ఉన్న ఆ మండలంలోని రెండు గ్రామాలు లేదా, పట్టణాల్లో రెండు హైస్కూళ్లను జూనియర్ కళాశాలలుగా అప్‌గ్రేడ్ చేయాలని ఆదేశించారు. వచ్చే జూన్ నాటికి ఈ జూనియర్ కళాశాలలు అందుబాటులోకి రావాలన్నారు. ఆ తర్వాత ఇంటర్మీడియట్‌లో కూడా బైజూస్ కంటెంట్ పెట్టేందుకు చర్యలు తీసుకోవాలని, తర్వాత దశలో ట్యాబుల పంపిణీకి కూడా సన్నద్ధం కావాలన్నారు. ఇప్పటి నుంచే సరైన ప్రణాళికతో ముందుకు సాగాలని ఆదేశించారు. వరుసగా నాలుగో ఏడాది జగనన్న విద్యా కానుక అందిస్తున్నామని, విద్యార్థులకు అందించే వస్తువుల్లో నాణ్యతా లోపం లేకుండా చూడాలన్నారు.
దీనిపై అధికారులు స్పందిస్తూ విద్యా కానుక నాణ్యత పరిశీలనకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నామని సీఎం దృష్టికి తెచ్చారు. నాణ్యత కోసం క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ ఇండియాతో నిర్ధారణ పరీక్షలు చేస్తున్నామన్నారు. ఇప్పటికే 93 శాతం విద్యా కానుక వస్తువులను, పుస్తకాలను నిర్దేశిత కేంద్రాల్లో పంపిణీకి సిద్ధం చేశామని చెప్పారు. రెండో సెమిస్టర్ పుస్తకాలు కూడా ముందుగానే ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జగనన్న గోరుముద్ద, ఎస్‌ఎంఎఫ్, టీఎంఎఫ్‌లపై నిరంతరం ఫీడ్‌బ్యాక్ తెప్పించుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఫీడ్‌బ్యాక్ ఆధారంగా నిరంతరం చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా ఈ అంశంలో థర్డ్ పార్టీ పరిశీలన ఉండాలన్నారు. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టులను భర్తీ చేయాలని ఆదేశించారు. స్కూళ్లల్లో డ్రాపౌట్స్ నివారణకు గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల సహకారం తీసుకోవాలన్నారు.
చదవండి: NIRF Top 10 Rankings 2023 : దేశంలో టాప్-10 విద్యాసంస్థలు ఇవే.. ఈ సారి కూడా..
డిజిటల్ బోధనపై ఉపాధ్యాయులకు శిక్షణ
ఉన్నత పాఠశాలలకు ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లు, ప్రాథమిక పాఠశాలల్లో స్మార్ట్ టీవీల ద్వారా డిజిటల్ బోధన ప్రవేశపెడుతున్నందున ఉపాధ్యాయులకు వాటి వినియోగంపై శిక్షణ ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, ఆయా కంపెనీల ప్రతినిధులు ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫ్యాకల్టీలకు శిక్షణ ఇస్తారని, వీరి ద్వారా టీచర్లకు శిక్షణ ఇస్తామని వివరించారు. మరింత మందికి దీనిపై నైపుణ్యం పెంచేలా 20 వేల మంది బీటెక్ స్టూడెంట్స్ ఇంటర్న్‌షిప్ చేస్తారని, వీరు ప్రతినెలా ఆయా స్కూళ్లకు వెళ్లి టీచర్లకు ఐఎఫ్‌పీ వినియోగంలో సహాయకారిగా ఉంటారని తెలిపారు. ఐఎఫ్‌పీలతో పాటు స్మార్ట్ టీవీల వినియోగం, ట్యాబులు, బైజూస్ యాప్ పైనా టీచర్లకు శిక్షణ ఇస్తామన్నారు. రోజువారీగా, పాఠ్యాంశాల వారీగా బోధనపై స్కూళ్లకు పవర్ పాయింట్ ప్రజంటేషన్లు అందిస్తామని, అన్ని స్కూళ్లలో ఒకేలా బోధన చేపట్టేలా ఇది ఉపయోగపడుతుందని సీఎంకు వివరించారు. ఏపీఎస్‌ఎఫ్‌ఎల్, బీఎస్‌ఎన్‌ఎల్ ద్వారా స్కూళ్లకు ఇంటర్నెట్ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. తొలిదశ నాడు–నేడు పూర్తి చేసుకున్న స్కూళ్లలో ఇంటర్నెట్ సౌకర్యం కల్పించామని, మిగతా స్కూళ్లకు ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. గతేడాది ఎనిమిదో తరగతి విద్యార్థులకు అందించిన ట్యాబుల నిర్వహణ, వినియోగంపై నిరంతరం సమీక్షలు చేస్తున్నామని అధికారులు సీఎంకు తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో డిజిటల్ అసిస్టెంట్లు ఈ బాధ్యత చూస్తున్నారని వివరించారు.
రెండో దశ నాడు–నేడులో 22,224 స్కూళ్లు
మన బడి నాడు–నేడు రెండో దశ కింద చేపట్టిన పనుల ప్రగతిని సీఎం జగన్ సమీక్షించారు. రెండో దశ కింద ఇప్పటికే రూ.3,287.08 కోట్లు ఖర్చు చేశామని, 22,224 స్కూళ్లలో పనులు జరుగుతున్నట్టు అధికారులు వివరించారు. డిసెంబర్ నాటికి పనులు పూర్తవుతాయన్నారు. నాడు–నేడు కింద పనులు పూర్తి చేసుకున్న స్కూళ్లలో అదే సమయానికి ట్యాబుల పంపిణీతో పాటు, ఐఎఫ్‌బీ ప్యానెల్స్నూ ఏర్పాటు చేస్తామన్నారు. విద్యా శాఖలో చేపడుతున్న వివిధ కార్యక్రమాల అమలు, వాటి పురోగతిని వివరించారు. ఈ ఏడాది అన్ని తరహా ప్రభుత్వ స్కూళ్లలో 64 మంది విద్యార్థులు టాప్ 10 ర్యాంకులు సాధించారన్నారు. స్కూళ్లలో పూర్తి స్థాయిలో సిబ్బంది ఉండేలా, సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ అమలు చేస్తూ బదిలీలు చేపడుతున్నామని, యూనిట్ టెస్టుల్లో వెనకబడినవారికి మరింత బోధన, శిక్షణ ఇచ్చేలా కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. ఈ ఏడాది అన్ని తరహా ప్రభుత్వ కాలేజీల్లో 27 మంది టాప్ 10 ర్యాంకులు సాధించారని సీఎంకు తెలిపారు.
అకడమిక్ క్యాలెండర్ 2023–24 విడుదల
12న విద్యా సంవత్సరం పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో 2023–24 అకడమిక్ క్యాలెండర్‌ను సీఎం ఆవిష్కరించారు. ఇందులో విద్యా సంవత్సరంలో చేపట్టే ముఖ్యమైన అంశాలతో పాటు స్కూల్ కాంప్లెక్స్ షెడ్యూల్, హెచ్‌ఎంలు, ఉపాధ్యాయుల విధులు, లాంగ్వేజ్ మేళా, లాంగ్వేజ్ క్లబ్, లాంగ్వేజ్ ల్యాబ్స్, లెసన్ ప్లాన్ ఫార్మాట్ అండ్ గైడ్‌లైన్స్, లెర్న్ ఏ వర్డ్ ఏ డే, తెలుగు భాషా వారోత్సవాలు, కల్చరల్ యాక్టివిటీస్‌తో సహా స్కూళ్లలో చేపట్టాల్సిన పలు అంశాలు ఉన్నాయి.
ప్రతిభా అవార్డుల పరిశీలన
2023లో పదో తరగతి, ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో అత్యుత్తమ ప్రతిభావంతులను ప్రభుత్వం జగనన్న ఆణిముత్యాలు పురస్కారాలతో సత్కరించనుంది. ఈ సందర్భంగా విద్యార్థులకు ఇవ్వనున్న మెడల్స్‌ను ముఖ్యమంత్రి పరిశీలించారు. ఉత్తమ ప్రతిభ కనపర్చిన విద్యార్థులను మూడు దశల్లో సత్కరించనున్నారు. నియోజకవర్గ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనపర్చిన విద్యార్థులను జూన్ 15న, జిల్లా స్థాయిలో జూన్ 17న, రాష్ట్ర స్థాయిలో జూన్ 20న అవార్డులు అందజేయనున్నారు. స్టేట్ ఎక్స్‌లెన్స్ అవార్డ్స్–2023ను విజయవాడలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా విద్యార్థులకు అందించనున్నారు.