DMHO: నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు

విజయనగరం ఫోర్ట్‌: నకిలీ ధ్రువపత్రాలతో ఉద్యోగాలు పొందిన ఇద్దరు ల్యాబ్‌ టెక్నీషియన్లను విధుల నుంచి తొలగిస్తూ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్‌ఓ) డిసెంబ‌ర్ 5న‌ ఉత్తర్వులు జారీచేశారు.

 2020 ఆగస్టు 29న వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోని (ఎన్‌హెచ్‌ఎం) విభాగంలో ల్యాబ్‌ టెక్నీషియన్లుగా తురక కరుణప్రకాష్‌, కోరాడ సంతోష్‌కుమార్‌ (కాంట్రాక్టు పద్ధతిపై)ఉద్యోగాలు పొందారు.

ఘోష ఆస్పత్రిలో ఒకరు, ఫైలేరియా విభాగంలో ఒకరు విధుల్లో చేరారు. వీరిద్దరు నకిలీ ధ్రువపత్రాలతో ఉద్యోగాలు పొందినట్టు అందిన ఫిర్యాదు మేరకు పారామెడికల్‌ బోర్డుకు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పంపించారు.

చదవండి: Part Time Jobs Fake Websites : పార్ట్ టైమ్ జాబ్ అంటూ.. మోసం చేసే 100 వెబ్‌సైట్లు ఇవే.. నిషేధించిన‌ కేంద్రం..

బోర్డు అధికారులు వీరి సర్టిఫికెట్స్‌ నకిలీవిగా ధ్రువీకరించడంతో ఇరువురిని ఉద్యోగాల నుంచి తొలగించారు. నోటీస్‌ ఇవ్వకుండా ఉద్యోగాలు తొలగించడంపై ఇద్దరు ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించడం, కోర్టు తీర్పు మేరకు ఈ ఏడాది జూన్‌ 23 మళ్లీ ఉద్యోగాల్లో నియమించారు.

అయితే, దీనిపై విచారణ చేయాలని పార్వతీపురం స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌కు వైద్యవిభాగం ఉన్నతాధికారులు ఆదేశించారు. ఆయన విచారణలో సర్టిఫికెట్స్‌ మార్ఫింగ్‌ చేసినట్టు తేలడంతో ఇద్దరినీ విధుల నుంచి తొలగిస్తూ డీఎంహెచ్‌ఓ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.

#Tags