Naukri Job Speak Index: హైదరాబాద్‌లో నియామకాల జోరు.. ఏక్కువ‌ ఉద్యోగులు ఈ రంగంలో

ముంబై: జూలైలో కార్యాలయ ఉద్యోగుల నియామకాల పరంగా హైదరాబాద్‌లో మంచి వృద్ధి నమోదైంది.

ఒకటికి మించిన రంగాల్లో నియామకాలు జూలైలో గణనీయంగా పెరిగినట్టు నౌకరీ జాబ్‌ స్పీక్‌ ఇండెక్స్‌ నివేదిక తెలిపింది. దేశవ్యాప్తంగా జూలైలో నియామకాలు 12 శాతం పెరిగినట్టు ప్రకటించింది.

మొత్తం 2,877 జాబ్‌ పోస్టింగ్‌ నోటిఫికేషన్లు (ఉద్యోగులు కావాలంటూ జారీ చేసే ప్రకటనలు) వచ్చినట్టు పేర్కొంది. 

క్రితం ఏడాది జూలై నెలలో 2,573 జాబ్‌ పోస్టింగ్‌లతో పోల్చి చూస్తే 12 శాతం పెరిగినట్టు తెలిపింది. జూలై నెలకు సంబంధించిన గణాంకాలను విడుదల చేసింది.

చదవండి: Jobs in Sports Quota : ఎస్‌బీఐ స్పోర్స్ కోటాలో వివిధ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు..

దేశవ్యాప్తంగా నియామకాల ధోరణిని ఈ నివేదిక ప్రతిఫలిస్తుంటుంది. నౌకరీ డాట్‌ కామ్‌ పోర్టల్‌పై జాబ్‌ పోస్టింగ్‌లు, ఉద్యోగ శోధన వివరాల ఆధారంగా ఈ నివేదికను రూపొందిస్తుంది. ముఖ్యంగా ఫార్మా రంగంలో 26 శాతం మేర నియామకాలు పెరిగాయి. 

ఆ తర్వాత రియల్‌ ఎస్టేట్‌ రంగంలో 23 శాతం అధికంగా ఉద్యోగాల భర్తీ నెలకొంది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చితే జూలైలో ఐటీ నియామకాలు 17 శాతం పుంజుకున్నాయి.

ముఖ్యంగా ఏఐ–ఎంఎల్‌ విభాగంలో 47 శాతం మేర నియామకాలు పెరిగాయి. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో అత్యధికంగా 39 శాతం వృద్ధి నమోదైంది. ఆ తర్వాత జామ్‌నగర్‌లో 38 శాతం, బరోడాలో 25 శాతం మేర నియామకాలు పెరిగాయి. 

హైదరాబాద్‌లో జోరు 

హైదరాబాద్‌లో హాస్పిటాలిటీ (ఆతిథ్య పరిశ్రమ) రంగంలో నియామకాలు 76 శాతం పెరిగాయి. ఆ తర్వాత బీమా రంగంలో 71 శాతం, బీపీవో రంగంలో 52 శాతం, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ రంగంలో 44 శాతం చొప్పున జూలైలో నియామకాలు పెరిగినట్టు నౌకరీ నివేదిక తెలిపింది.

విజయవాడలో 13 శాతం, విశాఖపట్నంలో 14 శాతం చొప్పున నియామకాల్లో వృద్ధి కనిపించినట్టు పేర్కొంది. ‘‘12 శాతం వృద్ధి ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి ఆశాజనకం. ఈ ఆర్థిక సంవత్సరంలో నియామకాల పరంగా సానుకూల వృద్ధి మొదటిసారి నమోదైంది.

దేశ కార్యాలయ ఉద్యోగ మార్కెట్లో పురోగమనాన్ని సూచిస్తోంది’’అని నౌకరీ చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ పవన్‌ గోయల్‌ తెలిపారు.

#Tags