Telangana: బడి పిల్లలకు అల్పాహారం

నిర్మల్‌ రూరల్‌: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం దసరా కానుకను ప్రకటించింది. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు దసరా నుంచి ‘ముఖ్యమంత్రి అల్పాహార పథకం’ ప్రారంభించనున్నట్లు విద్యాశాఖ ము ఖ్య కార్యదర్శి వాకాటి కరుణ ప్రకటించారు.
బడి పిల్లలకు అల్పాహారం

 ఈ మేరకు జీవో సైతం జారీ చేశారు. 1 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులందరికీ ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. విద్యార్థులకు ఉచిత బోధనతోపాటు మంచి పౌష్టికాహారం అందించే దిశగా ఈ పథకం అమలు చేయనున్నారు. తద్వారా నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు పౌష్టికాహారం అందించడంతోపాటు వారికి చదువుపై ఏకాగ్రత మరింత పెరుగుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు ఇకపై వా రి ఇంట్లో ఒక్క పూట భోజనం మాత్రమే తింటారు.

చదవండి: Gopagani Ramesh: చదువుకున్న పాఠశాలకే హెచ్‌ఎంగా..

దసరా నుంచి ప్రారంభం...

ప్రభుత్వం ప్రకటించిన ముఖ్యమంత్రి అల్పాహార పథకం విద్యార్థులకు అక్టోబర్‌ 24 నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రారంభం కానుంది. దేశంలోనే మొదటిసారిగా ఈ అల్పాహార పథకాన్ని తమిళనాడు ప్రభుత్వం ప్రారంభించింది. ఆ పథకం అమలవుతున్న విధి విధానాలను పరిశీలించడానికి రాష్ట్ర ఉన్నతాధికారులు ఇటీవలే తమిళనాడుకు వెళ్లి వచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నివేదిక అందించారు. అక్కడ కేవలం ప్రాథమిక పాఠశాలల్లోనే ఈ పథకం అమలు చేస్తుండగా, మన రాష్ట్రంలో మాత్రం 1 నుంచి 10వ తరగతి వరకు ఒకేసారి అమలు చేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు.

చదవండి: School Holidays: సెప్టెంబర్ 28న పాఠశాలలు, కాలేజీల‌కు సెలవు?.. కార‌ణం ఇదే..!

ఇదీ మెనూ....

దసరా నుంచి విద్యార్థులకు అందించే అల్పాహార మెనూ ప్రభుత్వం ఖరారు చేసింది. రవ్వ ఉప్మా, పొంగల్‌, కేసరి, కిచిడి వంటి పదార్థాలతో కూడిన మెనూ అధికారులు పరిశీలించి అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. పల్లి చట్నీ, సాంబార్‌ సైతం విద్యార్థులకు అందించనున్నారు.

ప్రస్తుతం ప్రత్యామ్నాయ పోషకాహారంగా అందిస్తున్న రాగి జావ, ఉడికించిన కోడిగుడ్ల పంపిణీ యథాతధంగా కొనసాగుతుందని విద్యాశాఖ అధికారులు తెలిపారు. పాఠశాల ప్రారంభానికి ముందే రాగిజావను అందించనుండగా, మధ్యాహ్న భోజనానికి–రాగి జావాకు మధ్యలో అల్పాహారం అందజేస్తారు. మధ్యాహ్న భోజనం ప్రతీరోజు 2 గంటల తర్వాత అందించే ఆలోచన చేస్తున్నారు.

చదవండి: Free training: నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ

పేద విద్యార్థులకు ఉపయోగకరం..

ప్రభుత్వం తలపెట్టిన అల్పాహార పథకం ద్వారా జిల్లాలోని పేద విద్యార్థులకు ఎంతో ఉపయోగకరం కానుంది. జిల్లాలో 735 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 1 నుంచి 10వ తరగతి వరకు 52,667 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరందరికీ తాజా పథకం కింద లబ్ధి చేకూరనుంది. జిల్లాలో చాలామంది పేద పిల్లలు గ్రామీణ ప్రాంతాల నుంచి ఉదయం ఖాళీ కడుపుతో బడులకు వస్తున్నారు.

ఫలితంగా వారిని రక్తహీనత, పోషకాహార లోపం సమస్యలు బాధిస్తున్నాయి. కొందరు విద్యార్థులు తరగతి గదిలోనే నీరసంతో చదువుపై అనాసక్తిగా కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వం రాగిజావ అందజేయడంతోపాటు, మధ్యాహ్న భోజన మెనూలో వెజిటేబుల్‌ బిర్యాని సైతం అందజేస్తుంది. తాజాగా అల్పాహారం అందించేందుకు నిర్ణయం తీసుకోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులతోపాటు ఉపాధ్యాయ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది.

#Tags