Skip to main content

Tribal Gurukul School : గిరిజ‌న పాఠ‌శాల‌ల్లో నిలిచిపోయిన బోధ‌న‌.. అట‌కెక్కిన విద్యార్థుల చ‌దువు!

గత పదేళ్లుగా ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో పాఠాలు బోధిస్తున్న ఉపాధ్యాయులు తమకు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.
Disruption of students studies as teaching gets halted

ఉరవకొండ: ప్రభుత్వ గిరిజన గురుకుల పాఠశాలల్లో పాఠాలు బోధించే ఉపాధ్యాయులు లేక విద్యార్థుల చదువులు అటకెక్కాయి. గత పదేళ్లుగా ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో పాఠాలు బోధిస్తున్న ఉపాధ్యాయులు తమకు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అయినా ప్రభుత్వం స్పందించకపోవడంతో ఈ నెల 16 నుంచి సమ్మె బాట పట్టారు. ఫలితంగా గిరిజన గురుకులాల్లో బోధన పూర్తిగా నిలిచిపోయింది. దీంతో తమకు తోచిన క్రీడలతో విద్యార్థులు రోజంతా కాలక్షేపం చేస్తున్నారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

డిమాండ్లు న్యాయపరమైనవే...

ఎన్నికల సమయంలో కూటమి పెద్దలు ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చిన తర్వాత తుంగలో తొక్కారంటూ ఔట్‌సోర్సింగ్‌ ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు ఉద్యోగ భద్రతతో పాటు నిరుద్యోగులకు భృతి చెల్లిస్తామంటూ నాడు ఇచ్చిన హామీని నెరవేర్చకపోగా అన్యాయంగా తమను తొలగించే కుట్రలకు తెరలేపారంటూ మండి పడుతున్నారు.

Famous IAS school: ఈ స్కూల్‌ IAS లకు ప్రసిద్ధి.. ఎక్కడో తెలుసా..?

ఈ నేపథ్యంలో తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, 1,143 ఔట్‌ సోర్సింగ్‌ పోస్టులను డీఎస్సీ నోటిఫికేషన్‌లో చూపించరాదని, 2022 పీఆర్సీ ప్రకారం జీతాలు చెల్లించాలని, ఔట్‌ సోర్సింగ్‌ విధులు నిర్వహిస్తున్న తమను కాంట్రాక్టు రెసిడెన్షియల్‌ టీచర్లుగా గుర్తించాలని, రెగ్యూలర్‌ ఉద్యోగులతో సమానంగా అన్నీ సౌకర్యాలు కల్పించాలంటూ తదితర డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అయితే డిమాండ్లను నెరవేర్చకుండా కూటమి సర్కార్‌ మొండి చెయ్యి చూపడంతో టీచర్లు సమ్మెలోకి వెళ్లారు. దీంతో పది రోజులుగా గిరిజన గురుకులాల్లో విద్యాబోధన అటకెక్కింది.

సమ్మెలోకి 110 మంది

ఉమ్మడి అనంతపురం జిల్లా పరిధిలో 12 ప్రభుత్వ గిరిజన పాఠశాలలు ఉన్నాయి. గోరంట్ల, పెనుకొండ, కదిరి, తనకల్లు, అనంతపురం, ఉరవకొండలో గిరిజన బాలికల పాఠశాలలతో పాటు కదిరి, బుక్కరాయసముద్రం, రాగులపాడు, కళ్యాణదుర్గం, గొల్లలదొడ్డిలో బాలుర పాఠశాలలు, తనకల్లులో కాలేజ్‌ ఆఫ్‌ ఎక్స్‌ ఉన్నాయి. అనంతపురం జిల్లాలో 3 నుంచి 10వ తరగతి వరకు 1,417 మంది బాలబాలికలు ఉండగా, శ్రీసత్యసాయి జిల్లాలో 1,430 మంది విద్యాభ్యాసం చేస్తున్నారు.

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

కేవలం ప్రిన్సిపాల్‌ ఒక్కరే రెగ్యూలర్‌ పద్దతిలో మిగిలిన 110 మంది ఉపాధ్యాయులు ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో పనిచేస్తున్నారు. ఇందులో తెలుగు, హిందీ, ఇంగ్గిషు, గణితం, సైన్స్‌, సోషల్‌తో పాటు పీఈటీలూ ఉన్నారు. వీరంతా 2016లో కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ కింద నియమితులైనవారే. ప్రారంభంలో రూ.3వేల వేతనం అందిపుచ్చుకున్న వీరు ప్రస్తుతం రూ.12వేల వేతనానికి చేరుకున్నారు. సమ్మె కారణంగా 10వతరగతి విద్యార్థుల చదువులకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. సిలబస్‌ పూర్తికాక పోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

డిమాండ్లు నెరవేర్చే వరకూ సమ్మె

మా డిమాండ్లన్నీ న్యాయపరమైనవే. ఉద్యోగ భద్రతతో పాటు 2022 పీఆర్సీ ప్రకారం జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలి. మా డిమాండ్లన్నీ నెరవేరేవరకూ సమ్మెలోనే ఉంటాం.

– లోకన్న, ఉపాధ్యాయుడు, గిరిజన బాలుర పాఠశాల, గొల్లలదొడ్డి, గుత్తి మండలం

ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులు

ఉపాధ్యాయుల సమ్మె వల్ల గురుకులాల్లో విద్యార్థుల చదువులకు ఆటంకం కలగకుండా దగ్గర్లోని ప్రభుత్వ పాఠశాలలకు పంపుతున్నాం. కొన్ని పాఠశాలల్లో ప్రిన్సిపాళ్ల ద్వారానే పాఠ్యాంశాలు బోధించేలా చర్యలు తీసుకున్నాం.

– రామాంజినేయులు, జిల్లా గిరిజన సంక్షేమాధికారి, అనంతపురం

Job Calender 2025 : 2025 జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేసిన యూపీఎస్‌సీ.. డిగ్రీ అర్హ‌తతోనే!

ఉద్యోగాలు తొలగించడం దారుణం

తాము అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు భృతిని అందించడంతో పాటు కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్‌లు జారీ చేస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీనిచ్చారు. అధికారం చేపట్టిన తర్వాత అన్ని వర్గాలనూ మోసం చేశారు. పదేళ్లుగా ఔట్‌ సోర్సింగ్‌ పద్దతిలో గురుకులాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను తొలగించేందుకు కుట్ర చేయడం సరైంది కాదు. వెంటనే వారి డిమాండ్లను నెరవేర్చి గిరిజన విద్యార్థుల చదువులకు ఆటంకం కలగకుండా చూడాలి.

– శివశంకర్‌నాయక్‌, జీవీఎస్‌ఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు

Published date : 27 Nov 2024 11:05AM

Photo Stories