Famous IAS school: ఈ స్కూల్ IAS లకు ప్రసిద్ధి.. ఎక్కడో తెలుసా..?
రాజంపేట : ఎందరో ఐఏఎస్‌లను, రాజకీయ ప్రముఖులను అందించిన నందలూరు జిల్లా పరిషత్ హైస్కూల్‌ను ఇంటర్‌మీడియెట్ బోర్డు పాతాళంలోకి తొక్కేస్తోంది. 30 ఏళ్ల క్రితం తాత్కాలికంగా కళాశాల తరగతులు నిర్వహించుకుంటామని చేరి శాశ్వతంగా అలాగే ఉండిపోయింది. దీంతో ఇటు హైస్కూల్ విద్యార్థులకు మధ్యాహ్నం వరకు.. అటు కళాశాల విద్యార్థులకు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు తరగతులు నడుస్తున్నాయి.
ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త..జీతాల్లో భారీగా పెంపు: Click Here
కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం ఇప్పటికీ పరిష్కారం కాలేదు. 1908లో నందలూరులో బోర్డు హైస్కూల్ ఏర్పాటైంది. 1954లో జిల్లా పరిషత్ హైస్కూల్.. ఆ తర్వాత 1962లో జిల్లా హయ్యర్ సెకండరీ హైస్కూల్‌గా ఆవిర్భవించింది. ఒకప్పుడు విశాలమైన గదులు, లైబ్రరీ, ల్యాబ్, క్రీడా పరికరాలతో పాటు నాణ్యమైన బోధన, ఉత్తమ ఉపాధ్యాయులతో క్రమశిక్షణకు మారుపేరుగా హైస్కూల్ ఖ్యాతిగాంచింది. ఎందరో ఐఏఎస్‌లను అందించి చరిత్రలో నిలిచింది. ఇక్కడి హైస్కూల్‌లో తరగతులు ఉదయం 7.45కు ప్రారంభిస్తారు. మధ్నాహ్నం ఒంటిగంట వరకు నిర్వహిస్తారు.
ఐఎఎస్‌ల హైస్కూల్‌గా ప్రసిద్ధి
ఐఏఎస్‌లను.. గొప్ప రాజకీయ నాయకులను దేశానికి అందించిన స్కూల్‌గా ఇది ఖ్యాతి గడించింది. జి.జగత్పతి, ఎ.ఉమాకాంతశర్మ, తిరువెంగళాచార్యులు, ఆకేపాటి విజయసాగర్‌రెడ్డి, జి.పెద్దరెడ్డయ్య ఈ హైస్కూల్‌లోనే చదివి ఐఏఎస్‌లయ్యారు. మాజీ గవర్నర్ ఎస్.ఓబులరెడ్డి, మాజీ మంత్రి బండారు రత్నసభాపతి, ఎంపీలు యెద్దుల ఈశ్వర్‌రెడ్డి, వై.ఆదినారాయణరెడ్డి, డీఎన్ రెడ్డి వంటి దిగ్గజాలు ఈ హైస్కూల్‌లో విద్య అభ్యసించినవారే. జిల్లా బోర్డు అధ్యక్షుడిగా పనిచేసిన వై.పిచ్చిరెడ్డి, అగ్రికల్చర్ డిప్యూటీ డైరెక్టర్ ఏబీ ఆదిశేషారెడ్డి, బ్రిగేడియర్ వి.శ్రీరాములు, మాజీ ఎమ్మెల్యే కసిరెడ్డి మదన్‌మోహనరెడ్డి, ఐఎఎస్‌ల సృష్టికర్త ఆర్‌సీ రెడ్డి, ఐటీఎస్ ఎంవీ రమణయ్య, ఆర్టీసీ రీజినల్ మాజీ చైర్మన్ యెద్దల సుబ్బరాయుడుతో పాటు ఎందరో క్రీడాకారులుగా, ఉన్నతాధికారులుగా, ప్రజాప్రతినిధులుగా రాణించారు.
జూనియర్ కళాశాల రాకతో హైస్కూల్ విద్యకు గ్రహణం
నందలూరు బస్టాండు నుంచి సౌమ్యనాథ ఆలయానికి వెళ్లే మార్గంలో విశాలమైన స్థలంలో ఈ హైస్కూల్ ఉంది. భవనాల కొరతతో 1982లో నందలూరులోని జూనియర్ కళాశాలను ఇక్కడికి మార్చారు. అంతే.. ఆ రోజు నుంచి హైస్కూల్ సమస్యల ఒడిలోకి జారుకుంది. సొంతభవనాల నిర్మాణం వరకు అని చెప్పిన ఇంటర్ బోర్డు నేటి వరకు ఇక్కడే కళాశాలను కొనసాగిస్తోంది. ఇక్కడి నుంచి కళాశాలను తరలించాలని జెడ్పీ హైస్కూల్ యాజమాన్యం ఎన్నిసార్లు మొత్తుకున్నా.. కలెక్టర్లు జోక్యం చేసుకున్నా ఫలితం లేదు. ప్రస్తుతం 274 మంది విద్యార్థులున్న ఈ హైస్కూల్‌లో మధ్యాహ్నం వరకు తరగతులు సాగుతున్నాయి. మధ్యాహ్నం నుంచి ఇంటర్ విద్యను కొనసాగిస్తున్నారు. షిప్ట్ విధానంపై విద్యార్థుల తిరుగుబాటు, ఆందోళనలు, ఉద్యమాలు జరిగినా పట్టించుకున్న పాపానపోలేదు.
రూ.లక్షలు వెనక్కి..
ఎంపీపీ మేడా విజయభాస్కర్‌రెడ్డి ఈ షిప్ట్ విధానానికి స్వస్తి పలకాలని భావించారు. గత ప్రభుత్వంలో లక్షలాది రూపాయలు మంజూరు చేయించారు. పీహెచ్‌సీకి సమీపంలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని ఎంపిక చేశారు. నిర్మాణ పనులు చేపట్టే సమయంలో వివాదాలు తలెత్తాయి. అంతే పెండింగ్‌లో పడింది. జూనియర్ కళాశాలను మండల కార్యాలయాల కాంప్లెక్స్ సమీపంలో నిరుపయోగంగా ఉన్న ఎస్సీ హాస్టల్‌ను కేటాయించి అక్కడికి తరలించాలని ప్రయత్నించారు. జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారులు చర్చలు జరిపారు. ఇంటర్ విద్యకు ఎస్సీ హాస్టల్‌ను ఆధునికీకరణ చేసి సరిపోతుందని భావించి ఆ దిశగా చర్యలు తీసుకున్నారు.
వ్యతిరేకిస్తున్న అధ్యాపకులు
ఏదో ఒక పూట వస్తున్నాం.. పాఠాలు చెప్పిపోతున్నాం.. అక్కడికి తరలిస్తే రెండు పూటలా కాలేజీకి రావాల్సి వస్తుంది అనుకున్నారో ఏమో... ఇంటర్ కళాశాలను తరలింపును కొందరు అధ్యాపకులు వ్యతిరేకిస్తున్నారు. మండల కాంప్లెక్స్ సమీపంలోని ఎస్సీ హాస్టల్ భవనాలు దూరమని.. అక్కడికి వెళితే ఇంటర్ బాలికలకు రక్షణ ఉండదని ప్రచారం చేశారు. నిజానికి మండల కాంప్లెక్స్ ఆవరణ ప్రశాంతంగా ఉంటుంది. దశాబ్దాలుగా అక్కడే వందలాదిమంది బాలికలతో బీసీ గురుకుల పాఠశాల కూడా ఉంది. కేవలం తమ స్వార్థం కోసం అధ్యాపకులు చేసిన వ్యవహారం వల్ల తరలింపు ఆగిపోయిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికై నా కలెక్టర్, డీఈవో, ఇంటర్ ఆర్‌జెడీ ఒకతాటిపైకి వచ్చి హైస్కూల్‌కు ఒంటిపూట బడి నుంచి విముక్తి కల్పించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.
Tags
- Famous IAS school in AP State
- IAS school
- Zilla parishad high School in nandalur
- IAS great political leaders in high School nandalur
- Famous IAS school
- ap schools news telugu
- Zilla parishad high School in nandalur news
- AP News
- IAS officers school
- nandalur Zilla parishad high School problems
- nandalur Zilla parishad high school building problem
- best teachers award nandalur Zilla parishad high school