Employment Training: నిరుద్యోగ యువతీ, యువకులకు ఉచితంగా శిక్షణ

డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్‌): రాష్ట్ర ప్రభుత్వం యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో ‘సెట్విన్‌’ సంస్ధ నిరుద్యోగ యువతీయువకులకు ఉపాధి శిక్షణనిస్తోంది. నిజామాబాద్‌ జిల్లాలో ఏకైక సెట్విన్‌ శిక్షణ సంస్ధ డిచ్‌పల్లి మండలం ఘన్‌పూర్‌ గ్రామ పంచాయతీ భవనంపై కొనసాగుతోంది. 2014లో శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

ఇక్కడ ఎస్సెస్సీ, ఇంటర్‌ ఉత్తీర్ణులైన వారికి అతితక్కువ ఫీజుతో కంప్యూటర్‌ శిక్షణ (ఎంఎస్‌–ఆఫీస్‌/డీటీపీ/ ఫొటోషాప్‌/ పేజ్‌మేకర్‌/టాలీ కోర్సులు)తోపాటు, కుట్టు (టైలరింగ్‌) శిక్షణ ఇస్తున్నారు. ఈ కోర్సులను మార్కెట్‌లోని ప్రైవేట్‌ శిక్షణ కేంద్రాల్లో నేర్చుకోవాలంటే దాదాపు రూ.4 వేల వరకు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

సెట్విన్‌లో మాత్రం కేవలం కంప్యూటర్‌ శిక్షణకు రూ.750, టైలరింగ్‌కు రూ.వెయ్యి ఫీజును వసూలు చేస్తూ యువతకు శిక్షణ ఇస్తున్నారు. మూడు నెలల అనంతరం శిక్షణ పూర్తిచేసుకున్న వారికి ప్రభుత్వం ప్రత్యేకమైన సర్టిఫికెట్‌ అందిస్తుంది.

సెట్విన్‌లో అందుకున్న సర్టిఫికెట్‌తో ప్రభుత్వ, ప్రైవేట్‌రంగాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందవచ్చు. డిచ్‌పల్లిలోని శిక్షణ కేంద్రంలో ఇప్పటి వరకు రెండువేల మందికి పైగా యువత, మహిళలు వివిధ రకాల శిక్షణ పొందినట్లు సంస్థ నిర్వాహకులు తెలిపారు.

మహిళల కోసం..
యువతులు,మహిళల కోసం కుట్టు (టైలరింగ్‌) శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ పూర్తి చేసుకుని సర్టిఫికెట్‌ పొందిన వారు సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. బ్యాంకుల ద్వారా రుణ సదుపాయాన్ని కల్పిస్తారు.

ప్రతిరోజూ దరఖాస్తుల స్వీకరణ
డిచ్‌పల్లి మండలం ఘన్‌పూర్‌లోని సెట్విన్‌ శిక్షణ కేంద్రం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఎదురుగా ఉన్న గ్రామ పంచాయతీ భవనంపై కొనసాగుతోంది. ప్రతిరోజూ దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు శిక్షణ సంస్థ జిల్లా సమన్వయకర్త అబ్రార్‌ఖాన్‌, ట్రైనర్లు సందీప్‌ (కంప్యూటర్‌), గౌతమి (కుట్టు శిక్షణ) తెలిపారు.

ముఖ్యంగా యువతీయువకులు చదువుకుంటూనే ప్రతిరోజూ రెండు గంటలపాటు శిక్షణ పొందే విధంగా వారికి అనుకూలమైన సమయాల్లో శిక్షణ ఇస్తారు. సెట్విన్‌లో శిక్షణ వివరాలు, పూర్తి సమచారం కోసం 89858 64424, 97000 07149 నంబర్లను సంప్రదించవచ్చని సమన్వయ కర్త అబ్రార్‌ఖాన్‌ సూచించారు.

ప్రస్తుతం విద్యార్థులకు వేసవి సెలవులు ఉన్నందున సెట్విన్‌ సంస్ధ ద్వారా అందించే కంప్యూ టర్‌, టైలరింగ్‌ శిక్షణను ఆసక్తి గల వారు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

#Tags