Management Courses After 12th: ఐఐఎంలో అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రాం ఇన్‌ మేనేజ్‌మెంట్‌(ఐపీఎం) కోర్సుల్లో ప్రవేశాలు

ఇంటర్‌తోనే మేనేజ్‌మెంట్‌ విద్యను అభ్యసించాలనుకునే వారికి చక్కటి అవకాశం. అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రాం ఇన్‌ మేనేజ్‌మెంట్‌(ఐపీఎం) కోర్సుల్లో ప్రవేశానికి ఐఐఎం ఇండోర్‌ ప్రకటన విడుదల చేసింది. అందుబాటులో ఉన్న మొత్తం సీట్ల సంఖ్య 150. రాత పరీక్ష, ఇంటర్వ్యూల్లో చూపిన ప్రతిభ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.

అర్హత

2021 లేదా 2022లో ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులైన విద్యార్థులు దరఖాస్తుకు అర్హులు. ప్రస్తుతం ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. పదోతరగతి, ఇంటర్‌లో కనీసం 60శాతం మార్కులు సాధించడం తప్పనిసరి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైతే 55 శాతం మార్కులు సాధిస్తే సరిపోతుంది.
వయసు: ఆగస్టు 01, 2003 తర్వాత జన్మించినవారై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు ఆగస్టు 01, 1998 తర్వాత జన్మించినా దరఖాస్తు చేసుకోవచ్చు.

చ‌ద‌వండి: Best Course After Intermediate MPC: ఎంపీసీ.. ఇంజనీరింగ్‌తోపాటు మరెన్నో!

కోర్సు స్వరూపం

  • ఐఐఎం ఇండోర్‌ ఐదేళ్ల ఐపీఎం కోర్సును 2011నుంచి అందిస్తోంది. అయిదేళ్ల ఈ కోర్సులో ఏడాదికి మూడు చొప్పున మొత్తం 15 టర్మ్‌లుంటాయి. ఒక్కో టర్మ్‌ కాలవ్యవధి 3 నెలలు ఉంటుంది. కోర్సులో రెండు భాగాలుంటాయి. మొదటి భాగంలో ఫౌండేషన్‌ అంశాలపై దృష్టిసారిస్తారు. రెండో భాగంలో మేనేజ్‌మెంట్‌ విద్యలో మెలకువలను నేర్పిస్తారు. మొదటి మూడేళ్లు భావవ్యక్తీకరణ నైపుణ్యాలు, మేనేజ్‌మెంట్‌ విద్య బేసిక్స్, నైతిక విలువలను అర్థం చేసుకునే నైపుణ్యం, శారీరక ఆరోగ్యం తదితర అంశాలపై దృష్టి సారిస్తారు. చివరి రెండేళ్లు లక్ష్యం దిశగా బోధన ఉంటుంది.
  • ఐదేళ్ల కోర్సును పూర్తిచేసుకున్న వారికి బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌(ఫౌండేషన్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌), మాస్టర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌(ఎంబీఏ) డ్యూయల్‌ డిగ్రీలను ప్రధానం చేస్తారు. కోర్సు ఫీజు, వసతి, ఇతర సౌకర్యాలు కలుపుకొని మొదటి మూడేళ్లు ఏడాదికి రూ.5లక్షలు. చివరి రెండేళ్లు డిగ్రీ తర్వాత క్యాట్‌తో పీజీపీలో చేరినవారు చెల్లించే ఫీజును వసూలు చేస్తారు.

చ‌ద‌వండి: Best Courses After 12th BiPC: బైపీసీతో... క్రేజీ కోర్సులివే!

ఎంపిక ఇలా

ఆప్టిట్యూడ్‌ టెస్ట్, పర్సనల్‌ ఇంటర్వ్యూలో సాధించిన స్కోరు ఆధారంగా అడ్మిషన్‌ లభిస్తుంది. అకడమిక్‌ సామర్థ్యాలు, కో కరిక్యూలర్‌ యాక్టివిటీస్‌ను పరీక్షిస్తారు. రాత పరీక్షలో ఆప్టిట్యూడ్, లాజికల్‌ రీజనింగ్, ఇంగ్లిష్, మ్యాథ్స్‌ నైపుణ్యాలు తెలుసుకునేలా ప్రశ్నలు వస్తాయి. ఇందులో అర్హత సాధించిన వారికి ఐఐఎం ప్రొఫెసర్ల ఆధ్వర్యంలో  పర్సనల్‌ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇందులో ప్రధానంగా విద్యార్థుల ఆత్మవిశ్వాసం, అవగాహన సామర్థ్యాలు, భావవ్యక్తీకరణ తదితరాలను పరిశీలిస్తారు.

ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌

 మొత్తం 100 ప్రశ్నలకు  పరీక్ష ఉంటుంది. ఇందులో క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ మల్టిపుల్‌ చాయిస్‌ విభాగంలో 40 ప్రశ్నలను 40 నిమిషాల్లో పూర్తిచేయాలి. క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ షార్ట్‌ ఆన్సర్‌ ప్రశ్నలు 20 వస్తాయి. వీటికి 40 నిమిషాల సమయం ఉంటుంది. వెర్బల్‌ ఎబిలిటీ మల్టిపుల్‌ చాయిస్‌ 40 ప్రశ్నలకు 40 నిమిషాల సమయం ఉంటుంది.  మొత్తం 100 ప్రశ్నలను 2 గంటల్లో పూర్తిచేయాలి. ప్రతి ప్రశ్నకు 4 మార్కులు, ప్రతి తప్పు జవాబుకు ఒక మార్కు తగ్గిస్తారు. షార్ట్‌ ఆన్సర్స్‌ ప్రశ్నలకు రుణాత్మక  మార్కులులేవు.

  • అప్టిట్యూడ్‌ టెస్ట్‌లో సెక్షన్లవారీ అర్హత సాధించిన వారిని ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. ఆప్టిట్యూడ్‌కు 65 శాతం, పర్సనల్‌ ఇంటర్వ్యూ 35 శాతం వెయిటేజీ ఉంటుంది. ఈ వెయిటేజీ ప్రకారం–తుది జాబితా రూపొందించి, మెరిట్, రిజర్వేషన్లను అనుసరించి ప్రవేశాలు కల్పిస్తారు.

చ‌ద‌వండి: Job Opportunities After Class 12th MPC : ఎంపీసీతో.. కొలువులు ఇవిగో!

ముఖ్యసమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు
  • దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్‌ 14, 2023
  • పరీక్ష తేదీ: జూన్‌ 16, 2023
  • వెబ్‌సైట్‌: https://www.iimidr.ac.in/

#Tags