Best Courses After 12th BiPC: బైపీసీతో... క్రేజీ కోర్సులివే!
- బైపీసీ ఉత్తీర్ణుల తొలి ప్రాధాన్యంగా ఎంబీబీఎస్, బీడీఎస్
- ఆయుష్ కోర్సులతోనూ వైద్య వృత్తిలో స్థిరపడే అవకాశం
- ప్రత్యామ్నాయ కోర్సులుగా నర్సింగ్, వెటర్నరీ, అగ్రికల్చర్
- ఏ కోర్సులో చేరినా.. నైపుణ్యాలుంటే ఉజ్వల భవిత ఖాయం
'బైపీసీ అంటే.. కేవలం ఎంబీబీఎస్, బీడీఎస్ కోసమే అనే ఆలోచన వీడాలి. ఈ అర్హతతో ఇప్పుడు మరెన్నో కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. వీటితోనూ ఉజ్వల భవిష్యత్తుకు మార్గం వేసుకునే అవకాశం ఉంది. విద్యార్థులు ఇలాంటి కోర్సులపైనా దృష్టి సారించాలి'-బైపీసీ విద్యార్థులకున్న ఉన్నత విద్య అవకాశాలపై నిపుణుల అభిప్రాయం. వాస్తవానికి ప్రస్తుతం బైపీసీ విద్యార్థులకు ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్‌తోపాటు బ్యాచిలర్స్, పీజీ స్థాయిలో వినూత్న కోర్సులు ఎన్నో అందుబాటులో ఉన్నాయి. అదేవిదంగా బయోటెక్నాలజీ, బయో ఇన్ఫర్మాటిక్స్, బయో మెడిసిన్ వంటి మరెన్నో కొత్త కోర్సులు పుట్టుకొస్తున్నాయి.
చదవండి: Best Course After Intermediate MPC: ఎంపీసీ.. ఇంజనీరింగ్‌తోపాటు మరెన్నో!
మెడిసిన్‌లో చేరేలా
బైపీసీ విద్యార్థులు ఎంబీబీఎస్(బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్, బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ)లో ప్రవేశానికి.. జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్-యూజీలో ర్యాంకు సాధించాలి. ఎంబీబీఎస్‌లో ప్రవేశం పొందితే.. వైద్య వృత్తికి తొలి అడుగు పడినట్లే. దీని తర్వాత పీజీ, సూపర్ స్పెషాలిటీ, పీహెచ్‌డీ ఉంటాయి. పీజీ స్థాయిలో ఎండీ లేదా ఎంఎస్ పేరుతో దాదాపు 30 స్పెషలైజేషన్లు ఉన్నాయి. పీజీ కోర్సుల్లో చేరాలనుకునే అభ్యర్థులు నీట్-పీజీ; డీఎం, ఎంసీహెచ్, డీఎన్‌బీ వంటి కోర్సుల్లో అడ్మిషన్ కోసం నీట్-ఎస్‌ఎస్ ఎంట్రన్స్ టెస్ట్‌లో విజయం సాధించాల్సి ఉంటుంది.
బీడీఎస్
ఎంబీబీఎస్ తర్వాత అధిక శాతం మంది ప్రాధాన్యం.. బీడీఎస్(బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ). ఇందులో చేరేందుకు కూడా నీట్-యూజీలో ర్యాంకు సాధించాలి. ఉన్నత విద్యలో ప్రధానంగా అందుబాటులో ఉన్న కోర్సు ఎండీఎస్(మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జరీ). మూడేళ్ల ఈ కోర్సులో పలు స్పెషలైజేషన్లు ఎంచుకోవచ్చు. ఎండీఎస్‌లో చేరాలంటే.. నీట్-పీజీ ఎంట్రన్స్‌లో ర్యాంకు సొంతం చేసుకోవాలి. ఎండీఎస్‌తోపాటు డెంటల్ మెడికల్ కేర్ విభాగంలో పీజీ డిప్లొమా కోర్సు కూడా అందుబాటులో ఉంది.
చదవండి: AYUSH Counseling: అందుబాటులో ఉన్న కళాశాలలు, ఫీజుల వివరాలు ఇలా..
ఆయుష్‌తో.. వైద్య రంగంలో!
వైద్య రంగంలో కెరీర్ కోరుకునే బైపీసీ విద్యార్థులు ఆయుష్ కోర్సులను ఎంచుకోవచ్చు. ఎంబీబీఎస్, బీడీఎస్‌లకు ప్రత్యామ్నాయంగా నిలుస్తున్న ఆయుర్వేదం, యోగా అండ్ నేచురోపతి, యునాని, సిద్ధ యోగ, హోమియోపతిలనే సంక్షిప్తంగా ఆయుష్ కోర్సులుగా పిలుస్తారు. సంప్రదాయ వైద్య రీతులుగా భావించే ఈ ఆయుష్ విభాగాలకు కూడా ఆదరణ పెరుగుతోంది. కాబట్టి ఈ కోర్సులు పూర్తి చేసుకున్నా.. వైద్య రంగంలో కెరీర్ సొంతమవుతుంది.
ఆయుష్ కోర్సులకు కూడా నీట్ ర్యాంకు ఆధారంగానే కౌన్సెలింగ్ నిర్వహించి ప్రవేశాలు కల్పిస్తారు. ఎంబీబీఎస్, బీడీఎస్ కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తయ్యాక.. నీట్-యూజీ స్కోర్ ఆధారంగా ఆయుష్ కోర్సులకు ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. వచ్చిన దరఖాస్తులు, అందుబాటులోని సీట్లు, అభ్యర్థుల ప్రాథమ్యాలను పరిగణనలోకి తీసుకొని సీట్ల కేటాయింపు చేస్తారు.
బీహెచ్‌ఎంఎస్
బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్ అండ్ సర్జరీ సంక్షిప్తంగా..బీహెచ్‌ఎంఎస్. ఎంబీబీఎస్, బీడీఎస్ తర్వాత ఆదరణ పొందుతున్న కోర్సు. ఇందులోనూ ఎంబీబీఎస్ కరిక్యులంలో ఉండే విభాగాలు ఉంటాయి. ఉన్నత విద్యలో.. పీజీ స్థాయిలో మెటీరియా మెడికా, హోమియోపతిక్ ఫిలాసఫీ వంటి స్పెషలైజేషన్లకు డిమాండ్ నెలకొంది. వీటిని కూడా పూర్తి చేస్తే భవిష్యత్తులో కెరీర్ అవకాశాలు మరింత విస్తృతం అవుతాయి.
బీఏఎంఎస్
బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ.. బీఏఎంఎస్. ఎంబీబీఎస్‌లో మాదిరిగానే ఇందులోనూ అనాటమీ, ఫిజియాలజీ, పెడియాట్రిక్స్, జనరల్ మెడిసిన్ తదితర సబ్జెక్టులు చదవాల్సి ఉంటుంది. వీటిలో నైపుణ్యం ద్వారా సహజ సిద్ధ ప్రక్రియలతో రోగులకు వైద్యం చేయగలిగే పట్టు లభిస్తుంది. ఉన్నత విద్యలో.. ఎండీ స్థాయిలో ఆయుర్వేద, ఎంఎస్-ఆయుర్వేద కోర్సులు చదవొచ్చు. ఎంబీబీఎస్‌లోని జనరల్ మెడిసిన్‌కు సరితూగే విధంగా ఉండే కాయ చికిత్స, జనరల్ సర్జరీకి సరితూగే శల్యతంత్ర కోర్సులు కూడా పీజీ స్పెషలైజేషన్లుగా ఉన్నాయి.
బీయూఎంఎస్
పూర్తిగా ప్రకృతి వైద్యంగా భావించే కోర్సు.. బీయూఎంఎస్(బ్యాచిలర్ ఆఫ్ యునానీ మెడికల్ సైన్స్). దీన్ని పూర్తి చేసిన విద్యార్థులకు పీజీ స్థాయిలో గైనకాలజీ, సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్, జనరల్ మెడిసిన్, ఫార్మకాలజీలకు సరితూగే విధంగా ఎండీ, ఎంఎస్ కోర్సులు చదివే అవకాశం ఉంది.
బీఎన్‌వైఎస్
వైద్య రంగంలో మరో ప్రత్యామ్నాయ కోర్సు.. బీఎన్‌వైఎస్(బ్యాచిలర్ ఆఫ్ నేచురోపతిక్ మెడికల్ సైన్సెస్). ఈ కోర్సును పూర్తి చేసిన వారికి యోగా, సిద్ధ యోగా వంటి విధానాల ద్వారా రోగులకు చికిత్స చేయగలిగే నైపుణ్యాలు లభిస్తాయి.
చదవండి: Career Planning: ఒకే ఒక్క నిర్ణయం.. మీ జీవిత గమనాన్నే మార్చేస్తుంది
బీవీఎస్‌సీ అండ్ ఏహెచ్
బైపీసీ విద్యార్థులకు డాక్టర్ హోదా కల్పించే మరో కోర్సు.. బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హజ్బెండరీ(బీవీఎస్‌సీ అండ్ ఏహెచ్). జంతువులకు వచ్చే వ్యాధులు, నివారణ చర్యలు, పశువుల గర్భధారణ పద్ధతులు వంటి వాటిపై అవగాహన కల్పించే కోర్సు ఇది. ఫౌల్ట్రీ ఫారాలు, ప్రభుత్వ, ప్రైవేటు పశు వైద్య ఆసుపత్రులు, పశుసంవర్థక శాలలు, వన్యమృగ సంరక్షణ కేంద్రాలు, జంతు ప్రదర్శనశాలలు, డెయిరీ ఫామ్స్, గొర్రెల పెంపకం కేంద్రాల్లో ఉపాధి అవకాశాలు లభిస్తాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ కోర్సు.. ఏపీలో శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ, తెలంగాణలో పి.వి.నరసింహరావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ పరిధిలో అందుబాటులో ఉంది. పీజీ స్థాయిలోనూ పలు స్పెషలైజేషన్లు అభ్యసించే అవకాశం ఉంది.
బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ
బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ.. సంక్షిప్తంగా బీపీటీ. వైద్య రంగంలో స్థిరపడాలనుకునే వారికి ఉపయుక్తమైన కోర్సు ఇది. ఈ కోర్సు పూర్తి చేస్తే ఫిజియోథెరపిస్ట్‌లుగా ఉద్యోగాలతోపాటు స్వయం ఉపాధి అవకాశాలు అందుకోవచ్చు.
బీఎస్సీ నర్సింగ్
వైద్య రంగంలోనే స్థిరపడే అవకాశం కల్పిస్తున్న మరో కోర్సు.. బీఎస్సీ నర్సింగ్. తెలంగాణలో ఈ ఏడాది నుంచి ఎంసెట్ ర్యాంకు ఆధారంగా బీఎస్సీ నర్సింగ్ ప్రవేశాలు చేపట్టనున్నారు. ఈ కోర్సు పూర్తి చేసుకున్న వారికి నేరుగా నర్సులుగా కెరీర్ ప్రారంభించే అవకాశం లభిస్తుంది. వీరికి ఆస్పత్రుల్లో, ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో సూపర్‌వైజర్ స్థాయి ఉద్యోగాలు లభిస్తాయి. పీజీ స్థాయిలో ఎమ్మెస్సీ నర్సింగ్ కోర్సు అందుబాటులో ఉంది. ప్రస్తుతం నర్సింగ్ కోర్సులను రాష్ట్రాల స్థాయిలో హెల్త్ యూనివర్సిటీల పరిధిలోని కళాశాలలతోపాటు జాతీయ స్థాయిలోనూ పలు ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లు అందిస్తున్నాయి.
చదవండి: Careers After Inter BiPC: మెడిసిన్‌తోపాటు మరెన్నో!
పారా మెడికల్ కోర్సులు
బైపీసీ విద్యార్థులకు ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలను అందిస్తున్నాయి.. పారా మెడికల్ కోర్సులు. ప్రధానంగా న్యూరో ఫిజియాలజీ టెక్నాలజీ, ఆప్టోమెట్రిక్ టెక్నాలజీ, రెనాల్ డయాలసిస్ టెక్నాలజీ, పెర్‌ఫ్యూజన్ టెక్నాలజీ, కార్డియాక్ కేర్ టెక్నాలజీ అండ్ కార్డియో వ్యాస్కులర్ టెక్నాలజీ, అనెస్థీషియాలజీ టెక్నాలజీ అండ్ ఆపరేషన్ థియటర్ డిగ్రీ, ఇమేజింగ్ టెక్నాలజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిని పూర్తి చేయడం ద్వారా హాస్పిటల్స్‌లో ఆయా విభాగాల్లో టెక్నీషియన్స్‌గా స్థిరపడొచ్చు. పారా మెడికల్ కోర్సులను కూడా హెల్త్ యూనివర్సిటీలే పర్యవేక్షిస్తాయి. ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా కౌన్సెలింగ్ నిర్వహించి సీట్లు భర్తీ చేస్తాయి.
చదవండి: Job Opportunities: అగ్రికల్చర్ కోర్సులు.. అందించేను అవకాశాలు
అగ్రికల్చర్ బీఎస్సీ
బైపీసీ విద్యార్థులకు కెరీర్ అవకాశాలు కల్పించే మరో చక్కటి కోర్సు.. అగ్రికల్చరల్ బీఎస్సీ. వ్యవసాయ సాగు విధానాల్లో ఆధునిక పద్ధతులు, నూతన పరికరాల వినియోగం వంటి నైపుణ్యాలను అందించే కోర్సు ఇది. తెలుగు రాష్ట్రాల్లో ఆచార్య ఎన్‌జీరంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ(ఏపీ), ఆచార్య జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ(తెలంగాణ) పరిధిలో పలు కళాశాలల్లో అగ్రికల్చర్ బీఎస్సీ అందుబాటులో ఉంది. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి ప్రైవేటు రంగంలో విత్తన ఉత్పాదక సంస్థలు, పౌల్ట్రీ ఫామ్స్‌లో ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ప్రభుత్వ విభాగంలో వ్యవసాయ శాఖలో అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ వంటి ఉద్యోగాలు లభిస్తాయి. బ్యాంకుల్లో సైతం రూరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ల విభాగంలో కొలువులు అందిపుచ్చుకోవచ్చు.
బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్
బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ సంక్షిప్తంగా.. బీఎఫ్‌ఎస్‌సీ. మత్స్య సంరక్షణ,సేకరణ వంటి విషయాల్లో ప్రత్యేక పద్ధతులు, శాస్త్రీయ విధానాలపై అవగాహన కల్పించే కోర్సు ఇది. దీన్ని పూర్తి చేసిన వారికి ఆక్వాకల్చర్ సంస్థలు, ఆక్వా రీసెర్చ్ సంస్థలు ప్రధాన ఉపాధి వేదికలుగా నిలుస్తున్నాయి. తెలంగాణలో పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ, ఏపీలో శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీల పరిధిలో ఈ కోర్సు అందుబాటులో ఉంది.
చదవండి: Nutrition Courses: ఆహార కోర్సులు... అద్భుత అవకాశాలు!!
బీటెక్-ఫుడ్ టెక్నాలజీ
ప్రస్తుత ఆధునిక పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న మరో కోర్సు.. బీటెక్-ఫుడ్ టెక్నాలజీ. ఆహార ఉత్పత్తుల తయారీ, నాణ్యత, ప్రాసెసింగ్ సంబంధిత నైపుణ్యాలు అందించే కోర్సు ఇది. దీన్ని పూర్తి చేసుకుంటే.. ఫుడ్ ప్రొడక్షన్ యూనిట్స్, ప్యాకేజ్డ్ ఫుడ్ మాన్యుఫ్యాక్చరింగ్ సంస్థల్లో కొలువుదీరొచ్చు.
బీఎస్‌సీ(సీఏబీఎం)
బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ కమర్షియల్ అగ్రికల్చర్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్.. సంక్షిప్తంగా సీఏబీఎం. బైపీసీ విద్యార్థులకు కార్పొరేట్ కొలువులకు మార్గం వేసే మరో కోర్సు ఇది. వ్యవసాయ విధానంలో ఆధునిక పద్ధతులను అన్వయించడం, వాటి ద్వారా లాభదాయకత పెంచే విధానాలను బోధిస్తారు. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, క్రాప్ ప్రొడక్షన్ కంపెనీల్లో మేనేజ్‌మెంట్ విభాగాల్లో ఉద్యోగాలు లభిస్తాయి.
బీఎస్సీ(బీజెడ్‌సీ)
బైపీసీ విద్యార్థులకు అందుబాటులో ఉన్న సాంప్రదాయ కోర్సు.. బీఎస్సీ(బీజెడ్‌సీ). ప్రస్తుతం యూనివర్సిటీలు అనుసరిస్తున్న నూతన విధానాల మేరకు.. బీజెడ్‌సీలోనూ మైక్రోబయాలజీ, జెనెటిక్స్, హ్యూమన్ జెనెటిక్స్, బయో టెక్నాలజీ, బయో ఇన్ఫర్మాటిక్స్ వంటి వినూత్న కాంబినేషన్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ సబ్జెక్ట్‌లతో బీఎస్సీ పూర్తి చేసిన తర్వాత సంబంధిత స్పెషలైజేషన్లతో పీజీతో లైఫ్ సైన్సెస్ విభాగాల్లో కొలువులు సొంతం చేసుకోవచ్చు. బీఎస్సీ తర్వాత ఇంటిగ్రేటెడ్ పీజీ+పీహెచ్‌డీ కోర్సుల్లో చేరే అవకాశం కూడా ఉంది.