Pragati Scholarship: ఓన్లీ అమ్మాయిలకే... ఏడాదికి రూ.50 వేల స్కాలర్‌షిప్.. పూర్తి వివరాలు ఇవే
ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ).. ఎంహెచ్‌ఆర్‌డీ తరఫున ఈ స్కాలర్షిప్ పథకాన్ని అమలుచేస్తోంది.
ఒకసారి వచ్చినా మళ్లీ దరఖాస్తు...
ఏఐసీటీఈ గుర్తింపు పొందిన సాంకేతిక విద్యాసంస్థల్లో డిప్లొమా/అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశం పొందిన మహిళా విద్యార్థినులు, దివ్యాంగ (పీడబ్ల్యూడీ)విద్యార్థులు ప్రగతి/సాక్షం స్కాలర్‌షిప్‌లు పొందేందుకు అర్హులు. ఇప్పటికే స్కాలర్‌షిప్ పొందుతున్న విద్యార్థులు సైతం తర్వాత దశ (సంవత్సరం)కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కొత్త వారికి, రెన్యువల్ విద్యార్థులకు వేర్వేరు దరఖాస్తులు ఉంటాయి.
ప్రగతి స్కాలర్‌షిప్....
సాంకేతిక విద్య ద్వారా మహిళలను స్వయంసమృద్ధులుగా తీర్చిదిద్దే ఉద్దేశంతో ప్రగతి స్కాలర్‌షిప్ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. విద్యార్థినుల్లో పరిజ్ఞానం, నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసాలను పెంపొందించి.. అభివృద్ధి ప్రక్రియలో వారిని భాగస్వామ్యులను చేయడం ఈ పథకం ప్రధాన లక్ష్యం..!
ప్రతీ ఏడాది నాలుగు వేలు....
ప్రతీ ఏడాది మొత్తం నాలుగు వేల మంది విద్యార్థినులకు ప్రగతి స్కాలర్‌షిప్‌లు అందిస్తారు. డిగ్రీ, డిప్లొమా విద్యార్థినులకు చెరో రెండు వేల స్కాలర్‌షిప్‌లు చొప్పున లభిస్తాయి. దీని కోసం ఆయా విద్యా సంవత్సరాలలో ఏఐసీటీఈ గుర్తింపు పొందిన టెక్నికల్ ఇన్ స్టిట్యూట్స్‌లో అండర్ గ్రాడ్యుయేట్, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం పొంది ఉండాలి. స్కాలర్‌షిప్ కింద ట్యూషన్ ఫీజు మొత్తాన్ని (గరిష్టంగా రూ.30,000) చెల్లిస్తారు. దీంతోపాటు ఏటా 10 నెలలపాటు నెలకు రూ.2 వేల చొప్పున ఇన్సిడెంటల్ చార్జీల కింద మొత్తం రూ.20 వేలు అందిస్తారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ అయినా వస్తుంది..!
ట్యూషన్ ఫీజు మాఫీ/రీయింబర్స్‌మెంట్ అయినట్లయితే... బుక్స్, ఎక్విప్‌మెంట్, సాఫ్ట్‌వేర్, ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్, వెహికల్ కొనుగోలు, పోటీ పరీక్షల ఫీజు చెల్లించే నిమిత్తం విద్యార్థినిలు ఈ మొత్తాన్ని(రూ.30,000) పొందవచ్చు. ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం, ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయి.
అర్హతలు..
సెంట్రలైజ్డ్ అడ్మిషన్ విధానంలో ఏఐసీటీఈ గుర్తింపు పొందిన ఇన్ స్టిట్యూట్స్‌లో డిప్లొమా/అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల ప్రథమ సంవత్సరంలో ప్రవేశం పొంది ఉండాలి. ఒక కుటుంబం నుంచి గరిష్టంగా ఇద్దరు విద్యార్థినులు స్కాలర్‌షిప్ పొందేందు అర్హులు. కుటుంబ వార్షిక ఆదాయం రూ.8 లక్షలకు మించని వారు అర్హులు. ఆయా సాంకేతిక విద్యా సంస్థల్లో ప్రవేశానికి నిర్వహించిన ఎంట్రన్స్ టెస్టుల్లో పొందిన మార్కుల ఆధారంగా విద్యార్థినులను స్కాలర్‌షిప్‌కు ఎంపిక చేస్తారు.
సాక్షం స్కాలర్‌షిప్....
సాంకేతిక విద్యలో దివ్యాంగులను ప్రోత్సహించేందుకు సాక్షం స్కాలర్‌షిప్‌లను ప్రారంభించారు. వీటి ద్వారా అంగవైకల్యం ఉన్న విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ అందించేందుకు ఎంహెచ్‌ఆర్‌డీ, ఏఐసీటీఈలు ఈ స్కాలర్‌షిప్ అందిస్తున్నాయి. ఈ పథకం కింద ఏటా 1000 స్కాలర్‌షిప్‌లు అందిస్తారు. వీటిలో డిగ్రీ విద్యార్థులకు 500, డిప్లొమా విద్యార్థులకు 500 కేటాయిస్తారు. అయితే కుటుంబ వార్షికాదాయం రూ.8 లక్షలకు మించని వారు అర్హులు. అంగవైకల్యం 40 శాతానికి తగ్గరాదు. ఏఐసీటీఈ గుర్తింపు పొందిన ఇన్ స్టిట్యూట్స్‌లో డిప్లొమా/అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కోర్సుల ప్రథమ సంవత్సరంలో ప్రవేశం పొంది ఉండాలి.
ప్రగతి అలాగే సాక్షం రెండు స్కాలర్‌షిప్‌లకు ఒకే రకమైన పత్రాలు అందజేయాల్సి ఉంటుంది. ప్రతీ ఏడాది ఈ స్కాలర్‌షిప్‌ల కోసం నోటిఫికేషన్ విడుదల అవుతూ ఉంటుంది. సాధారణంగా అక్టోబర్-నవంబర్ మధ్య కాలంలో నోటిఫికేషన్ వస్తుంటుంది. ఆ సమయంలోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు www.aicte-pragati-saksham-gov.in వెబ్‌సైట్‌ను చూడండి.
అవసరమైన పత్రాలు....
– ఎస్‌ఎస్‌సీ, ఇంటర్ తదితర మార్కుల మెమోలు
– ఆదాయ ధ్రువపత్రం
– వికలాంగ ధ్రువపత్రం
– అడ్మిషన్ లెటర్
– డెరైక్టర్/ప్రిన్సిపల్/ఇన్‌స్టిట్యూట్ హెడ్ జారీ చేసిన సర్టిఫికెట్
– ట్యూషన్ ఫీజు రశీదు
– బ్యాంకు పాస్‌బుక్
– కుల ధ్రువీకరణ పత్రం
– ఆధార్‌కార్డు
– పేరెంట్స్ డిక్లరేషన్
వీటిని చదవండి: డిగ్రీకి రూ.2 లక్షలు, పీజీకి రూ.6 లక్షలు..ఇలా చేస్తే యూజీ, పీజీ ఫ్రీ
వీటిని చదవండి: ఓన్‌జీసీలో 2వేల స్కాలర్‌షిప్‌లు... ఏడాదికి 48 వేలు.. వివరాలు ఇవే