Scholarships: డిగ్రీకి రూ.2 లక్షలు, పీజీకి రూ.6 లక్షలు... ఇలా చేస్తే యూజీ, పీజీ ఫ్రీ
చాలా మంది విద్యార్థులు ప్రతిభా ఉన్నా చదువుకునే స్థోమత లేకపోవడంతో చదువుకు దూరమవుతున్నారు. అలాంటి వారి కోసం రిలయన్స్ ఫౌండేషన్ ఉపకార వేతనాలను అందించి ప్రోత్సహిస్తోంది. ఏడాదికి 5100 మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్స్‌ను అందజేయనున్నారు.
ఇంటర్ పూర్తి చేసిన వారు యూజీ(ఏదైనా డిగ్రీ) స్కాలర్‌షిప్‌ల కోసం అప్లై చేసుకోవచ్చు. ఇంటర్ లేదా ప్లస్2లో 60 శాతం మార్కులతో పాసైన వారు ఇందుకు అర్హులు. యూజీ రెగ్యులర్ కోర్సు ఫస్ట్ ఇయర్ చదివే సమయంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. తల్లిదండ్రుల ఆదాయం ఏడాదికి రూ.15 లక్షలు మించకూడదు. అయితే రూ.2.5 లక్షల లోపు ఉన్న వారికి ప్రాధాన్యమిస్తారు. విద్యార్థినులు, దివ్యాంగులకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. ఎంపికైనవారు తమ డిగ్రీ వ్యవధిలో రూ.2 లక్షల వరకు ప్రోత్సాహం పొందవచ్చు. వీరికి రిలయన్స్ ఫౌండేషన్ నుంచి కెరియర్ పరమైన సహకారమూ లభిస్తుంది.
విద్యార్థులు పూర్తి వివరాలతో దరఖాస్తు చేసుకోవాలి. అర్హులకు ఫ్రీగా ఆన్‌లైన్ ఆప్టిట్యూడ్ టెస్టు నిర్వహిస్తారు. వెర్బల్, ఎనలిటికల్ అండ్ లాజికల్, న్యూమరికల్ ఎబిలిటీ విభాగాల్లో ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో విభాగం నుంచి 20.. మొత్తం 60 ప్రశ్నలు.. 60 నిమిషాల సమయం ఉంటుంది. పరీక్షకు వారం ముందు ప్రాక్టీస్ టెస్టు రాసే అవకాశం కల్పిస్తారు. ఆప్టిట్యూడ్ టెస్టు స్కోరు, అకడమిక్, పర్సనల్ సమాచారం ఆధారంగా అర్హులను ఎంపికచేస్తారు. ఆ వివరాలు మార్చిలో ప్రకటిస్తారు. మొత్తం 5 వేల మందికి స్కాలర్‌షిప్స్‌ను మంజూరు చేస్తుంది.
పీజీ కోసం ఇలా ...
దేశంలో ఏదైనా సంస్థలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ సైన్స్, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కెమికల్, రెన్యూవబుల్ అండ్ న్యూ ఎనర్జీ, మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, లైఫ్ సైన్సెస్ కోర్సులు చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్సు వ్యవధికి రూ.6 లక్షల వరకు అందిస్తారు. దరఖాస్తు చేసుకునే వారు రిలయన్స్ ఫౌండేషన్ వెబ్‌సైట్‌లో ఎలిజిబిలిటీ క్వశ్చనీర్‌ను పూర్తిచేయాలి. పర్సనల్, అకడమిక్, ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ వివరాలు నమోదు చేసుకోవాలి. రెండు రిఫరెన్స్ లెటర్లు జతచేయాలి. వీటిలో ఒకటి అకడమిక్ నైపుణ్యాలు, రెండోది వ్యక్తిత్వం.. నాయకత్వ లక్షణాలు తెలిపేది కావాలి. రెండు ఎస్సేలు ఒకటి పర్సనల్ స్టేట్‌మెంట్, రెండోది స్టేట్‌మెంట్ ఆఫ్ పర్పస్ రాసివ్వాలి. దరఖాస్తుల పరిశీలనలో నిలిచినవారికి ఇంటర్వ్యూ ప్రిపరేషన్, వెబినార్లు ఉంటాయి. ఇందులో ఎంపికైన ప్రతిభావంతులైన వంద మందికి స్కాలర్‌షిప్పులు మంజూరు చేస్తారు.
పీజీ మొదటి ఏడాది కోర్సు చదివే వారు ఇందుకు అర్హులు. అలాగే గేట్‌లో 550–1000 మధ్య స్కోర్ లేదా యూజీలో 7.5 సీజీపీఏ ఉండాలి. ఫిబ్రవరి 14వ తేదీలోపు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు ‘‘స్కాలర్‌షిప్స్.రిలయన్స్‌ఫౌండేషన్’’ వెబ్‌సైట్‌ను చూడొచ్చు.