Skip to main content

Inspirational Story: పోటీ పరీక్షల్లో సత్తా చాటిన తండ్రీకొడుకులు.. తల్లీకూతుళ్లు.. ఒకసారి వీరి గురించి తెలుసుకోవాల్సిందే..!

సాధించాలనే తపన ఉండాలే కానీ, వయసు ఏమాత్రం అడ్డంకి కాదని నిరూపిస్తున్నారు కొంతమంది ఔత్సాహికులు. వయసు మళ్లిన సమయంలోనూ అనుకున్న లక్ష్య సాధన కోసం విశ్రమించకుండా ప్రయత్నిస్తున్నారు.

ఈ కోవలోకే వస్తారు తెలంగాణకు చెందిన 52 ఏళ్ల రవికిరణ్‌.
ఇటీవల విడుదలైన గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ ఫలితాల్లో రవికిరణ్‌ సత్తాచాటారు. ప్రభుత్వ ప్రధానోపాధ్యుడిగా పనిచేస్తూ తన కుమారుడితో పాటు చదువుకుంటూ గ్రూప్‌ 1 కొట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం బ్రాహ్మణపల్లి జడ్పీహెచ్‌ఎస్‌ ఉన్నత పాఠశాలలో హెచ్‌ఎంగా పని చేస్తున్న దాసరి రవికిరణ్‌(52), ఆయన కుమారుడు మైఖేల్‌ ఇమ్మాన్యుయేల్‌(24) ఇద్దరూ ఒకేసారి ప్రిలిమ్స్‌కు అర్హత సాధించారు.


మైఖేల్‌ దూరవిద్య ద్వారా డిగ్రీ చేశారు. గ్రూప్స్‌ పరీక్షలకు సిద్ధమవుతున్న కుమారుడికి సహకారం అందిస్తూ సందేహాలు తీరుస్తూ తండ్రి కూడా చదివారు. ఇద్దరూ ఒకేసారి పరీక్ష రాసి అర్హత సాధించారు. రిజర్వేషన్‌ కోటాలో అయిదేళ్లు, ఇన్‌ సర్వీస్‌ కోటాలో అయిదేళ్ల మినహాయింపు ఉండటంతో 52 ఏళ్ల వయసులోనూ రవికిరణ్‌ గ్రూప్‌1 పరీక్షకు అర్హుడయ్యారు.  
ఎస్‌ఐ ఈవెంట్స్‌లో తల్లీకూతుళ్లు..
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెన్నారం గ్రామానికి చెందిన తోళ్ల వెంకన్న భార్య నాగమణి(37) తన కుమార్తె త్రిలోకిని(21)తో పాటు ఎస్‌ఐ పరీక్షలకు సన్నద్ధమవుతోంది. ఇప్పటికే వీరు ప్రిలిమినరీ ఎగ్జామ్‌ ఉత్తీర్ణత సాధించారు.  ప్రస్తుతం నిర్వహిస్తున్న దేహ దారుఢ్య పరీక్షల్లోనూ తల్లీకుమార్తెలిద్దరూ సత్తా చాటి ఎస్‌ఐ మెయిన్స్‌కు ఎంపికయ్యారు. ఇలా వయసుతో సంబంధం లేకుండా లక్ష్యం కోసం పాటుపడుతున్న రవికిరణ్, నాగమణి పది మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ప‌దిమందికి ఆద‌ర్శంగా నిలుస్తున్న తండ్రీకొడుకులు, త‌ల్లీకూతుళ్లు

Published date : 16 Jan 2023 05:31PM

Photo Stories