Economic Affairs: పదిమందిపై 5 శాతం టాక్స్ విధిస్తే... ఇన్ని లక్షల కోట్లా...? బిలియనీర్ల ఆస్తులపై షాకింగ్ న్యూస్
దేశంలోని ధనికుల సంపద.. దాని గురించి దిమ్మ తిరిగి పోయే వాస్తవాలను ఒక అధ్యయనం వెల్లడించింది. భారత్ లో సంపన్నులు 1 శాతం ఉంటే.. దేశం మొత్తం సంపదలో 40 శాతం వాళ్ల దగ్గరే ఉంది. ఇక సగం జనాభా దగ్గర ఉన్న సంపద కేవలం 3 శాతం మాత్రమే.
దావోస్ వేదికగా జనవరి 16 నుంచి జనవరి 20 వరకు వరల్డ్ ఎకనమిక్స్ ఫోరమ్ వార్షిక సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో ప్రపంచ వ్యాప్తంగా పేదరికాన్ని నిర్మూలించేందుకు ప్రారంభమైన స్వచ్ఛంద సంస్థ ఆక్స్‌ఫామ్ ఇంటర్నేషనల్ ‘సర్వైవల్ ఆఫ్ ది రిచెస్ట్’ పేరుతో ఓ నివేదికను విడుదల చేసింది. ఆ నివేదికలో మనదేశ సంపన్నుల వివరాలు, వారి వద్ద ఉన్న సంపదతో ఏమేమి చేయొచ్చో పొందుపరిచింది.
టాప్ 100 భారతీయ బిలియనీర్లకు 2.5 శాతం పన్ను విధించడం లేదా టాప్ 10 భారతీయ బిలియనీర్లపై 5 శాతం పన్ను విధించడం వల్ల పేదరికం కారణంగా చదువుకు దూరమైన పిల్లలను బడుల్లో చేర్పించవచ్చని తెలిపింది.
ఫోర్బ్స్ జాబితా ప్రకారం.. 128.3 బిలియన్ డాలర్లతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో భారత్‌కు చెందిన గౌతమ్ అదానీ మూడో స్థానంలో ఉన్నారు. అయితే అదానీ 2017 నుంచి 2021 వరకు సంపాదించిన అవాస్తవిక లాభాలపై ఒక్కసారి ట్యాక్స్ విధిస్తే రూ.1.79లక్షల కోట్లను సమీకరించవచ్చు. ఆ మొత్తాన్ని సంవత్సరానికి ఐదు మిలియన్లకు పైగా భారతీయ ప్రాథమిక పాఠశాల్లో ఉపాధ్యాయుల్ని నియమించుకునేందుకు సరిపోతుంది.
పోషక ఆహార లోపం తగ్గించొచ్చు
పోషకాహార లోపంలో... 121 దేశాలను పరిగణలోకి తీసుకొని ర్యాంకులను విడుదల చేయగా భారత్ 107వ స్థానాన్ని దక్కించుకుంది. తాజా ఆక్స్‌ఫామ్ ఇంటర్నేషనల్ ‘సర్వైవల్ ఆఫ్ ది రిచెస్ట్’ నివేదికలో.. భారత్‌లో ఉన్న బిలియనీర్లలో ఒక్కసారి 2 శాతం ట్యాక్స్ విధిస్తే రూ.40,423 కోట్లను సమీకరించవచ్చు. ఆ మొత్తంతో వచ్చే మూడేళ్లలో దేశ మొత్తంలో పోషకాహార లోపంతో బాధపడుతున్న వారికి బలవర్ధకమైన ఆహారాన్ని అందించవచ్చు.
భారత్‌లో ఉన్న 10 మంది బిలియనీర్లపై ఒక్కసారి 5శాతం ట్యాక్స్ విధిస్తే రూ.1.37 లక్షల కోట్లు సమీకరించవచ్చు. ఆ మొత్తం ఎంతంటే 2022–23లో కేంద్ర సంక్షేమ పథకాలైన హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్ట్రీ (రూ.86,200 కోట్లు) అంచనా వేసిన నిధుల కంటే 1.5 రెట్లు ఎక్కువ.
లింగ అసమానతపై నివేదిక ప్రకారం..ఒక పురుషుడు రూపాయి సంపాదిస్తే.. అందులో మహిళ సంపాదించేది 63 పైసలు.
కరోనా మహమ్మారి ప్రారంభమైన నాటి నుంచి 2022 నవంబర్ వరకు భారతదేశంలోని బిలియనీర్లు తమ సంపద 121 శాతం లేదా రోజుకు రూ. 3,608 కోట్ల మేర పెరిగినట్లు ఆక్స్‌ఫామ్ తెలిపింది.
మరోవైపు, 202122లో దేశ వ్యాప్తంగా మొత్తం రూ. 14.83 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు అయ్యాయి. ఆ జీఎస్టీ దేశంలోని అట్టడుగు వర్గాల నుంచి 64 శాతం వస్తే, భారత్‌లో ఉన్న టాప్ 10 బిలియనీర్ల నుంచి కేవలం 3 శాతం జీఎస్టీ వసూలైంది.
భారతదేశంలో మొత్తం బిలియనీర్ల సంఖ్య 2020లో 102 కాగా 2022 నాటికి 166కు పెరిగిందని ఆక్స్‌ఫామ్ తెలిపింది.
దేశంలోని సంపద అసమానత, బిలియనీర్ల సంపదను పరిశీలించేందుకు ఫోర్బ్స్,క్రెడిట్ సూయిస్ వంటి దిగ్గజ సంస్థల నివేదికల్ని ఆక్సోఫామ్ సంపాదించింది. అయితే నివేదికలో చేసిన వాదనలను ధృవీకరించడానికి ఎన్‌ఎస్‌ఎస్, యూనియన్ బడ్జెట్ పత్రాలు, పార్లమెంటరీ ప్రశ్నలు మొదలైన ప్రభుత్వ నివేదికలు ఉపయోగించింది.
అవాస్తవిక లాభాలంటే
వాణిజ్య భాషలో అవాస్తవిక లాభాలంటే ఉదాహరణకు..రమేష్ అనే వ్యక్తి ఏడాది క్రితం ఓ కంపెనీకి చెందిన ఓక్కో స్టాక్‌ను రూ.100 పెట్టి కొనుగోలు చేస్తే.. ఆ స్టాక్ విలువ ప్రస్తుతం రూ.105లకు చేరుతుంది. అలా పెరిగిన రూ.5 అవాస్తవిక లాభాలంటారు.