Skip to main content

Federal Bank: అమెరికా ఫెడరల్‌ బ్యాంక్‌లో వడ్డీ రేట్ల పెంపు.. ఇది పరిస్థితి

ఈ మ‌ధ్య కాలంలో అమెరికాలోని ఫెడరల్‌ బ్యాంక్‌లో వడ్డీ రేట్లు పెంచుతున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో అక్కడి వాసులు వారి రోజూవారి కొనుగోలును కూడా తగ్గించేసారు.
Federal Bank Policy Impact  Increase of interest rates   Federal Bank of America Interest Rates Rise

అమెరికా ఫెడరల్‌ బ్యాంక్‌ ఈ మధ్య కాలం వరకూ వడ్డీ రేట్లను పెంచుతూ వచ్చింది. అనంతరం గత కొద్ది దఫాల తమ సమావేశాలలో ఆ పెరిగిన వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతూ నిర్ణయాలు తీసుకుంటూ వచ్చింది. ఈ వడ్డీరేట్ల పెంపు ఉద్దేశ్యం దేశంలో పెరిగిన ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడం. ఈ చర్య వల్ల ప్రస్తుతం ఆ దేశంలో ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చింది. నవంబర్‌ 2023కు సంబంధించి వెలువడిన  అమెరికా ‘వినియోగదారుల ధరల సూచీ’ 3.1 శాతంగా నమోదు అయింది. అంతకుముందరి అక్టోబర్‌ మాసంలో ఈ ద్రవ్యోల్బణం 3.2 శాతంగా ఉంది. ముఖ్యంగా, కోర్‌ ఇన్‌ఫ్లేషన్‌గా పిలవబడే ఆహార, ఇంధన ధరల పెరుగుదలను లెక్కలలోంచి తీసివేసి, అంచనా వేసే ద్రవ్యోల్బణం 4 శాతం వద్ద స్థిరంగా ఉంది.

India's Economy to hit $5 trillion by 2026: 2026 నాటికి మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనున్న‌ భారత్‌

నిన్నా మొన్నటి వరకూ పెరుగుతూ వచ్చిన వడ్డీరేట్ల వలన అమెరికా ప్రజల కొనుగోలు శక్తీ, వారు తమ అవసరాల కోసం బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునే అవకాశాలూ తగ్గిపోతూ వచ్చాయి. అలాగే వారు తాము గృహాలు లేదా వాహనాల కొనుగోలు కోసం తీసుకున్న రుణాలపై వడ్డీ మొత్తాలు పెరిగిపోయిన కారణంగా కూడా ప్రజల కొనుగోలు శక్తి దెబ్బ తినటం, అనేక సందర్భాలలో వారు అసలు తిరిగి తమ రుణాలను చెల్లించలేని స్థితికి చేరడం వంటివీ జరిగాయి. ఈ నేపథ్యంలోనే నేడు అమెరికాలోని అనేక బ్యాంకింగ్, నాన్‌బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలకు మొండి బకాయిలు పెరిగి పోయి, ప్రస్తుతం తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాయి.

Net Direct tax collections: ప్రత్యక్ష పన్నుల వసూళ్లు రూ.10.64 లక్షల కోట్లు

ఈ పెరిగిన వడ్డీరేట్ల వలన అమెరికా ఆర్థిక వ్యవస్థలో మెల్ల మెల్లగా మందగమనం మొదలవుతోంది. అక్టోబర్‌ 2023లో అమెరికాలో ఉపాధి కల్పన 8.7 మిలియన్లకు తగ్గడం దీనిపర్యవసానమే. ఈ  రెండేళ్ల కాలంలో అతి తక్కువ స్థాయి ఇదే! ఒక పక్కన ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టిన దాఖలాలూ... మరో పక్కన తగ్గిపోతున్న ఉపాధి కల్పన గణాంకాలూ... డిసెంబర్‌ నెలలో జరిగిన అమెరికా ఫెడరల్‌ బ్యాంక్‌ సమావేశంలో 2024లో వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలు ఉన్నా యంటూబ్యాంక్‌ ఛైర్మన్‌ జరోమ్‌ పావెల్‌ సంకేతాలను ఇచ్చేలా చేశాయి.

16th Finance Commission: రాష్ట్రాల అసమానతలు పరిష్కరించే వ్య‌వ‌స్ధ ఏదంటే..

పెరిగిపోతున్న ఆటోమేషన్‌ (మర మనుషులు, సాఫ్ట్‌ వేర్‌లలో పురోగతి), కొన్ని దేశాల్లో శ్రామిక శక్తి చౌకగా లభించడం వల్ల అమెరికా వంటి ధనిక దేశాల నుంచి పరిశ్రమలు, సేవారంగం భారీగా విదేశాలకు తరలిపోతున్నాయి. అమెరికాలో నేడు ప్రజల కొనుగోలు శక్తిని నిలిపి వుంచుతోంది షేర్‌ మార్కెట్లు, రియల్‌ ఎస్టేట్‌ వంటి సట్టా వ్యాపారాలూ, ఉద్దీపనా పథకాలూ; రుణ స్వీకరణను సులువు చేస్తూ, బ్యాంక్‌వడ్డీరేట్ల తగ్గింపు వంటి చర్యలే! స్థూలంగా అటు ఉద్దీపన రూపంలో ఆర్థిక వ్యవస్థలో డబ్బు చలామణీని పెంచే చర్యలూ... అలాగే వడ్డీరేట్లను 0 (సున్నా) శాతానికి తగ్గించి వేస్తూ తీసుకున్న నిర్ణయాల వల్ల అమెరికా వంటి దేశాలలో మార్కెట్‌లో డబ్బు చలామణి విపరీతంగా పెరిగిపోయింది.

అందుకే సరఫరా పెరిగిపోయిన ఏ సరుకైనా దాని విలువ పడి పోయినట్లుగానే అమెరికా డాలర్‌ విలువ కూడా పడిపోయింది. సూక్ష్మంగా చెప్పాలంటే డాలర్‌ కొనుగోలు శక్తి పతనమై, ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. ఇలా ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు అటు ప్రజల కొనుగోలు శక్తీ, ఇటు షేర్‌ మార్కెట్లవంటి ఎటువంటి ఉత్పత్తి లేకుండానే పెట్టుబడిగా పెట్టిన డబ్బును లాభాలతో కలిపి మరింత డబ్బుగా పెంచే వ్యాపారాలు వంటివన్నీ నష్టపోతాయి. కాబట్టి ఈ పరిస్థితిని చక్కదిద్దే బాధ్యత మరలా తిరిగి ప్రభుత్వంపైనో... లేకుంటే ఆ దేశం తాలూకూ కేంద్రబ్యాంకు పైనో పడుతుంది.

Periodic Labour Force Survey Annual Report: మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్య రేటులో భారీ పెరిగుద‌ల‌

ఇక ఇప్పుడు, కేంద్రబ్యాంకు వడ్డీరేట్ల తగ్గింపు రూపంలో, తాను చలామణీలోకి తెచ్చిన అధిక నగదు మొత్తాన్నో... లేదా ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థలోకి ఉద్దీపన రూపంలో పంపిన డబ్బునో తిరిగి మరలా వెనక్కి లాక్కోవలసి వస్తుంది. దీనికోసం కేంద్రబ్యాంకు వడ్డీరేట్లను పెంచుతుంది, ప్రభుత్వం ఉద్దీపన పథకాలను నిలిపివేస్తుంది. తద్వారా, ఆర్థిక వ్యవస్థలో ఉన్న అదనపు డబ్బును వెనక్కి లాగివేసి ద్రవ్యోల్బణాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తుంది.

అమెరికాలో నేడు నడుస్తోన్న కథ ఇదే! ఆర్థిక వ్యవస్థలో మందగమనం ఏర్పడితే డబ్బు చలామణీ పెంచడం... ఈ డబ్బు చలామణీ పెరగడం వలన ద్రవ్యోల్బణం పెరిగితే తిరిగి మరలా అధికంగా చలామణిలోకి తెచ్చిన ఆ డబ్బును వెనక్కి లాగివేయటం అనే వలయమే ఈ కథ సారాంశం. అమెరికా ఆర్థిక వ్యవస్థ తాలూకు ఈ రెండు దశల మధ్యనా ఉన్న కాలవ్యవధి నేడు వేగంగా కుచించుకు పోతోంది. నిజానికి, అమెరికా ఆర్థిక వ్యవస్థలో డాలర్ల ముద్రణ గత అనేక దశాబ్దాలుగా జరుగుతున్నప్పటికీ... మనం 2008 అనంతరం పరిణామాలను ఇక్కడ ముఖ్యంగా గమనించాలి. 2008లో అమెరికాలో ఫైనాన్స్‌ సంక్షోభం ఏర్పడింది. ఈ సంక్షోభ క్రమంలో, అమెరికా జనాభాలోని సగానికి సగంమంది రాత్రికి రాత్రే దారిద్య్ర రేఖకు దిగువకు నెట్టివేయ బడ్డారు.

High Inflation countries: అధిక ద్రవ్యోల్బణం ఉన్న దేశాలు ఇవే..

ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు 2009 ఫిబ్రవరిలో ఒబామా ప్రభుత్వం 7,00,800 బిలియన్‌ డాలర్ల ఉద్దీపనను, అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఇచ్చింది. ఆ తరువాత కూడా కొద్ది దఫాలు మరిన్ని ఉద్దీపనలు ఇచ్చారు. తదనంతరం నెలవారీ (95 బిలియన్ల డాలర్ల మేర) ఉద్దీపనలను ఇస్తూ పోయారు. తరువాత ఈ ఉద్దీపనల స్టెరాయిడ్‌ల ప్రభావంతో ఆర్థిక వ్యవస్థ ‘నిలదొక్కుకుందనే’ నమ్మకం కుదిరాక, కొంతమేర ఈ ఉద్దీప నలను తగ్గించివేశారు. అయితే, 2020 కోవిడ్, లాక్‌డౌన్‌ల అనంతరం మరలా లక్షల కోట్ల డాలర్ల మేర కరెన్సీనిముద్రించి అమెరికా ఉద్దీపనలను ఇచ్చింది. లాక్‌డౌన్‌ల వలన ఇళ్ళకే పరిమితం అయిపోయి... ఆదాయాలు నిలిచిపోయిన కుటుంబీకులను ఆదుకునేందుకు ఈ చర్య అవసరంఅయ్యింది.

అయితే, 2008 తరువాతి ఉద్దీపనలూ, వడ్డీరేట్ల తగ్గింపులూ, తదనంతరం 2020 నాటి మరింత ఉద్దీపనలూ కలగలిసి 2022 నాటికి ద్రవ్యోల్బణం రూపంలో దాడి మొదలు పెట్టాయి. అప్పటికే శక్తికి మించిన భారాన్ని మోస్తోన్న ఒకఒంటె మూపుపై అదనంగా మరో గడ్డిపోచ వేసినా  కుప్ప కూలి పోయినట్లు... 2008 నుంచి పెంచుతూ వచ్చిన డాలర్ల చలామణీ ప్రభావం, అంతిమంగా 2022లో తీవ్ర ద్రవ్యోల్బణ రూపంలో బయటపడింది. దీనికి విరుగుడుగా మరలా ద్రవ్య చలామణీని తగ్గించే వడ్డీరేట్ల పెంపు వంటి నిర్ణయాలు జరుగుతూ పోయాయి. ఈ క్రమంలోనే నేడు అమెరికా తిరిగి మందగమనం, ఉపాధి కల్పనలో బలహీన స్థితికి చేరింది.

RBI Repo Rate: రిజర్వ్ బ్యాంక్ రెపో రేటు యథాతథం

ప్రస్తుత ఫెడరల్‌ బ్యాంక్‌ సమావేశం 2024లో మూడు దఫాలుగా 75 బేసిస్‌ పాయింట్ల మేరకు వడ్డీరేట్లను తగ్గించే అవకాశం గురించి మాట్లాడిందంటే ఈ మందగమనం ద్రవ్యోల్బణాల విషవలయం తాలూకు మరో రౌండ్‌ మొదలయ్యిందన్న మాట! కానీ, ఈ రౌండ్‌... గత రౌండ్‌ (2008, 2022)లు ఉన్నంత కాలం ఉండే అవకాశమే లేదు. ప్రస్తుతరౌండు వడ్డీరేట్ల తగ్గింపు నిర్ణయాలు అతి స్వల్పకాలంలోనే ద్రవ్యోల్బణం తిరిగి తలెత్తే పరిస్థితిని తెచ్చి పెడతాయి.

ఫలితంగా ప్రస్తుతం అమెరికా ఆర్థిక వ్యవస్థ తాలుకూ ఈ గడియారం లోలకం పరస్పర విరుద్ధ కొసలు అయిన వృద్ధి మందగమనం– ద్రవ్యోల్బణం మధ్య... మరింత వేగంగా కొట్టుమిట్టాడుతుంది. ఆర్థిక వ్యవస్థలో అటువంటి అనిశ్చితి అమెరికా ప్రజా జీవితంలో మరింత తీవ్ర అభద్రతకూ, అనిశ్చితికీ దారితీయగలదు. ఈ క్రమంలోనే అమెరికా డాలర్‌ పతనం ప్రమాదం కూడా మరింత తీవ్రతరం అవుతుంది. ఇదే జరిగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తాలూకూ స్వరూప స్వభావాలనే పునర్నిర్వచించే పరిస్థితి తలెత్తవచ్చు!

India Economy: ఐదు ట్రిలియన్‌ ఎకానమీతో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌

- డి. పాపారావు 
వ్యాసకర్త ఆర్థిక రంగ నిపుణులు
మొబైల్‌: 98661 79615

Published date : 19 Dec 2023 10:16AM

Photo Stories