AP Govt Schools: విద్యార్థులకు మెరుగైన బోధనే లక్ష్యం
సత్తెనపల్లి(ముప్పాళ్ల): ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన విద్యావిధానాన్ని సక్రమంగా అమలు చేయాలని సాంకేతిక విద్య(ట్యాబ్స్, ఐఎఫ్‌బీ) రాష్ట్ర నోడల్ ఆఫీసర్ సీహెచ్‌వీఎస్ రమేష్‌కుమార్ కోరారు. సత్తెనపల్లి మండలంలోని రామకృష్ణాపురంలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ బాలుర గురుకుల పాఠశాలను బుధవారం తనిఖీ చేశారు. తనిఖీల్లో భాగంగా పాఠశాలలో పూర్తి స్థాయిలో బోధన, ట్యాబ్‌ల నిర్వహణ జీరో యూసేజ్‌గా ఉన్నట్లుగా గుర్తించారు. గత ఏడాది విద్యార్థులకు అందించిన ట్యాబ్‌లు కూడా సక్రమంగా వాడటం లేదని తనిఖీల్లో నిర్ధారించుకున్నారు. ఉపాధ్యాయులు అలసత్వమే కారణంగా భావిస్తూ, ట్యాబ్‌లను పరిశీలించగా అవన్నీ ఒక గదిలో ఉన్నట్లుగా గుర్తించారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా బోధన చేసేందుకు విద్యార్థులకు అందిస్తే, నిర్వహణ సక్రమంగా లేకపోవటం బాధాకరమన్నారు. కార్పొరేట్ స్థాయిలో పాఠశాలకు కంప్యూటర్ ల్యాబ్ నిర్వహించేందుకు అవసరమైన ఫర్నీచర్, ల్యాప్‌టాప్‌లు అందించినా ఇంత వరకు ల్యాబ్ ప్రారంభించకపోవటం అలసత్వానికి నిదర్శన మని ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలకు ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన ఐఎఫ్‌బీ(మానిటర్)లు తమకు అందలేదని పాఠశాల ప్రిన్సిపాల్ జాన్సన్ వారి దృష్టికి తీసుకురాగా, అప్పటికప్పుడు పరిసర ప్రాంత పాఠశాలల్లో ఇన్‌స్టలేషన్ కానటువంటి పది ఐఎఫ్‌బీలను తెప్పించి పాఠశాల తరగతి గదుల్లో ఏర్పాటు చేశారు. రేపటి నుంచి పాఠశాలలో ఐఎఫ్‌బీ విధానంలోను బోధన చేపట్టాలని ఆదేశించారు. గత ఏడాది అందించిన వాటిల్లో పగిలిపోయిన మూడు ట్యాబ్‌లను రిపేర్ చేసి అన్ని ట్యాబ్‌లు సక్రమంగా పనిచేసేలా సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేసి విద్యార్థులకు అందించారు. అనంతరం విద్యార్ధులకు ట్యాబ్‌ల వాడకంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా స్టేట్ నోడల్ ఆఫీసర్ సీహెచ్‌వీఎస్ రమేష్‌కుమార్ మాట్లాడుతూ పాఠశాలలో అనుకున్న మేర బోధన జరగటం లేదని గుర్తించామని, అదే విషయాన్ని సోషల్ వెల్ఫేర్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఇక్కడ గుర్తించిన అంశాలపై నివేదిక అందించి విద్యార్థులకు మెరుగైన సాంకేతికవిద్యా బోధన జరిగేలా చర్యలు చేపట్టడం జరుగుతుందని చెప్పారు.
చదవండి: Education: విద్యతోనే సమాజాభివృద్ధి