Skip to main content

Education: విద్యతోనే సమాజాభివృద్ధి

● పేదల చదువులకుప్రభుత్వం అధిక ప్రాధాన్యత ● విద్యార్థులు పట్టుదలతోలక్ష్యాలను సాధించాలి
education Development
education Development

నంద్యాల(న్యూటౌన్‌): సమాజాభివృద్ధి విద్యతోనే సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ శామూన్‌ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్‌ లోని వైఎస్సార్‌ సెంటినరీ హాల్‌లో డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతి పురస్కరించుకొని నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలలో కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. శాసనమండలి సభ్యులు ఇసాక్‌ బాషా, మైనారిటీ సంక్షేమ అభివృద్ధి సలహాదారు హబీబుల్లా, మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ పీపీ నాగిరెడ్డి, హస్తకళల డైరెక్టర్‌ సునీత అమృతరాజ్‌, డీఈవో సుధాకర్‌ రెడ్డి, డీవీఈఓ సునీత తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ శామూన్‌ మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థులకు ఉత్తమ బోధన అందించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.

ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యతనిచ్చి నాడు–నేడు కింద పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తుందన్నారు. అలాగే జగనన్న అమ్మఒడి, విద్యా కానుక, ఆణిముత్యాలు తదితర సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తో విద్యార్థులకు ప్రోత్సాహం అందిస్తుందన్నారు. 5–18 సంవత్సరాల్లోపు బడి ఈడు పిల్లలందరూ పాఠశాలల్లోనే ఉండాలన్న ప్రధాన ఉద్దేశంతో గ్రాస్‌ ఎన్రోల్మెంట్‌ సర్వే ప్రభుత్వం సీరియస్‌గా చేపట్టిందన్నారు. జిల్లాలో ఇంకా దాదాపు 4వేల మంది పిల్లలు బడి ఈడు పిల్లలు బడి బయట ఉన్నారని సంబంధిత విద్యాధికారులు, సచివాలయ సిబ్బంది, వలంటీర్లు ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించి 100 శాతం లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యావ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకువచ్చి అనేక సంస్కరణలను ప్రవేశపెట్టిందన్నారు. శాసనమండలి సభ్యులు ఇసాక్‌ బాషా మాట్లాడుతూ ఏ స్థాయిలో ఉన్నా గురువు లేనిదే ఉన్నత స్థాయి లభించదన్నారు. డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ పేద కుటుంబం నుంచి ఉపాధ్యాయ వృత్తిలో రాణించి ఆ తర్వాత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అనేక ఉన్నత పదవులు అలంకరించారన్నారు. నాడు–నేడు కింద ఉపాధ్యాయులకు విద్యతో పాటు మరిన్ని బాధ్యతలు పెరిగాయన్నారు. విద్యార్థులకు ఉత్తమ బోధన అందించడంతోపాటు ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని సూచించారు.

మైనారిటీ సంక్షేమ అభివృద్ధి సలహాదారు హబీబుల్లా మాట్లాడుతూ ప్రతి వ్యక్తి సన్మార్గంలో నడిచి మంచి ప్రవర్తనతో మెలగాలంటే విద్య అత్యంత ఆవశ్యకరమన్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా పిల్లలను బాగా చదివించి మంచి భవిష్యత్తు ఇవ్వాలని తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను ఆయన కోరారు. రాష్ట్ర మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ పీపీ నాగిరెడ్డి మాట్లాడుతూ సమాజంలో ఉపాధ్యాయులకు ఎనలేని గౌరవం ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైద్య, విద్యా రంగాలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తున్నారన్నారు. అనంతరం ఎంపికై న 52 మంది ఉత్తమ ఉపాధ్యాయులను అతిథులు మెమొంటో, ప్రశంసా పత్రం అందజేసి ఘనంగా సన్మానించారు.

Published date : 06 Sep 2023 06:45PM

Photo Stories