Skip to main content

UPSC IFS Notification 2024: ఐఎఫ్‌ఎస్‌ 2024 నోటిఫికేషన్‌ విడుదల.. పరీక్ష విధానం, సిలబస్‌ విశ్లేషణ, ప్రిపరేషన్‌ గైడెన్స్‌..

ఐఏఎస్, ఐపీఎస్‌ల మాదిరిగానే మరో ఆల్‌ ఇండియా సర్వీస్‌ ఉంది. అదే.. ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌.. సంక్షిప్తంగా ఐఎఫ్‌ఎస్‌! కేంద్ర అటవీ శాఖ పరిధిలోని ఈ సర్వీస్‌కు కూడా యూపీఎస్‌సీనే ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తుంది. ఏటా ఐఎఫ్‌ఎస్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేస్తుంది. తాజాగా ఐఎఫ్‌ఎస్‌-2024 నోటిఫికేషన్‌ విడుదలైన నేపథ్యంలో.. ఈ పోస్టులకు దరఖాస్తుకు అర్హతలు, ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం, సిలబస్‌ విశ్లేషణ, ప్రిపరేషన్‌ తదితర వివరాలు..
Selection Process    : Details of how to apply for IFS-2024 posts   Tips for candidates preparing for the IFS-2024 exam  UPSC IFS Notification 2024 details and Selection Process and Exam Pattern and Syllabus Analysis and Preparation Tips
  • ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌-2024 నోటిఫికేషన్‌ విడుదల
  • మొత్తం 150 పోస్ట్‌ల భర్తీకి ఎంపిక ప్రక్రియ
  • సివిల్స్‌ ప్రిలిమ్స్‌నే ఐఎఫ్‌ఎస్‌ ప్రిలిమ్స్‌గా పరిగణన

మొత్తం పోస్టులు 150
యూపీఎస్సీ ఐఎఫ్‌ఎస్‌-2024 నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 150 పోస్టుల భర్తీకి ఎంపిక ప్రక్రియ చేపట్టనుంది.

అర్హతలు
యానిమల్‌ హజ్బెండరీ అండ్‌ వెటర్నరీ సైన్స్, బోటనీ, కెమిస్ట్రీ, జియాలజీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, జువాలజీల్లో కనీసం ఒక సబ్జెక్టుతో బ్యాచిలర్‌ డిగ్రీ లేదా అగ్రికల్చర్‌/ఫారెస్ట్రీలో బ్యాచిలర్‌ డిగ్రీ (లేదా) ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ ఉండాలి. చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

వయసు
ఆగస్ట్‌1, 2024 నాటికి 21 ఏళ్ల నుంచి 32 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులకు అయిదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు సడలింపు లభిస్తుంది.

చదవండి: UPSC CSE 2024 Notification: యూపీఎస్సీ–సివిల్‌ సర్వీసెస్‌ (ప్రిలిమినరీ) ఎగ్జామినేషన్‌–2024

మూడంచెల ఎంపిక ప్రక్రియ
ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌లో అభ్యర్థుల ఎంపికకు మూడంచెల ఎంపిక విధానాన్ని అనుసరిస్తారు. ప్రిలిమినరీ పరీక్ష; మెయిన్‌ ఎగ్జామినేషన్, పర్సనాలిటీ టెస్ట్‌/పర్సనల్‌ ఇంటర్వ్యూలు ఉంటాయి.

సివిల్స్‌ ప్రిలిమ్స్‌నే.. ఐఎఫ్‌ఎస్‌ ప్రిలిమ్స్‌గా
ఐఎఫ్‌ఎస్‌ ఎంపిక ప్రక్రియలో తొలిదశ ప్రిలిమినరీ పరీక్ష. సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమ్స్‌నే ఐఎఫ్‌ఎస్‌ ప్రి­లిమ్స్‌ పరీక్షగా పరిగణనలోకి తీసుకుంటారు. అంటే.. ఐఎఫ్‌ఎస్‌ అభ్యర్థులు ముందుగా సివిల్స్‌ ప్రిలిమ్స్‌కు హాజరై అర్హత సాధించాల్సి ఉంటుంది. దీని ఆధారంగా ఐఎఫ్‌ఎస్‌ మెయిన్‌కు ఎంపిక చేస్తారు.

రెండు పేపర్లలో ప్రిలిమినరీ పరీక్ష
ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌ రెండు పేపర్లలో 
ఆబ్జెక్టివ్‌ విధానంలో నిర్వహిస్తారు. అవి.. జనరల్‌ స్టడీస్‌ పేపర్‌-1, జనరల్‌ స్టడీస్‌ పేపర్‌-2. ఒక్కో పేపర్‌కు 200 మార్కులు చొప్పున మొత్తం నాలుగు వందల మార్కులకు ప్రిలిమ్స్‌ పరీక్ష ఉంటుంది. ప్రిలిమ్స్‌లో పొందిన మార్కుల ఆధారంగా.. ఒక్కో పోస్ట్‌కు 12 మందిని చొప్పున ఎంపిక చేసి ఐఎఫ్‌ఎస్‌ అభ్యర్థులకు ప్రత్యేకంగా మెయిన్‌ పరీక్షలు నిర్వహిస్తారు.

ఆరు పేపర్లుగా మెయిన్‌
ఐఎఫ్‌ఎస్‌ మెయిన్‌ ఎగ్జామినేషన్‌ను ఆరు పేపర్లలో పూర్తి డిస్క్రిప్టివ్‌ విధానంలో నిర్వహిస్తారు. ఈ ఆరు పేపర్లలో రెండు పేపర్లు ఉమ్మడిగా, మిగిలిన నాలుగు పేపర్లను ఆప్షనల్‌ సబ్జెక్ట్‌లకు సంబంధించి ఉంటాయి. పేపర్‌-1 జనరల్‌ ఇంగ్లిష్‌-300 మార్కులు; పేపర్‌-2 జనరల్‌ నాలెడ్జ్‌ 300 మార్కులు;పేపర్‌-3 ఆప్షనల్‌ సబ్జెక్ట్‌-1 పేపర్‌-1, 200 మార్కులు; పేపర్‌-4 ఆప్షనల్‌ సబ్జెక్ట్‌-1 పేపర్‌-2, 200 మార్కులు; పేపర్‌-5 ఆప్షనల్‌ సబ్జెక్ట్‌-2 పేపర్‌-1, 200 మార్కులు; పేపర్‌-6 ఆప్షనల్‌ సబ్జెక్ట్‌-2 పేపర్‌-2, 200 మార్కులు... ఇలా మొత్తం 1400 మార్కులకు మెయిన్‌ నిర్వహిస్తారు.

ఆప్షనల్స్‌.. సబ్జెక్ట్‌ల జాబితా

  • ఐఎఫ్‌ఎస్‌ మెయిన్‌లో అభ్యర్థులు రెండు ఆప్షనల్‌ సబ్జెక్ట్‌లను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ సబ్జెక్ట్‌ల ఎంపికకు సంబంధించి కొన్ని నిబంధనలు ఉన్నాయి. యూపీఎస్‌సీ పేర్కొన్న ఆప్షనల్‌ సబ్జెక్ట్‌ల జాబితా నుంచే సబ్జెక్ట్‌లను ఎంచుకోవాల్సి ఉంటుంది. అగ్రికల్చర్, అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్, యానిమల్‌ హజ్బెండరీ అండ్‌ వెటర్నరీ సైన్స్, బోటనీ, కెమిస్ట్రీ, కెమికల్‌ ఇంజనీరింగ్, సివిల్‌ ఇంజనీరింగ్, ఫారెస్ట్రీ, జియాలజీ, మ్యాథమెటిక్స్, మెకానికల్‌ ఇంజనీరింగ్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, జువాలజీల నుంచి ఎంచుకోవాల్సి ఉంటుంది. 
  • ఆప్షనల్‌ సబ్జెక్ట్‌లను ఎంచుకునే క్రమంలో.. కొన్ని సబ్జెక్ట్‌ కాంబినేషన్లను అంగీకరించరు. అగ్రికల్చ­ర్, అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్‌; అగ్రికల్చర్, యా­నిమల్‌ హజ్బెండరీ అండ్‌ వెటర్నరీ సైన్స్‌; అగ్రికల్చర్‌ అండ్‌ ఫారెస్ట్రీ; కెమిస్ట్రీ అండ్‌ కెమికల్‌ ఇంజనీరింగ్‌; మ్యాథమెటిక్స్‌ అండ్‌ స్టాటిస్టిక్స్‌; ఇంజనీరింగ్‌ సబ్జెక్ట్‌లకు సంబంధించి ఒక ఇంజనీరింగ్‌ సబ్జెక్ట్‌ను మాత్రమే ఆప్షనల్‌గా ఎంపిక చేసుకోవాలి. మరో ఆప్షనల్‌ సబ్జెక్ట్‌గా యూపీఎస్‌సీ నిర్దేశించిన నాన్‌-ఇంజనీరింగ్‌ సబ్జెక్ట్‌ల నుంచి ఎంచుకోవాలి.

చివరగా పర్సనాలిటీ టెస్ట్‌/ఇంటర్వ్యూ
ఐఎఫ్‌ఎస్‌ ఎంపిక ప్రక్రియలో చివరి దశ.. పర్సనాలిటీ టెస్ట్‌. మెయిన్‌లో పొందిన మార్కులు, అందుబాటులో ఉన్న ఖాళీల ఆధారంగా మెరిట్‌ జాబితా రూపొందిస్తారు. ఒక్కో పోస్ట్‌కు ఇద్దరు చొప్పున పర్సనాలిటీ టెస్ట్‌ పేరుతో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. 300 మార్కులకు నిర్వహించే ఈ ఇంటర్వ్యూలో పొందిన మార్కులు, మెయిన్‌ ఎగ్జామినేషన్‌లో సాధించిన మార్కులను కలిపి తుది విజేతలను ప్రకటిస్తారు.

చదవండి: Civils 2024 Notification: 1056 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల.. పరీక్ష విధానం, సిలబస్‌ విశ్లేషణ, ప్రిపరేషన్‌ గైడెన్స్... 

ప్రిపరేషన్‌ పక్కాగా
ప్రిలిమ్స్‌ నుంచే పట్టు
అభ్యర్థులు ప్రిలిమ్స్‌ పరీక్ష సన్నద్ధత నుంచే పకడ్బందీగా వ్యవహరించాలి. ముందుగా సిలబస్‌ను పరిశీలించి స్పష్టత తెచ్చుకోవాలి. గత ప్రశ్న పత్రాల పరిశీలన ద్వారా ఏ అంశాలకు ఎంత వెయిటేజీ ఉంటోంది.. పరీక్షలో ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు. ప్రశ్నలు అడిగే తీరు తదితర అంశాలపై అవగాహన పెంచుకోవాలి.

కరెంట్‌ అఫైర్స్‌పై ప్రత్యేక ఫోకస్‌
గత కొన్నేళ్ల ప్రిలిమ్స్‌ పేపర్ల సరళిని పరిగణనలోకి తీసుకుంటే.. కరెంట్‌ అఫైర్స్‌ సంబంధిత అంశాలు, అదే విధంగా కోర్‌ అంశాలను సైతం సమకాలీన పరిణామాలతో కలిపి అడిగే ప్రశ్నలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి అభ్యర్థులు కరెంట్‌ అఫైర్స్‌­కు అధిక ప్రాధాన్యత ఇస్తూ అభ్యసనం సాగించాలి.

జీకే.. ఒకే సమయం
మెయిన్‌ ఎగ్జామినేషన్‌లో పేపర్‌-2గా జనరల్‌ నాలెడ్జ్‌ ఉంటుంది. అభ్యర్థులు ప్రిలిమ్స్‌ జనరల్‌ స్టడీస్‌ పేపర్‌-1 ప్రిపరేషన్‌ను మెయిన్స్‌ జనరల్‌ నాలెడ్జ్‌ పేపర్‌ సిలబస్‌తో అనుసంధానం చేసుకుంటూ.. అధ్యయనం సాగిస్తే రెండు పేపర్లకు ఒకే సమయంలో సంసిద్ధత పూర్తవుతుంది.

ప్రిలిమ్స్‌ పేపర్‌-2
ఇది అర్హత పరీక్షే కానీ.. ఇందులో 33 శాతం మార్కులు సొంతం చేసుకుంటే మిగతా పేపర్ల మూల్యాంకన చేస్తారు. ఇందులో రాణించేందుకు బేసిక్‌ మ్యాథమెటిక్స్, న్యూమరసీ, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ తదితర అంశాలపై పట్టు సాధించాలి.

ప్రిలిమ్స్‌తోపాటే మెయిన్స్‌
ప్రిలిమ్స్, మెయిన్స్‌కు ఒకే సమయంలో ప్రిపరేషన్‌ సాగించే విధంగా టైమ్‌ ప్లాన్‌ రూపొందించుకోవాలి. జనరల్‌ నాలెడ్జ్‌లో హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ తదితర కోర్‌ సబ్జెక్ట్‌లు మొదలు సమకాలీన సమస్యల వరకు ప్రశ్నలు అడుగుతారు. ఆయా సబ్జెక్ట్‌లకు సంబంధించి బేసిక్స్‌పై అవగాహన పెంచుకోవాలి. ప్రస్తుత వాస్తవ పరిస్థితుల్లో సంబంధిత విభాగాల్లో జరుగుతున్న పరిణామాలను విశ్లేషించే నైపుణ్యం సొంతం చేసుకోవాలి.

ఆప్షనల్స్‌కు ఇలా
మెయిన్‌ ఎగ్జామినేషన్‌లో రెండు ఆప్షనల్‌ సబ్జెక్ట్‌­లు, ఒక్కో సబ్జెక్ట్‌లో రెండు పేపర్లు చొప్పున మొత్తం నాలుగు పేపర్లకు సన్నద్ధత పొందాల్సి ఉంటుంది. తమకు బాగా పట్టున్న సబ్జెక్ట్‌లనే ఆప్షనల్‌గా ఎంచుకోవాలి. ఆప్షనల్స్‌ను ఎంచుకున్నాక ఆయా సబ్జెక్ట్‌లకు సంబంధించి బేసిక్స్, కాన్సెప్ట్స్, ఫార్ములాస్, థీరమ్స్‌ వంటి వాటిపై అవగాహన పెంచుకోవాలి. పరీక్షల్లో వస్తున్న ప్రశ్నలను పరిశీలించి.. ఆ దిశగా సాధన ప్రారంభించాలి. అభ్యర్థులు ఒక ఆప్షనల్‌ను తమ డొమైన్‌ సబ్జెక్ట్‌ నుంచి ఎంచుకుంటే ప్రయోజనకరంగా ఉంటుంది.

రైటింగ్‌కూ ప్రాధాన్యం
మెయిన్స్‌ ఎగ్జామినేషన్‌ పూర్తిగా డిస్క్రిప్టివ్‌ విధానంలో ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు రీడింగ్‌కే పరిమితం కాకుండా..రైటింగ్‌ ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. ఒక్కో ప్రశ్నకు లభించే సమయాన్ని పరిగణనలోకి తీసుకుంటూ ప్రాక్టీస్‌ చేయాలి.

నిర్దిష్ట ప్రణాళిక
అన్ని సబ్జెక్ట్‌లకు సమయం కేటాయించేలా టైంప్లాన్‌ రూపొందించుకోవాలి. కనీసం రోజుకు పది గంటలు చదివేలా సమయ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. అదే విధంగా ప్రతి సబ్జెక్ట్‌కు నిర్దిష్టంగా సమయం కేటాయించుకొని.. ఆ సమయంలో ఆ సబ్జెక్ట్‌నే చదవాలి. ఆ తర్వాత మరో సబ్జెక్ట్‌వైపు దృష్టి పెట్టాలి. ఇలా ప్రిలిమ్స్‌ నుంచే నిర్దిష్ట వ్యూహాలు అనుసరిస్తూ అభ్యసనం సాగించడం వల్ల ఆశాజనక ఫలితం వచ్చే అవకాశం ఉంది.

చదవండి: Previous Question Papers: పరీక్ష ఏదైనా ప్రీవియస్‌పేపెర్లే ‌.. ప్రిపరేషన్‌ కింగ్‌ 

ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 2024, మార్చి 5
  • దరఖాస్తు సవరణ అవకాశం: 2024 మార్చి 6- 12 వరకు.
  • ప్రిలిమ్స్‌ పరీక్ష తేదీ: 2024, మే 26
  • మెయిన్‌ ఎగ్జామినేషన్‌: నవంబర్‌ 24 నుంచి ఏడు రోజులు
  • వివరాలకు వెబ్‌సైట్‌: https://www.upsc.gov.in/

చదవండి: Indian Railway Jobs: 5,696 పోస్ట్‌లకు నోటిఫికేషన్‌ విడుదల.. పరీక్ష విధానం, సిలబస్‌, ప్రిపరేషన్‌ గైడెన్స్...

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

sakshi education whatsapp channel image link

Published date : 27 Feb 2024 04:59PM

Photo Stories