Civils Interview Guidance: సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ.. రాణించే వ్యూహం..
1,056 పోస్ట్‌లకు.. 2,845 మంది ఎంపిక
యూపీఎస్సీ 21 సర్వీసుల్లో మొత్తం 1,056 పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. తొలిదశ ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్, ఆ తర్వాత రెండో దశ మెయిన్స్‌లో ప్రతిభ చూపిన అభ్యర్థులను తుది దశ పర్సనాలిటీ టెస్ట్‌కు ఎంపిక చేసింది. మొత్తం 2,845 మందికి జనవరి 7వ తేదీ నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. వీరిలో తెలుగు రాష్ట్రాల నుంచి 80 నుంచి 90 మంది వరకు ఉంటారని ప్రాథమిక అంచనా. ఇంటర్వ్యూకు కేటాయించిన మార్కులు 275.
పర్సనల్ టు ప్రొఫెషనల్
ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థులు ప్రిపరేషన్ క్రమంలో వ్యక్తిగత నేపథ్యం నుంచి ప్రొఫెషనల్ ప్రొఫైల్ వరకూ.. అన్ని విషయాలపైనా అవగాహన పెంచుకోవాలి. ఇంటర్వ్యూలో వ్యక్తిగత అంశాలపైనా ప్రశ్నలు ఎదురవుతున్నాయి.అభ్యర్థులు తమ వ్యక్తిగత వివరాలు, పని అనుభవం ఉంటే గత విధి నిర్వహణ, ఇప్పటి వరకు తాము సాధించిన పురోగతి, వాటి ద్వారా తాము పని చేస్తున్న సంస్థకు చేకూరిన ప్రయోజనం వంటి వాటిపై దృష్టిపెట్టాలి.
‘సోషల్ సర్వీస్ లక్ష్యంగా’
ఇంటర్వ్యూలో అభ్యర్థులకు తప్పనిసరిగా ఎదురయ్యే ప్రశ్న.. సివిల్ సర్వీసెస్‌నే ఎంపిక చేసుకోవడానికి కారణం ఏంటి? అని! దీనికి అభ్యర్థులు ఠక్కున చెప్పే సమాధానం.. సామాజిక సేవ లక్ష్యం!! అయితే ఈ సమాధానాన్ని సమర్థించుకునే భావవ్యక్తీకరణ నైపుణ్యం చాలా అవసరం.
ముఖ్యంగా ఇంజనీరింగ్, ఎంబీఏ వంటి కోర్సుల అభ్యర్థులు ‘సోషల్ సర్వీస్ లక్ష్యంగా సివిల్స్’ అనే సమాధానం చెప్పే విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రస్తుతం తాము పని చేస్తున్న సంస్థ ద్వారా సమాజానికి ఉపయోగపడే విధంగా అమలవుతున్న విధానాలు (ఉదాహరణకు.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్స్ అయితే.. నేటి డిజిటైజేషన్ యుగంలో సాఫ్ట్‌వేర్ సర్వీసెస్ ద్వారా సమాజానికి కలుగుతున్న ప్రయోజనం తెలియజేయడం) చెప్పగలిగే విధంగా సన్నద్ధంగా ఉండాలి.
చదవండి: Free Civils Prelims Coaching: మనూలో ఉచిత సివిల్స్ ప్రిలిమ్స్ కోచింగ్.. దరఖాస్తుకు చివరి తేదీ ఇదే
డీఏఎఫ్‌పై ఫోకస్
సివిల్స్ ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు తాము మెయిన్స్‌కు దరఖాస్తు సమయంలో పూర్తి చేసిన డిటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్(డీఏఎఫ్)లో పొందుపర్చిన అంశాలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలి. ఉదాహరణకు..హాబీలు, సర్వీ సు ప్రాధాన్యత, వ్యక్తిగత నేపథ్యం,పుట్టిన ప్రదేశం వంటివి.
సూటిగా, స్పష్టంగా
ఇంటర్వ్యూ సమయంలో అభ్యర్థులు తమ అభిప్రాయాలను సూటిగా, స్పష్టంగా చెప్పగలిగే సామర్థ్యం అలవర్చుకోవాలి. ఇందుకోసం ఇప్పటి నుంచే ప్రాక్టిస్ చేయడం ప్రారంభించాలి. ఆయా అంశాలపై తమ అభిప్రాయాలను బలపరిచే ఉదాహరణలను సిద్ధం చేసుకోవాలి.
హాబీలపై కసరత్తు
అభ్యర్థులు తాము అప్లికేషన్‌లో పేర్కొన్న హాబీలపై ఇప్పటి నుంచే ప్రత్యేక కసరత్తు చేయాలి. చాలామంది బుక్ రీడింగ్, వాచింగ్ టీవీ, సింగింగ్, ప్లేయింగ్, మూవీస్ వంటి వాటిని పేర్కొంటారు. ఇంటర్వ్యూ సమయంలో వీటిపైనా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. బోర్డ్‌లో పలు నేపథ్యాల నిపుణులు ఉంటారు. సదరు రచయిత రాసిన ఫలానా పుస్తకం చదివారా.. అందులో మీకు బాగా నచ్చిన అంశం ఏంటి.. లేదా అందులో వివాదాస్పదమైన అంశం ఏంటి.. వంటి ప్రశ్నలు ఎదురవుతాయి. గతేడాది సింగింగ్‌ను హాబీగా పేర్కొన్న అభ్యర్థిని.. ఏదైనా ఒక పాట పాడమని అడిగారు.
స్థానిక పరిస్థితులు, సమస్యలపై అవగాహన
పర్సనల్ ఇంటర్వ్యూకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు తమ స్వస్థలానికి సంబంధించిన సామాజిక, చారిత్రక నేపథ్యంపై అవగాహన పెంచుకోవాలి. అదే విధంగా ప్రస్తుతం స్థానికంగా ప్రాధాన్యం సంతరించుకుంటున్న సమస్యలు, వాటి పరిష్కారానికి మార్గాలపైనా ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి స్థానిక పరిస్థితులు, సమస్యలపై అవగాహనతోపాటు పరిష్కారానికి అనుసరించాల్సిన విధానాలపై దృష్టిపెట్టాలి. అదేవిధంగా అభ్యర్థుల వ్యక్తిగత బలాలు, బలహీనతలకు సంబంధించిన ప్రశ్నలు కూడా ఎదురవుతున్నా యి. తమకున్న బలహీనతల గురించి చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ‘అగ్రెసివ్‌నెస్’, ‘సహనం తక్కువ’ వంటి సమాధానాలు చెప్పకపోవడమే మేలు.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
వర్తమానం ఎంతో కీలకం
సివిల్స్ ఇంటర్వ్యూలో వర్తమాన అంశాలపై తప్పనిసరిగా ప్రశ్నలు అడుగుతారు. ముఖ్యంగా అంతర్జాతీయ ఒప్పందాలు, ద్వైపాక్షిక సంబంధాలు,ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన అంశాలపైనా బోర్డ్ సభ్యుల నుంచి ప్రశ్నలు ఎదురవుతాయి.
కాబట్టి అభ్యర్థులు పర్సనల్, ప్రొఫెషనల్ అంశాలతోపాటు కరెంట్ అఫైర్స్‌పైనా పట్టు సాధించాలి. ఇందుకోసం ప్రతి రోజు కనీసం రెండు దినపత్రికలు సమగ్రంగా, విశ్లేషణాత్మకంగా చదవాలి. అదేవిధంగా ఇంటర్వ్యూ రోజు తప్పనిసరిగా దినపత్రికలు చదివి వెళ్లడం అవసరం. కొన్ని సందర్భాల్లో ‘ఈ రోజు ఏ పేపర్ చదివారు. అందులో మీరు ప్రధానంగా భావించిన వార్త ఏంటి? ఎందుకు’ వంటి ప్రశ్నలు సైతం ఎదురయ్యే ఆస్కారముంది.
ముఖాముఖి చర్చా వేదికగా
పర్సనల్ ఇంటర్వ్యూ అంటే కేవలం కొశ్చన్ అండ్ ఆన్సర్ విధానం అనే అభిప్రాయానికి స్వస్తి పలకాలి. ఇంటర్వ్యూను ఒక చర్చా వేదికగానూ భావించాల్సిన పరిస్థితి ఇటీవల కాలంలో పెరిగింది. 20 నుంచి 25 నిమిషాల వ్యవధిలో నిర్వహించే ఇంటర్వ్యూ.. చిన్నపాటి చర్చగా మారుతున్న పరిస్థితి నెలకొంది. ఇలాంటి సందర్భాల్లో రాణించేందుకు అభ్యర్థులు ఆయా ముఖ్యాంశాలను, సమకాలీన పరిణామాలను కూలంకషంగా తెలుసుకోవాలి. వాస్తవాలు, గణాంకాలతో తమ అభిప్రాయాలను సమర్థించుకునేలా సన్నద్ధత పొందాలి.
సమస్య పరిష్కార నైపుణ్యం
ఇంటర్వ్యూ బోర్డ్ అభ్యర్థుల నుంచి ఆశిస్తున్న మరో లక్షణం.. సమయస్ఫూర్తి,సమస్య పరిష్కార నైపుణ్యం!!. ‘మీరు ఒక ఐఏఎస్ అధికారిగా ఉన్నారు. ఆ ప్రాంతంలో ఫలానా సమస్య ఎదురైంది.. దీనికి తక్షణ పరిష్కారంగా మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు?’ వంటివి. ఇలాంటి వాటికి సమాధానం ఇచ్చేటప్పుడు చాలా అప్రమత్తంగా వ్యవహరించాలి. బోర్డును మెప్పించే విధంగా సమాధానం చెప్పాలి. ప్రభుత్వ విధానాలను గౌరవిస్తూ.. పరిష్కార చర్యలు చేపడతామనే విధంగా సమాధానాలు చెప్పాలి.
బాడీ లాంగ్వేజ్
ఇంటర్వ్యూ అభ్యర్థులు తమ బాడీ లాంగ్వేజ్‌పై ఇప్పటి నుంచే కసరత్తు చేయాలి. వ్యక్తిగత శైలి హుందాగా ఉండాలి. పురుష అభ్యర్థులు లైట్ కలర్ షర్ట్స్ ధరించడం హుందాగా ఉంటుంది. అదే విధంగా మహిళా అభ్యర్థులు శారీ, లేదా సల్వార్ కమీజ్‌లను ధరించి ఇంటర్వ్యూకు హాజరవడం సదాభిప్రాయం కలిగేలా చేస్తుంది. ఇంటర్వ్యూ సమయంలో సమాధానాలిచ్చేటప్పుడు బాడీలాంగ్వేజ్ ఎంతో ముఖ్యం. హావ భావాలను నియంత్రించుకోవాలి. నియంత్రిత స్పందన ముఖ్యమని గుర్తించాలి.
సమాధానాల్లో నిజాయతీ
ఇంటర్వ్యూకు సమాధానాలిచ్చే క్రమంలో నిజాయతీగా వ్యవహరించాలి. సమాధానం తెలియకపోతే తెలియదని చెప్పాలి. ఇంటర్వ్యూ సమయంలో అభ్యర్థులు తమ భావోద్వేగాలను నియంత్రించుకునే విధంగా వ్యవహరించాలి. కొన్ని సందర్భాల్లో అభ్యర్థుల సహనాన్ని పరీక్షించే విధంగా అసందర్భ ప్రశ్నలు అడగడం లేదా సమాధానం కరెక్ట్‌గా చెప్పినా.. అది తప్పు అని వాదించడం వంటివి ఎదురవుతాయి. అలాంటి సందర్భాల్లో ఉద్రేకానికి గురి కాకుండా.. బోర్డ్ మెంబర్స్‌ను మెప్పించేలా హుందాగా వ్యవహరించాలి.
అలవర్చుకోవాల్సిన లక్షణాలు
సానుకూల దృక్పథం; సరైన బాడీ లాంగ్వేజ్; భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం; సమకాలీన అంశాలపై అవగాహన; సమయస్ఫూర్తి; సమస్య పరిష్కార నైపుణ్యం; సహనం, ఓర్పు; పేపర్ రీడింగ్; స్పష్టమైన అభిప్రాయాలు, భావ వ్యక్తీకరణ వంటి మెరుగుపరచుకోవాలి.
Tags
- UPSC
- Civils Interview Guidance
- Interview Guidance Program
- Civil Services Examination
- Civil Services Exam 2024 Eligibility
- UPSC CSE 2024 Interview Schedule Released
- IAS Exam 2024
- IAS
- IFS
- IPS
- Civils 2024 Mains Results
- Civil Services Examination Eligibility
- Civil Service Exam Age Limit
- UPSC Interview
- UPSC Interview Questions
- UPSC interview schedule