Indian Railway Jobs: 5,696 పోస్ట్‌లకు నోటిఫికేషన్ విడుదల.. పరీక్ష విధానం, సిలబస్, ప్రిపరేషన్ గైడెన్స్...
- దేశ వ్యాప్తంగా 21 ఆర్‌ఆర్‌బీల ద్వారా 5,696 పోస్ట్‌ల భర్తీ
- ఆర్‌ఆర్‌బీ-సికింద్రాబాద్ పరిధిలో 758 ఉద్యోగాలు
- రాత పరీక్ష, ఆప్టిట్యూడ్ టెస్ట్‌లో ప్రతిభ ఆధారంగా ఎంపిక
- పే లెవల్-2తో ప్రారంభ వేతనం; మరెన్నో సదుపాయాలు
మొత్తం 5,696 పోస్టులు
భారత రైల్వే శాఖ ప్రకటించిన నోటిఫికేషన్ ప్రకారం-21 ఆర్‌ఆర్‌బీల పరిధిలో మొత్తం 5,696 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్ట్‌లను భర్తీ చేయనున్నారు. ఆర్‌ఆర్‌బీ- సికింద్రాబాద్ పరిధిలో 758 ఖాళీలున్నాయి. వీటిలో దక్షిణ మధ్య రైల్వేలో 559 పోస్ట్‌లు, ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో 199 పోస్ట్‌లు ఉన్నాయి. అదే విధంగా దక్షిణ మధ్య రైల్వేకు సంబంధించి ఆర్‌ఆర్‌బీ-ముంబై పరిధిలోనూ 26 పోస్ట్‌లను; ఈస్ కోస్ట్ రైల్వే జోన్‌కు సంబంధించి ఆర్‌ఆర్‌బీ-భువనేశ్వర్ పరిధిలో 280 పోస్ట్‌లను పేర్కొన్నారు. అభ్యర్థులు ఏదో ఒక ఆర్‌ఆర్‌బీకి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలనే నిబంధన విధించారు. సదరు ఆర్‌ఆర్‌బీ పరిధిలోని జోన్లను ప్రాధాన్యత క్రమంలో ఎంచుకోవాలి.
విద్యార్హత
- ఫిట్టర్, ఎలక్ట్రిషియన్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, మిల్‌రైట్/మెయింటనెన్స్ మెకానిక్, మెకానిక్ (రేడియో అండ్ టీవీ), మెకానిక్ (మోటార్ వెహికిల్), వైర్‌మ్యాన్, ట్రాక్టర్ మెకానిక్, ఆర్మేచర్ అండ్ కాయిల్ వైండర్, మెకానిక్ (డీజిల్), హీట్ ఇంజన్, టర్నరల్, మెకనిస్ట్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ మెకానిక్ ట్రేడ్‌లలో ఏదో ఒక ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి (లేదా)-మెకానికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ బ్రాంచ్‌లతో డిప్లొమా లేదా బీటెక్ ఉత్తీర్ణత ఉండాలి.
- వయసు: జూలై 1, 2024 నాటికి 18-30 ఏళ్లు ఉండాలి. ఎస్‌సీ, ఎస్టీ వర్గాలకు అయిదేళ్లు, ఓబీసీ(నాన్-క్రీమీ లేయర్) వర్గాలకు మూడేళ్లు చొప్పున గరిష్ట వయో పరిమితిలో సడలింపు లభిస్తుంది.
పే లెవల్-2తో ప్రారంభ వేతనం
అసిస్టెంట్ లోకో పైలట్‌గా ఎంపికైన వారికి పే లెవల్-2తో ప్రారంభ వేతనం లభిస్తుంది. రూ.19,900-రూ.34,500 వేతన శ్రేణి అందుతుంది. ప్రారంభంలో నెలకు వేతనం రూ.35వేలు అందుకోవచ్చు. లోకో పైలట్‌గా ఎంపికైన వారికి వేతనంతోపాటు ఇతర సదుపాయాలను కూడా రైల్వే శాఖ కల్పిస్తోంది. నివాసానికి క్వార్టర్స్, రవాణా, విద్య, వైద్యం, సబ్సిడీ క్యాంటీన్ వంటి అనేక సౌకర్యాలు పొందే వీలుంటుంది. అసిస్టెంట్ లోకో పైలట్‌గా నియమితులైన వారు..భవిష్యత్తులో లోకో పైలట్ (హైస్పీడ్) స్థాయికి చేరుకునే అవకాశం ఉంది.
మూడు దశల ఎంపిక ప్రక్రియ
అసిస్టెంట్ లోకో పైలట్ పోస్ట్‌ల భర్తీకి మూడు దశల ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. అవి.. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్-1, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్-2, కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్.
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్-1
ఎంపిక ప్రక్రియలో తొలి దశగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్-1ను నిర్వహిస్తారు. ఈ పరీక్షలో.. మ్యాథమెటిక్స్, మెంటల్ ఎబిలిటీ, జనరల్ సైన్స్, జనరల్ అవేర్‌నెస్ విభాగాల నుంచి 75 ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష వ్యవధి ఒక గంట.
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్-2
తొలిదశ సీబీటీ-1లో ప్రతిభ ఆధారంగా ఒక్కో పోస్ట్‌కు 15 మందిని చొప్పున ఎంపిక చేసి.. రెండో దశలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్-2ను నిర్వహిస్తారు. సీబీటీ-2 పరీక్షలో పార్ట్-ఎ, పార్ట్-బి ఉంటాయి. పార్ట్-ఎలో మ్యాథమెటిక్స్; జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్; బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 100 ప్రశ్నలతో 90 నిమిషాల వ్యవధిలో పార్ట్-ఎ ఉంటుంది. పార్ట్-బిలో సంబంధిత ట్రేడ్ నుంచి ప్రశ్నలు ఇస్తారు. మొత్తం 75 ప్రశ్నలకు 60 నిమిషాల్లో సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. పార్ట్-బి పూర్తిగా అర్హత పరీక్ష మాత్రమే. రెండు పేపర్లలోనూ నెగెటివ్ మార్కింగ్ నిబంధన ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3వ వంతు మార్కును తగ్గిస్తారు.
ప్రాంతీయ భాషల్లో పరీక్ష
అసిస్టెంట్ లోకో పైలట్ ఎంపిక ప్రక్రియలో.. సీబీటీ-1, 2లను 13 ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించనున్నారు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు తెలుగు లేదా ఉర్దూలో పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉంది. మూడో దశ పరీక్ష సీబీఏటీని మాత్రం ఇంగ్లిష్ లేదా హిందీ మాధ్యమంలోనే నిర్వహిస్తారు.
మూడో దశ.. కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్-2లో చూపిన ప్రతిభ ఆధారంగా.. ఒక్కో పోస్ట్‌కు ఎనిమిది మంది చొప్పున (1:8 నిష్పత్తిలో) మూడో దశ కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్‌కు ఎంపిక చేస్తారు. ఇందులో భాగంగా.. సైకో మాటిక్ టెస్ట్, రీజనింగ్ టెస్ట్, అదే విధంగా పరిశీలన, తులనాత్మక పరిశీలనను పరీక్షించే విధంగా ప్రశ్నలు అడుగుతారు. అదే విధంగా రియాక్షన్ టైమ్ టెస్ట్, ఫామ్ పర్సెప్షన్ టెస్ట్, గ్రూప్ బోర్డన్ టెస్ట్, స్పీడ్ పర్సెప్షన్ టెస్ట్, విజువల్ డిఫరెన్షియేటింగ్ టెస్ట్‌లు ఉంటాయి.
తుది జాబితా ఇలా
తుది జాబితా రూపకల్పనలో వెయిటేజీ విధానం ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్-2లోని పార్ట్-ఎలో పొందిన మార్కులకు 70 శాతం వెయిటేజీ; కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ మార్కులకు 30 శాతం వెయిటేజీ కల్పించి.. దానికి అనుగుణంగా తుది జాబితా రూపొందిస్తారు. ఈ జాబితాలో నిలిచిన వారికి చివరగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ పేరుతో సర్టిఫికెట్లను పరిశీలిస్తారు. ఈ దశను కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంటే అసిస్టెంట్ లోకో పైలట్‌గా కొలువు సొంతమైనట్లే.
చదవండి: RRB-Study Material
పరీక్షలో విజయానికి ఇలా
లోకో పైలట్ నియామకాలకు కీలకంగా నిలుస్తున్న కంప్యూటర్ బేస్డ్ టెస్ట్-1, టెస్ట్-2లలో విజయానికి సబ్జెక్ట్ వారీగా దృష్టి సారించాల్సిన అంశాలు..
మ్యాథమెటిక్స్
మ్యాథమెటిక్స్ సిలబస్‌లో నంబర్ సిస్టమ్, బాడ్‌మాస్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, ఎల్‌సీఎం, హెచ్‌సీఎఫ్; రేషియో అండ్ ప్రపోర్షన్; పర్సంటేజెస్, మెన్సురేషన్; టైం అండ్ వర్క్; టైం అండ్ డిస్టెన్స్; ఇంట్రస్ట్; ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్జీబ్రా, ట్రిగనోమెట్రీ, జామెట్రీ, కేలండర్ అండ్ క్లాక్. వీటికోసం తొలుత పాఠశాల స్థాయి పాఠ్యపుస్తకాల్లోని ప్రాథమిక భావనలపై అవగాహన పెంపొందించుకోవాలి. దీంతోపాటు బ్యాంకు, ఎస్‌ఎస్‌సీ, రైల్వే పరీక్షలకు సంబంధించిన పాత ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేయడం లాభిస్తుంది.
జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్
సిలబస్‌లో అనాలజీస్, ఆల్ఫాబెటికల్, నంబర్ సిరీస్, కోడింగ్-డీకోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, రిలేషన్‌షిప్స్, జంబ్లింగ్, వెన్‌డయాగ్రమ్, డేటా ఇంటర్‌ప్రెటేషన్, సఫీషియెన్సీ; కన్‌క్లూజన్ అండ్ డెసిషన్ మేకింగ్; సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్; అనలిటికల్ రీజనింగ్; క్లాసిఫికేషన్; డైరెక్షన్ తదితర అంశాలపై దృష్టి సారించాలి.
జనరల్ అవేర్‌నెస్
జనరల్ అవేర్‌నెస్‌లో..జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, క్రీడలు, చరిత్ర, భారత, ప్రపంచ జాగ్రఫీ, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, జనరల్ సైన్స్, ఐక్యరాజ్యసమితి, ఇతర ముఖ్యమైన అంతర్జాతీయ సంస్థలు, పర్యావరణ అంశాలు, కంప్యూటర్ ప్రాథమిక అంశాలు, దేశంలో రవాణా వ్యవస్థ, భారత ఆర్థిక వ్యవస్థ, ప్రభుత్వ పథకాలు వంటి వాటిపై దృష్టి పెట్టాలి.
మెంటల్ ఎబిలిటీ
ఇందులో అనాలజీస్, నంబర్ సిరీస్, కోడింగ్, డీ కోడింగ్, రిలేషన్‌షిప్స్, సిలాజిజమ్, జంబ్లింగ్, వెన్ డయాగ్రమ్, డేటా ఇంటర్‌ప్రిటేషన్, క్లాసిఫికేషన్, డైరెక్షన్స్, స్టేట్‌మెంట్స్-ఆర్గ్యుమెంట్స్‌పై దృష్టి సారించాలి.
బేసిక్ సైన్స్, ఇంజనీరింగ్
ఇంజనీరింగ్ డ్రాయింగ్ (ప్రొజెక్షన్స్, వ్యూస్, డ్రాయింగ్ ఇన్‌స్ట్రుమెంట్స్, లైన్స్, జామెట్రిక్ ఫిగర్స్, సింబాలిక్ రిప్రెజెంటేషన్స్), యూనిట్స్, మెజర్‌మెంట్స్; మాస్ వెయిట్ అండ్ డెన్సిటీ; వర్క్ పవర్ అండ్ ఎనర్జీ; స్పీడ్ అండ్ వెలాసిటీ; హీట్ అండ్ టెంపరేచర్; బేసిక్ ఎలక్ట్రిసిటీ తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
పార్ట్-బికు ఇలా
నిర్దేశిత ట్రేడ్‌లో ప్రశ్నలు అడిగే సీబీటీ-2లోని పార్ట్-బిలో రాణించడానికి అభ్యర్థులు సంబంధిత ట్రేడ్ అకడమిక్ పుస్తకాలను చదవాలి. ఇందులో పొందిన మార్కులను తుది జాబితా రూపకల్పనలో పరిగణనలోకి తీసుకోరు. కానీ.. అభ్యర్థులు కనీస అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది. కచ్చితంగా 35 శాతం మార్కులు పొందాలి.
ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
- ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ:ఫిబ్రవరి 19, 2024
- ఆన్‌లైన్ దరఖాస్తు సవరణ: ఫిబ్రవరి 20-29
- సీబీటీ-1 పరీక్ష: జూన్-ఆగస్ట్‌లో నిర్వహించే అవకాశం.
- సీబీటీ-2 పరీక్ష: సెప్టెంబర్‌లో నిర్వహించే అవకాశం
- సీబీఏటీ పరీక్ష తేదీ: నవంబర్‌లో నిర్వహించే అవకాశం
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://rrbsecunderabad.gov.in/
- ఆన్‌లైన్ దరఖాస్తు వెబ్‌సైట్: https://www.recruitmentrrb.in/#/auth/landing
చదవండి: Railway Latest Notification 2024: ఆర్‌ఆర్‌బీలో 5,696 పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Tags
- Indian Railway Jobs
- RRB Recruitment 2024
- RRB ALP 2024 Notification
- Indian Railway Jobs 2024
- Railway Recruitment Board
- RRB Syllabus
- RRB Preparation Tips
- latest notifications
- latest job notifications 2024
- latest govt jobs notifications
- central govt jobs 2024
- latest employment notification
- sakshi education latest job notifications
- latest jobs in 2024
- RRB Exams
- TechnicalDepartment
- ApplicationQualifications
- SelectionProcess
- PreparationTips