Skip to main content

Success Tips: పోలీసు ఉద్యోగం కొట్టాలంటే.. ఇవి త‌ప్ప‌నిస‌రి !

త్వ‌ర‌లోనే పోలీస్ కానిస్టేబుల్, ఎస్‌ఐ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేష‌న్ రానున్న నేప‌థ్యంలో... ఔత్సాహికులకు ఉపయోగపడేలా ఎస్‌ఐ పరీక్షలో 327 మార్కులతో 3వ ర్యాంకు సాధించిన వడ్డే ఉదయ్‌కుమార్ తన సక్సెస్ సీక్రెట్స్‌ను ‘ సాక్షి ఎడ్యుకేష‌న్ ’తో పంచుకున్నారు. వివరాలు ఆయన మాటల్లోనే..
వడ్డే ఉదయ్‌కుమార్,  ఎస్‌ఐ
వడ్డే ఉదయ్‌కుమార్, ఎస్‌ఐ

కుటుంబ నేప‌థ్యం..
మాది ఖమ్మం జిల్లా జూలూరుపాడు మండలం, కరివారిగూడెం. నాన్న వడ్డే శ్రీనివాసరావు సింగరేణిలో కోల్ ఫిల్లర్‌గా విధులు నిర్వర్తించేవారు. ఆయన 2005లో మరణించారు. అమ్మ సత్యవతి గృహిణి. 

నా చ‌దువు :
నేను ఇంటర్ వరకు మణుగూర్‌లో తెలుగు మీడియంలోనే చదివాను. డిగ్రీ కొత్తగూడెంలో, ఎంసీఏ హైదరాబాద్‌లో పూర్తి చేశాను.

సరైన అవకాశాలు లేవ్‌..
నా ఎంసీఏ పూర్తయ్యే నాటికి (2008లో) సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీపై ఆర్థికమాంద్యం ప్రభావం ఉంది. సరైన అవకాశాలు లేవు. అప్పటికే మా బంధువుల్లో చాలా మంది పోలీస్ ఉద్యోగాలు చేస్తున్నారు. మా అన్నయ్య వేణుమాధవ్ సలహా మేరకు ఎస్‌ఐ ఉద్యోగానికి ప్రయత్నించాను. మొదటి అటెంప్ట్‌లోనే విజయం సాధించాను.

Inspiring Story: నేను ఎస్‌ఐ అయ్యానిలా.. అమ్మ కూలి పనులు చేస్తూ..

మొదటి స్థానంలో నిలిచా..
ఎస్‌ఐ ఉద్యోగానికి ఎంపికైన తర్వాత ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ (అప్పా)లో ఏడాది పాటు శిక్షణలో పాల్గొని, మొదటి స్థానంలో నిలిచా. బెస్ట్ ఆల్‌రౌండర్, బెస్ట్ ఇండోర్‌గా నిలిచి సీఎం పిస్టల్, గోల్డ్ మెడల్ గెలుచుకోవడంతోపాటు హోంమినిస్టర్ బ్యాటన్, గోల్డ్ మెడల్‌ను సాధించాను.

దీనిలో అప్రమత్తంగా ఉండాలి..
గతంలో మొదట దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించి, తర్వాత రాత పరీక్ష జరిపేవారు. కానీ, ఇప్పుడు మొదట రాత పరీక్ష నిర్వహించి, అందులో అర్హత సాధించిన వారికి మలి దశలో శారీరక పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఇంతకు ముందు అన్ని ఈవెంట్స్‌లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉండేది అయితే ఇప్పుడు సివిల్ ఎస్‌ఐ, ఫైర్ స్టేషన్ ఆఫీసర్ ఉద్యోగాలకు 800 మీటర్ల పరుగు పందెంతో పాటు ఏవైనా రెండు ఈవెంట్స్‌లో ఉత్తీర్ణత సాధిస్తే సరిపోతుంది.

అభ్యర్థులను ఎక్కువగా ఇందులోనే ఫిల్టర్..
ఈ పోస్టులకు సంబంధించి ఈవెంట్స్‌లో మెరిట్ సాధించినా.. ఎంపికలో ఎలాంటి మార్కులు కలపరు. కానీ, మిగిలిన పోస్టుల భర్తీలో మాత్రం ఈవెంట్స్‌లో సాధించిన మెరిట్‌కు స్కోరు కేటాయించి తుది ఎంపికలో పరిగణనలోకి తీసుకుంటారు. కాబట్టి అభ్యర్థులు ఆయా పోస్టులకు అనుగుణంగా ప్రాక్టీస్ చేయాలి. 800 మీటర్ల పరుగుపందెంలో అభ్యర్థులు అప్రమత్తంగా వ్యవహరించాలి. అభ్యర్థులను ఎక్కువగా ఇందులోనే ఫిల్టర్ చేసే అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులు నిత్యం ప్రాక్టీస్ చేయాలి.

Success Story: రాష్ట్ర కొలువుతో పాటు కేంద్ర కొలువు కొట్టానిలా.. కానీ ఉద్యోగంలో చేరిన ఆరు నెలలకే..

దీన్ని నిర్లక్ష్యం చేయవద్దు..
ఫైనల్ ఎగ్జామ్‌లో ఇంగ్లిష్ ఒక పేపర్‌గా ఉంటుంది. అభ్యర్థులు ఇందులో అర్హత సాధిస్తే సరిపోతుంది. దీన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ఎందుకంటే ఇందులో అర్హత సాధిస్తేనే మిగతా పేపర్లను మూల్యాంకనం చేస్తారు.

తక్కువ సమయంలో..
కోచింగ్ కేంద్రాలు నిర్వహించే మాక్ టెస్టులకు హాజరవ్వాలి. ఇచ్చిన సమయంలో అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాసేందుకు ప్రయత్నించాలి. అలా చేయడం ద్వారా టైం మేనేజ్‌మెంట్ అలవడుతుంది. అర్థమెటిక్‌లో కొన్ని ప్రశ్నలకు సమాధానం తెలియకపోతే సమయాన్ని వృథా చేసుకోవద్దు. వాటిని వదిలేసి మిగిలిన ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. వదిలేసిన ప్రశ్నలను చివర్లో సాధించాలి. అర్థమెటిక్ పేపర్‌లో మెంటల్ ఎబిలిటీ/ రీజనింగ్‌కు సంబంధించిన ప్రశ్నలను తక్కువ సమయంలో సాధించవచ్చు. అభ్యర్థులు రీజనింగ్ బిట్స్ మొదట చేయడం లాభిస్తుంది.

బాగా గుర్తుండాలంటే..
పోలీస్ ఉద్యోగాల కోసం పోటీపడే అభ్యర్థులు కేవలం బిట్స్ మాత్రమే ప్రాక్టీస్ చేస్తారు. అలాకాకుండా సబ్జెక్ట్ నేర్చుకోవడం ద్వారా పరీక్షలో మంచి ఫలితాలు సాధించవచ్చు. సొంతంగా నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం, దాన్ని చదవడం ద్వారా సబ్జెక్ట్ బాగా గుర్తుంటుంది. విద్యార్థులు రాష్ట్రానికి సంబంధించిన అంశాలను బాగా చదవాలి.

Madhavi, CI : పొట్టకూటి కోసమే ఈ పోలీసు ఉద్యోగంలో చేరా.. కానీ

ఈ అపోహను వ‌ద‌లండి..
చాలా మంది అభ్యర్థులు ఎస్‌ఐ పరీక్షలో ఉండే అర్థమెటిక్‌ను ప్యూర్ మ్యాథ్స్‌గా భావించి.. కష్టమనే అపోహతో ఉంటారు. కానీ, పరీక్షలో అడిగే ప్రశ్నలు ఆర్ట్స్ విద్యార్థులు కూడా సులువుగా చేసే విధంగా ఉంటాయి. అభ్యర్థులు తొలుత మ్యాథ్స్ అనే భయాన్ని వీడి ప్రిపరేషన్‌లో ముందుకుసాగాలి. ముందుగా సిలబస్‌లో ఉన్న అంశాలను పరిశీలించాలి. పరీక్షలో ఆయా అంశాల నుంచే ప్రశ్నలు వస్తాయి. సిలబస్‌లో లేని టాపిక్స్‌ను చదవద్దు. ఏదైనా ఒక ప్రామాణిక మెటీరియల్‌ను ప్రిపరేషన్‌కు ఉపయోగించుకోవాలి.

మానవత్వానికి నిలువెత్తు నిద‌ర్శ‌నం ఈ ఎస్ఐ ..

Udhay kumar, SI


మనిషిని మహమ్మారి సోకితే.. చుట్టూ ఉన్న జనాల్లోంచి మనిషితత్వం పారిపోతున్న వేళ.. ఆప్యాయతలను, అనుబంధాలను అపోహలు ఆవరించిన వేళ.. కరోనా కాటుకు బలైనవారికి ‘అంతిమ సంస్కారం’ కూడా దక్కనివేళ..  మానవత్వం పరిమళించింది.  దీనికి ఖమ్మం జిల్లా మధిర టౌన్‌ ఎస్‌ఐ ఉదయ్‌కుమార్‌ నిలువెత్తు రూపంలా నిలిచారు. మధిర టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న ఓ హోంగార్డు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడ్డారు. తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కరోనా సోకి ఉండవచ్చని తోటి పోలీసు సిబ్బంది గానీ, బంధువులుగానీ అతని దగ్గరకు కూడా రాలేదు. ఆసుపత్రికి తరలించడానికి కూడా భయపడ్డారు.  ఎస్‌ఐ ఉదయ్‌కుమార్‌ ముందుకు వచ్చి ఇన్నోవాలో హోంగార్డును ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆక్సిజన్‌ పెట్టి చికిత్స చేస్తుండగానే హోంగార్డు మరణించాడు.

Uday Kumar Reddy, SP : నాడు ఇక్కడే ఎస్సైగా.. నేడు ఇక్క‌డే ఎస్పీగా..!

చివ‌రికి బంధువులు కూడా..
కరోనా లక్షణాలతో చనిపోయాడనే అపోహతో మృతదేహాన్ని తీసుకెళ్లడానికి బంధువులు ముందుకు రాలేదు. ఏం చేయాలో దిక్కుతోచనిస్థితిలో మృతుడి భార్య కొట్టుమిట్టాడుతుండగా ఎస్‌ఐ ఉదయ్‌కుమార్‌ అంబులెన్స్‌లో శవాన్ని శ్మశానవాటికకు తీసుకెళ్లారు. పీపీఈ కిట్లు ధరించి స్వయంగా అంత్యక్రియలు నిర్వహించారు. 

న‌న్ను కలిచివేసిన సంఘ‌ట‌న ఇదే..
స్థానిక ప్రజాప్రతినిధులు, పోలీసులు ఎస్‌ఐని అభినందించారు. లాక్‌డౌన్‌ సమయం లోనూ మధిర, చుట్టుపక్క గ్రామాల్లో కరోనా కట్టడికి తీసుకున్న చర్యలు, వలసకార్మికులను ఆదరించిన తీరుకు ఎస్‌ఐ ప్రశంసలు అందుకున్నారు. ‘అందరూ ఉన్నా, కరోనా నెగెటివ్‌ అని తెలిసినా, మహమ్మారి లక్షణాలతో చనిపోయాడని హోంగార్డు అంత్యక్రియలకు బంధువులు రాకపోవడం తనను కలిచివేసింది’ అని ఎస్‌ఐ ‘సాక్షి’తో మాట్లాడుతూ అన్నారు.

Gandrathi Satish, SI: ఇంటర్, డిగ్రీలో ఫెయిల్..ఈ క‌సితోనే మూడు ప్ర‌భుత్వ ఉద్యోగాలు కొట్టానిలా..​​​​​​​

​​​​​​​Srijana IAS: ఓటమి నుంచి విజయం వైపు...కానీ చివరి ప్రయత్నంలో..

Chandrakala, IAS: ఎక్క‌డైనా స‌రే..‘తగ్గేదే లే’

Inspirational Story: న‌న్ను పేదవాడు.. రిక్షావాలా కొడుకు అని హీనంగా చూశారు.. ఈ క‌సితోనే ఐఏఎస్ అయ్యానిలా..

Success Story: పేదరికం అడ్డుపడి.. వేధించిన నా ల‌క్ష్యాన్ని మాత్రం మరువ‌లేదు..

Published date : 28 Feb 2022 05:47PM

Photo Stories