Madhavi, CI : పొట్టకూటి కోసమే ఈ పోలీసు ఉద్యోగంలో చేరా.. కానీ
‘బీఈడీ అంటే ఇంకా రెండేళ్లు పడుతుంది.నా మాట విని ఎస్ఐ పోస్ట్‌కి అప్లయ్ చెయ్’ అంటూ ఎంకరేజ్ చేశాడు. అలా అన్నయ్య, నేను ఇద్దరం ఒకే బ్యాచ్ లో ట్రైన్ అయ్యాం. ఉద్యోగంలో చేరినప్పటి నుంచి నా పనికి న్యాయం చేసుకుంటూ పోతున్నా..’ అని చెప్పుతున్న కరీంనగర్ జిల్లా, హుజురాబాద్ సీఐ మాధవి విజయ ప్రస్థానం ఆమె మాటల్లోనే...
నా పదేళ్లప్పుడే మా అమ్మ..
మేం ఆరుగురం అక్కచెల్లెళ్లం, మాకు ఇద్దరన్నదమ్ములు. మా నాన్నదీ పోలీస్ ఉద్యోగమే. నా పదేళ్లప్పుడే మా అమ్మ చనిపోయింది. అప్పటి నుంచి అక్కాచెల్లెళ్లమే ఇంటి బాధ్యతలను చూసుకునేవాళ్లం. మా అక్కచెల్లెళ్లం మా అత్తగారింటి వాళ్లకు చెప్పిన మాటొక్కటే..‘మా అమ్మ బతికుంటే ఒకటే అమ్మ ఉండేది.. కాని ఇప్పుడు మాకు మేం ఆరుగురం అమ్మలమే’ అని. అందుకే ఇంట్లో ఆడపిల్ల పుట్టింది అంటే గర్వపడండి. బాగా చదివించండి.. స్వశక్తి మీద నిలబడేలా పెంచండి. నా కుటుంబానికి వస్తే మా వారు మహేష్ బాబు కూడా ఇన్‌స్పెక్టరే. ఇద్దరు అబ్బాయిలు రుషి ఫణీంద్ర, మీరజ్ చంద్ర. నేను ఈ రోజు ఈ ఉద్యోగం హాయిగా చేసుకోగలుతున్నానంటే మా అత్తగారి సహకారం వల్లే.
ఎంత కష్టపడ్డానో ఆ దేవుడికే తెలుసు...
నేనైతే పెద్దగా ఎదుర్కోలేదు. అలాగని డిస్క్రిమినేషన్‌కు ఈ ఫీల్డేమీ మినహాయింపు కాదు. పనికి జెండర్ ఉండదు, ఏ టాస్క్‌కైనా నేను సిద్ధమే అని నిరూపించుకోవడానికి, ఆ కాన్ఫిడెన్స్‌ను బిల్డప్ చేయడానికి ఎంత కష్టపడ్డానో ఆ దేవుడికే తెలుసు. మహిళలమని మనకు మనమే రిజర్వేషన్స్‌పెట్టుకుంటే అవతలి వాళ్లు మనల్ని ఈక్వల్‌గా చూడరు అని నా ఉద్దేశం. మన పనితీరే మనకు గౌరవాన్ని, గుర్తింపునిస్తుంది. నేను జాయిన్ అయిన కొత్తలో మగవాళ్లు ఎవరైనా ‘మాధవి ..లేడీ ఇన్‌స్పెక్టర్ అని పిలిస్తే ‘ఇన్‌స్పెక్టర్ అంటే ఇన్‌స్పెక్టర్... అంతే.. మగ, ఆడ అని ఉండదు కదా అని వాదించి వారికి వారికి నచ్పజెప్పేదాన్ని.
చదువొక్కటే కాదు..
అమ్మాయిలు భద్రంగా ఉండాలంటే మగపిల్లల ఆలోచనలు ఆరోగ్యంగా ఉండాలి. అమ్మను, తోబుట్టువులను గౌరవించడం మగపిల్లలకు నేర్పించాలి. దీని బాధ్యత పేరెంట్స్, టీచర్స్‌దే. పిల్లలకు చదువొక్కటే కాదు లోకజ్ఞానమూ కావాలి. పాఠ్యపుస్తకాలతోపాటు ఇతర పుస్తకాలు, పేపర్ రీడింగ్ పిల్లలకు అలవాటు చేయాలి. వార్తలను టీవీల్లో, సోషల్ మీడియాలో ఫాలో అవడం కాదు కచ్చితంగా పత్రికలనే చదివేలా చూడాలి. పేపర్ అనే ఎందుకంటున్నానంటే.. పేపర్‌కున్న విశ్వసనీయత ఒక కారణమైతే.. అది చదివినప్పుడు మనలో ఒక రియాక్షన్ ఉంటుంది. అది ఇంకో కారణం.
ముఖ్యంగా పోలీస్ జాబ్స్‌కి..
మొన్న తొమ్మిదేళ్ల పాప మీద లైంగిక దాడి జరిగింది. సివిల్ డ్రెస్‌లో వెళ్లి.. ఓపిగ్గా ఆ పాపతో మాట్లాడితే విషయమంతా చెప్పింది. బహుశా నాలో వాళ్ల అమ్మనో.. అత్తనో.. పిన్నినో చూసుకొని ఉంటుంది. అదే నా స్థానంలో మేల్ ఆఫీసర్ ఉండుంటే ఆ పాప భయంతో బిగుసుకుపోయేదేమో! న్యాయం జరిగినా, జరగకపోయినా బాధితులు మహిళలే. ఈ నిజాన్ని గ్రహించేది, అర్థం చేసుకునేదీ మహిళలే. ఇన్‌స్టంట్‌గా న్యాయం అందించే అవకాశమూ ఉంటుంది. అందుకే పోలీస్ డిపార్ట్‌మెంట్‌లోకి ఎంత వీలైతే అంత ఎక్కువ మంది మహిళలు రావాలి. బీటెక్‌లు చదివి ఏ కాల్‌సెంటర్‌లోనో పదివేలకు ఉద్యోగం చేసేకంటే పోలీస్ డిపార్ట్‌మెంట్‌లోకి వస్తే.. గౌరవానికి గౌరవం, సాటి మహిళల తరపున ఉన్నామనే గర్వం రెండూ మిగులుతాయి. తల్లిదండ్రులకు నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే.. మీ ఆడపిల్లలను పోలీస్ జాబ్స్‌కి ఎంకరేజ్ చేయండి. భయపడాల్సిందేమీ లేదు. మీ అమ్మాయి ధైర్యంగా ఉండడమే కాక పదిమంది అమ్మాయిలకూ ధైర్యాన్నివ్వగలదు.
చిన్నారులను చూసి చలించిపోయి మాధవి..
అమ్మతనానికి నిలువెత్తు నిదర్శనం కరీంనగర్ జిల్లా హుజురాబాద్ సీఐగా విధులు నిర్వహిస్తున్న వి. మాధవి మూడేళ్లక్రితం రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడ రూరల్ సీఐగా పని చేసేవారు. ఆ సమయంలో కోనరావుపేట మండలం నిమ్మపల్లికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన భార్యాభర్తలు అనారోగ్యంతో మరణించగా వారి పిల్లలు అనాథలయ్యారని పత్రికల్లో చదివి అప్పటి డీఎస్పీ దామెర నర్సయ్యతో కలిసి వెళ్లి పరామర్శించారు. ఆ చిన్నారులను చూసి చలించిపోయిన మాధవి వారికి దాతల సాయంతో ఆర్థికంగా ఆసరా ఇప్పించారు. అంతేకాదు, పిల్లల్లో ఒకరైన భవానిని దత్తత తీసుకుని చదివించారు. భవాని టెన్త్‌లో 9.7 గ్రేడ్‌ను సాధించి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎస్పీ, కలెక్టర్‌ల ప్రశంసలు అందుకుంది. భవానికి చదువుపై ఉన్న శ్రద్ధను గమనించిన మాధవి ఆమెను తన పిల్లలు చదివే కాలేజీలోనే చేర్పించి, ఆలనాపాలనా చూడడమే కాకుండా ఒక తల్లిగా మంచిచెడులు చెప్తూ ఇంటర్‌లో మంచి మార్కులు సాధించాలని ఆ దత్త పుత్రికకు స్ఫూర్తిని ఇచ్చారు. భవాని కష్టపడి చదివి ఇంటర్‌లో 969 మార్కులు సాధించింది. ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లోని ఒక మంచి కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతోంది. తన ‘పోలీస్ అమ్మ’ కోరిక మేరకు సివిల్స్ సాధించడమే తన లక్ష్యమని చెప్తోంది భవాని.
ఆమె మాటే మంత్రంగా..
స్టేషన్‌కి వచ్చే బాధితులతో ఒక పోలీస్‌గా కాకుండా ఒక ఆత్మీయురాలిగా మాట్లాడతారు మాధవి. కుటుంబ కలహాలతో తన దగ్గరకి వచ్చినవారికి క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు ఎంతటి ఉపద్రవానికి దారి తీస్తాయో చెబుతూ చక్కటి కౌన్సెలింగ్ ఇస్తారు. ఆమె మాట మంత్రంగా పని చేసి ఆ జంట కలిసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
ప్రకృతి ప్రేమికురాలుగా..
ఆమె ఏ స్టేషన్‌లో విధులు నిర్వహించినా అక్కడ పచ్చదనం కనిపించేలా చూస్తుంది. మానకొండూర్ పీఎస్‌లో సీఐగా విధులు నిర్వర్తిస్తున్న సమయంలో పోలీస్‌స్టేషన్ పరిసరాలు ఉద్యానవనాన్ని తలపించేలా గార్డెనింగ్ చేయించింది. అందుకే జిల్లాలోనే అంతటి పచ్చదనం ఉన్న పోలీస్‌స్టేషన్‌గా గుర్తింపు తెచ్చుకుంది.