Skip to main content

DG Abhilasha Bisht: సవాళ్లకు అనుగుణంగా శిక్షణలో మార్పులు

సాక్షి, హైదరాబాద్‌: క్షేత్రస్థాయిలో మారిన నేరసరళి, పోలీస్‌ విధుల ఆధారంగా నూతన కానిస్టేబుళ్ల శిక్షణలో పలు మార్పు లు చేసినట్టు తెలంగాణ పోలీస్‌ అకాడమీ డైరెక్టర్, శిక్షణ విభాగం డీజీ అభిలాష బిస్త్‌ తెలిపారు.
Changes in the training of police constables to meet the challenges  Telangana Police Academy training updates New constable training session in Telangana

రోజురోజుకు పెరుగుతున్న సైబర్‌ నేరాల నియంత్రణకు సంబంధించిన సైబర్‌ సెక్యూరిటీ అంశాలు, మత్తుపదార్థాల రవాణాకు అడ్డుకట్ట వేసేలా యాంటీ నార్కోటిక్స్‌ ఆపరేషన్స్‌కు సంబంధించిన అంశాలను ఈసారి కానిస్టేబుల్స్‌ శిక్షణలో అదనంగా చేర్చినట్టు వెల్లడించారు.

లింగ వివక్షకు తావులేకుండా శిక్షణలో పలు కీలక అంశాలపై అవగాహన కల్పించినట్లు తెలిపారు. న‌వంబ‌ర్‌ 22న రాష్ట్రవ్యాప్తంగా 8,047 మంది కానిస్టేబుళ్ల పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌ సందర్భంగా ‘సాక్షి’ప్రత్యేక ఇంటర్వ్యూలో బిస్త్‌ పలు అంశాలను పంచుకున్నారు. 

చదవండి: SI Manimala Sucess Story: ఇద్దరు పిల్లల తల్లి.. ఈవెంట్స్‌ కోసం కష్టనష్టాలకోర్చి విజయం సాధించారు

సిలబస్‌లో సైబర్‌ సెక్యూరిటీ

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 19 పోలీస్‌ శిక్షణ కేంద్రాల నుంచి 8,047 మంది కానిస్టేబుళ్లు పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌లో పాల్గొననున్నారు. వీరిలో 4,116 మంది సివిల్‌ కానిస్టేబుళ్లు, 3,685 మంది ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ (ఏఆర్‌), 228 మంది ఐటీ కమ్యూనికేషన్స్, 18 మంది పోలీస్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఆర్గనైజేషన్‌ (పీటీఓ) కానిస్టేబుళ్లు ఉన్నారు.

శిక్షణ సిలబస్‌లో సైబర్‌ సెక్యూరిటీకి సంబంధించిన అంశాలు, యాంటీ నార్కోటిక్స్‌ ఆపరేషన్స్‌ అంశాలను తొలిసారిగా చేర్చి అవగాహన కల్పించాం. సైబర్‌ నేర విధానం (మోడస్‌ అపరెండీ) ఎలా ఉంటుంది, ఇతర అంశాలపై కనీస పరిజ్ఞానం ఉండేలా తరగతులు నిర్వహించాం. యాంటీ నార్కోటిక్స్‌ ఆపరేషన్స్‌లో పాల్గొనడం, దర్యాప్తులో పై అధికారులకు సహకరించడం తదితర అంశాల్లో తర్ఫీదు ఇచ్చాం. 

సెల్ఫ్‌ డిఫెన్స్‌కు ప్రాధాన్యత 

ఇన్‌డోర్‌తో పాటు ఔట్‌డోర్‌ శిక్షణలో సెల్ఫ్‌ డిఫెన్స్‌కు ప్రాధాన్యత పెంచాం. పని ఒత్తిడి తట్టుకునేలా శారీరకంగా, మానసికంగా ధృఢంగా ఉండేలా కొన్ని మార్పులు చేశాం. క్షేత్రస్థాయిలో విధుల్లో ఉండే సివిల్‌ కానిస్టేబుళ్లకు కూడా నూతన నేర చట్టాలపై అవగాహన కల్పించేలా ప్రత్యేక తరగతులు నిర్వహించాం.

నేర దర్యాప్తు, కేసుల నమోదు, క్షేత్రస్థాయి విధుల్లో తరచూ అవసరమయ్యే చట్టాలపై ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చాం. అదేవిధంగా నేరం జరిగిన ప్రాంతానికి చేరుకోగానే ఏం చర్యలు తీసుకోవాలి, పై అధికారి వచ్చే వరకు క్రైం సీన్‌ను కాపాడడం వంటి అంశాలపై శిక్షణ ఇచ్చాం. ఈ బ్యాచ్‌లో 5,470 మంది గ్రాడ్యుయేట్లు, 1,361 మంది పోస్ట్‌ గ్రాడ్యుయేట్లు ఉన్నారు. 15 మంది ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసిన వారున్నారు. 

Published date : 21 Nov 2024 03:06PM

Photo Stories