TGSP: ఎందుకీ వివాదం.. ఏమిటీ ‘ఏక్ పోలీస్’?
ఈ నేపథ్యంలో ‘ఏక్ పోలీస్’? అంటే ఏంటి? అసలు నిబంధనలు ఏం చెబుతున్నాయి ఒకసారి పరిశీలిస్తే.. రాష్ట్రంలో మొత్తం 13 బెటాలియన్లు ఉన్నాయి. వాటిలో అధికారులు, సిబ్బంది కలిపి ఒక్కో బెటాలియన్‌లో వెయ్యి మంది వరకు ఉంటారు. సాధారణంగా పోలీస్‌శాఖలో సివిల్, ఆర్మ్డ్ రిజర్వ్ (ఏఆర్), స్పెషల్ పోలీస్ విభాగాల్లో సిబ్బందిని భర్తీ చేస్తుంటారు.
పోలీస్‌స్టేషన్లలో ఉంటూ శాంతిభద్రతల పర్యవేక్షణ, నేర విచారణ చేయడం, నేరాలు నిరోధించడం నేరస్తులను గుర్తించడం వంటి విధులను సివిల్ పోలీస్ సిబ్బంది చేస్తుండగా వారికి బందోబస్తు తదితర విధులలో ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసులు సహాయపడుతుంటారు.
చదవండి: Special Police: 10 మంది టీజీఎస్పీ సిబ్బంది డిస్మిస్.. డిస్మిస్ గురైన సిబ్బంది వీరే..
కానీ టీజీఎస్పీ పోలీస్ సిబ్బంది శాంతిభద్రతల విధులు నిర్వహిస్తుంటారు. ఎన్నికల సమయంలో ఇతర రాష్ట్రాల్లోనూ పనిచేస్తారు. అయితే తమను ఐదేళ్లలో ఏఆర్ (ఆర్మ్డ్ రిజర్వ్)లోకి, ఆ తర్వాత ఐదేళ్లకు సివిల్ కానిస్టేబుల్‌గా మార్చాలని టీజీఎస్పీ కానిస్టేబుళ్లు కోరుతున్నారు. అయితే ఇందుకు రాష్ట్ర సర్వీస్ నిబంధనలు అంగీకరించవని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం తీవ్రమైన విషయంగా పరిగణించాల్సి వస్తుందంటూ డీజీపీ ప్రకటన విడుదల చేశారు. ‘‘తెలంగాణ రాష్ట్ర స్పెషల్ పోలీస్ సిబ్బంది నిర్వహిస్తున్న విధులు కొన్ని దశాబ్దాల నుంచి అమలు జరుగుతున్నాయి. జిల్లాల స్థాయిలో నేర విచారణ చేయడం, నేరాలు నిరోధించడం నేరస్తులను గుర్తించడం వంటి విధులను సివిల్ పోలీస్ సిబ్బంది చేస్తుంటారు.
బందోబస్తు తదితర విధులలో ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసులు సహాయపడుతుంటారు. కానీ, టీజీఎస్పీ పోలీస్ సిబ్బంది రాష్ట్రవ్యాప్తంగా ఉన్న శాంతి భద్రతల అంశాలలో విధులు నిర్వహిస్తుంటారు. ఎన్నికల సమయంలో ఇతర రాష్ట్రాల్లో అప్పగించిన బాధ్యతలను సైతం అద్భుతంగా నిర్వహించిన ఘనత టీజీఎస్పీ సిబ్బందికి ఉంది.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
దాదాపుగా అన్ని రాష్ట్రాలు ఈ రకమైన విధానాలనే అమలు చేస్తున్నాయి.. టీజీఎస్పీ సిబ్బంది సమస్యలను మెరిట్ ప్రాతిపదికన సానుభూతితో పోలీస్ శాఖ పరిశీలిస్తుంది. ఇతర ప్రభుత్వ విభాగాల ఉద్యోగులకు ఎవరికీ లేని విధంగా టీజీఎస్పీ సిబ్బందికి సరెండర్ లీవ్‌లు, అడిషనల్ సరెండర్ లీవులు మంజూరు చేశాము. పండుగలు, సెలవుల సందర్భాలలో టీజీఎస్పీ సిబ్బంది నిర్వహించే విధులను దృష్టిలో ఉంచుకొని వారికి ఈ సౌకర్యం కల్పిస్తున్నాము.
వేతనాలు, భత్యాలు ఇతర రాష్ట్రాల పోలీస్ సిబ్బందితో పోలిస్తే అధికంగా ఉన్నాయి. భద్రత, ఆరోగ్య భద్రత వంటి సంక్షేమ పథకాలతో తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ సిబ్బంది కోసం సంక్షేమ కార్యక్రమాలను చేపడుతుంది. ఈ పరిస్థితుల్లో టీజీఎస్పీ సిబ్బంది ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం సమంజసం కాదు’’ అంటూ ప్రకటనలో డీజీపీ పేర్కొన్నారు.
‘‘యూనిఫామ్ ధరించే టీజీఎస్పీ సిబ్బంది అత్యంత క్రమశిక్షణ తో విధులను నిర్వహించాల్సి ఉంటుంది. క్రమశిక్షణతో విద్యుక్త ధర్మాన్ని నిర్వహిస్తూ పోలీస్ శాఖ ప్రతిష్ట ను పెంచాలి.. కానీ సిబ్బంది పోలీస్ శాఖకు మచ్చ తెచ్చే విధంగా వ్యవహరించకూడదు. సమస్యలను సరైన పద్ధతిలో పరిశీలిస్తామని టీజీఎస్పీ పోలీస్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు తెలియజేస్తున్నాను.
యథావిధిగా టీజీపీఎస్పీ సిబ్బంది వారి సాధారణ విధులను నిర్వహించాలి. సమస్యలు ఏమైనా ఉంటే వారి కోసం నిర్వహిస్తున్న "దర్బార్" కార్యక్రమం ద్వారా వారి అధికారులకు తెలియజేయాలి. యూనిఫామ్ సిబ్బంది క్రమశిక్షణ రాహిత్యంగా వ్యవహరించడం, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం తీవ్రమైన విషయంగా పరిగణించాల్సి వస్తుంది’’ అంటూ డీజీపీ హెచ్చరించారు.