TS Inter Students Success Stories : కూలీల బిడ్డలు.. రాష్ట్ర స్థాయిలో టాపర్స్.. ఈ లక్ష్యం కోసమే..
ఈ ఫలితాల్లో మంచిర్యాల జిల్లాలోని చెన్నూర్ ప్రభుత్వ కళాశాలలో విద్యాభ్యాసం చేస్తున్న గ్రామీణ ప్రాంతాలకు చెందిన వ్యవసాయ కూలీల బిడ్డలు రాష్ట్ర స్థాయి ర్యాంక్‌లు సాధించి జిల్లా టాపర్లుగా నిలిచారు.
మండలంలోని చింతలపల్లి గ్రామానికి చెందిన దబ్బట పద్మ, శంకర్ దంపతుల కూతురు భవాని ఇంటర్ ద్వితీయ సంవత్సరం బైపీసీలో 1000 మార్కులకు గాను 974 మార్కులు, కోటపల్లి మండలం మల్లంపేట గ్రామానికి చెందిన ఆత్కూరి శంకర్, సావిత్రి దంపతుల కుమారుడు ఆత్కూరి శ్రీకాంత్ సీఈసీలో 1000 మార్కులకు 970 మార్కులు సాధించారు. ఎంపీసీలో సాహితి 1000 మార్కులకు 941, ఇంటర్ ప్రథమ సంవత్సరం సీఈసీ విద్యార్థి సహజ 500 మార్కులకు 404 మార్కులు సాధించారు.
భవాని, శ్రీకాంత్ తల్లిదండ్రులు రోజువారీ కూలీగా పని చేస్తూ పిల్లలను చెన్నూర్‌లో చదివించారు. భవాని, మహేశ్ చింతలపల్లి, మల్లంపేట గ్రామాల నుంచి ప్రతీ రోజు ఆర్టీసీ బస్సులో రాకపోకలు సాగించి రాష్ట్ర స్థాయిలో నాలుగో ర్యాంక్ సాధించి, జిల్లా టాపర్‌గా నిలిచారు. గ్రూప్స్ సాధించడమే తన లక్ష్యమని ఆత్కూరి శ్రీకాంత్ తెలిపాడు. డాక్టర్ కావాలనేది తన తల్లిదండ్రుల ఆశయమని, సాకారం చేసేందుకు కష్టపడి చదువుతానని దబ్బెట భవాని పేర్కొంది.
➤ Tenth Class Students Success Stories : నిరుపేద కుటుంబం.. తండ్రి మరణంతో.. జీవనోపాధి కోసం..
అమ్మ కష్ట పడకుండా చూసుకుంటాను.. : గణేష్, ఎంపీసీ రాష్ట్ర ఆరో ర్యాంకర్
నాన్న ఆయిడపు నర్సయ్య నా చిన్నప్పుడు చనిపోవడంతో అమ్మ శారద కష్టపడి కూలీ పనులు చేసుకుంటూ చదివిస్తోంది. ఒకటో తరగతి నుంచి ఐదవ తరగతి వరకు మా గ్రామం కత్తెరశాలలోని ప్రైమరీ పాఠశాలలో, ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు చెన్నూర్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివాను. ఇంటర్మీడియెట్ స్థానిక మహాత్మా జ్యోతిబాపూలే పాఠశాలలో పూర్తి చేశాను. ఇంటర్మీడియెట్ ఎంపీసీ గ్రూపులో 989 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ఆరో ర్యాంకు రావడం చాలా సంతోషంగా ఉంది. కళాశాల ప్రిన్సిపాల్ గౌతంరెడ్డి, అధ్యాపకుల ప్రోత్సాహంతో మార్కులు సాధించాను. బీటెక్ పూర్తి చేసి మంచి ఉద్యోగం సంపాదించి అమ్మ కష్ట పడకుండా చూసుకుంటాను.
మందమర్రిలోని మహాత్మా జ్యోతిరావు పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల రెసిడెన్షియల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో ప్రతిభకనబర్చారు. ఫస్టియర్ ఎంపీసీలో శ్రీరాముల హరిత 468/470 మార్కులతో రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు సాధించింది.
కళాశాల ప్రిన్సిపాల్ మంజుల, అధ్యాపకులు హరితను అభినందించారు. హరిత తండ్రి వెంకటేష్ మంచిర్యాలలోని జన్మభూమినగర్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తాడు. ఇటీవలే హైదరాబాద్‌లో మంత్రి చేతుల మీదుగా హరితను సన్మానించారు. ఇంటర్ ఎంపీసీ సెకండియర్‌లో మేకల సాత్విక 986/1000 మార్కులతో రాష్త్రస్థాయి ర్యాంకు సాధించింది.