Skip to main content

High Cort: ఒకేసారి భారీగా బదిలీలు ఎందుకు?

సాక్షి, హైదరాబాద్‌: ఉపాధ్యాయుల్లో చాలా మంది వ్యతిరేకంగా ఉన్నప్పుడు.. ఒకేసారి రాష్ట్రవ్యాప్తంగా భారీగా బదిలీలు చేపట్టడం ఎందుకని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.
High Cort
ఒకేసారి భారీగా బదిలీలు ఎందుకు?

‘30–35 సంవత్సరాలపాటు ఒకే పాఠశాలలో సేవలందించిన ప్రభుత్వ ఉపాధ్యాయులను చూశాం. వారు పదవీ విరమణ చేసేవరకు అక్కడే పనిచేస్తారు. వీరంతా విద్య చెప్పడమే కాదు.. విద్యార్థులతో వాత్సల్యాన్ని ఏర్పర్చుకుంటారు. ఇలాంటి వారిని ప్రభుత్వం ఎందుకు బదిలీలు చేస్తుంది. ఈ రోజు గురుపూర్ణిమ. గురువులను ఎందుకు వేధిస్తున్నారు’ అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. బదిలీల నిలిపివేత కారణంగా విద్యాశాఖలో పని ఎందుకు స్తంభించిందో చెప్పాలని ఆదేశించింది. అలాగే బదిలీలపై విధించిన స్టేను జూలై 11 వరకు పొడిగించింది. తదుపరి విచారణను జూలై 11కు వాయిదా వేసింది.

చదవండి: School Education: ఈ స్కూల్‌ టీచర్ల బదిలీ ప్రక్రియ ప్రారంభం

ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్‌ 9 చట్ట వ్యతిరేకమని, రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలం థోల్‌కట్టకు చెందిన సక్కుబాయితో పాటు మరికొందరు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ పాఠశాల విద్యా శాఖ కార్యదర్శి జారీ చేసిన జీవోను కొట్టివేయాలని విజ్ఞప్తి చేశారు. లేదా.. ప్రత్యామ్నాయంగా టీచర్స్‌ అసోసియేషన్‌ ఆఫీస్‌ బేరర్లకు, జీవిత భాగస్వామి కేటగిరీ కింద కొందరికి ఎలాంటి అదనపు పాయింట్లు ఇవ్వకుండా బదిలీలను చేపట్టేలా ప్రతివాదులను ఆదేశించాలని కోరారు.

చదవండి: Awards: జాతీయ ఉపాధ్యాయ పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం

ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ఉపాధ్యాయుల బదిలీపై గతంలోనే స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పిటిషన్లు సోమవారం మరోసారి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్, జస్టిస్‌ తుకారాంజీ ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చాయి. ప్రభుత్వం తరఫున ఏఏజీ రామచందర్‌రావు వాదిస్తూ.. బదిలీల నిలిపివేత కారణంగా విద్యాశాఖలో పని స్తంభించిపోయిందని చెప్పారు. ఉపాధ్యాయుల అభ్యర్థన మేరకే సంఘాలతో కలసి రాష్ట్ర ప్రభుత్వం బదిలీలు చేపడుతోందన్నారు. ఎన్నికల సమీపిస్తున్నందున ఉపాధ్యాయుల అవసరం ఉంటుందని, స్టే ఎత్తివేయాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం.. తదుపరి విచారణను 11కు వాయిదా వేసింది.  

Published date : 04 Jul 2023 05:06PM

Photo Stories