Free Education: ‘ప్రైవేటు’లో ఉచిత విద్య
మంచిర్యాలటౌన్: జిల్లాలోని పేద దళిత విద్యార్థులకు ప్రైవేటు పాఠశాలల్లో టెన్త్ వరకు, టెన్త్ పూర్తయిన దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ విద్యార్థులకు కార్పొరేట్ కాలేజీల్లో ఇంటర్‌లో ప్రవేశాలకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరణ ప్రక్రియ మొదలైంది.
ఈ పథకాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుంటే, వారికి ఉచితంగా ప్రైవేటు పాఠశాలల్లో టెన్త్ వరకు, కార్పొరేట్ కాలేజీల్లో ఇంటర్మీడియెట్ ఉచితంగా చదువుకునేందుకు అవకాశం దక్కుతుంది.
చదవండి: IGNOU Admissions: ఇగ్నోలో వివిధ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు..
పదో తరగతి వరకు..
2024–25 విద్యా సంవత్సరానికి జిల్లాలోని బెస్ట్ అవేలబుల్ స్కూల్స్ పథకం ద్వారా రెసిడెన్షియల్‌లో 5వ తరగతి, నాన్ రెసిడెన్షియల్‌లో 1వ తరగతిలో ప్రవేశాలకు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. జిల్లాకు మొత్తం 183 సీట్లు కేటాయించగా, అందులో 1వ తరగతికి 91 సీట్లు, 5వ తరగతికి 92 సీట్లు కేటాయించారు.
దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 18వ తేదీ నుంచి జూన్ 7వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు ఎస్సీ కాలేజ్ బాయ్స్ హాస్టల్, సాయిబాబ టెంపుల్ దగ్గర గల ఏఎస్‌డబ్ల్యూవో కార్యాలయంలో దరఖాస్తులు అందించాలి. దరఖాస్తు ఫారాలు ఏఎస్‌డబ్ల్యూవో కార్యాలయంలో అందుబాటులో ఉన్నాయి.
చదవండి: Free Admissions: ప్రైవేటు విద్యాసంస్థల్లో పేద విద్యార్థులకు ఉచిత ప్రవేశాలు!
ఇవి అవసరం..
దరఖాస్తు చేసుకునే వారు మీసేవ ద్వారా జారీ చేసిన కుల ధ్రువీకరణ పత్రం, గ్రామీణ ప్రాంతాల వారికి రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల వారికి రూ.2 లక్షలకు మించని ఆదాయ ధ్రువీకరణ పత్రం ఉండాలి. విద్యార్థులు 01.06.2018 నుంచి 31.05.2019లోపు జన్మించి ఉండాలి. మీసేవ ద్వారా తీసుకున్న పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం సమర్పించాలి.
5వ తరగతిలో ప్రవేశాలకు 4వ తరగతి పాస్ అయిన మార్కుల జాబితా, బోనఫైడ్‌ను జతచేయాల్సి ఉంటుంది. విద్యార్థి ఆధార్ కార్డు జిరాక్స్, 3 పాస్ పోర్ట్ సైజ్ కలర్ ఫొటోలతో 5వ తరగతికి రెసిడెన్షియల్ స్కూల్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 1వ తరగతి వారు నాన్ రెసిడెన్షియల్‌కు దరఖాస్తు చేసుకుంటే, వీరి ఎంపిక ప్రక్రియ జూన్ 11న కలెక్టరేట్ సమావేశ మందిరంలో లాటరీ ద్వారా సీట్లు కేటాయిస్తారు.
కార్పొరేట్ కాలేజీల్లో ఇంటర్ కోసం..
ఇక ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదివి 7 జీపీఏకుపైగా మార్కులు సాధించిన విద్యార్థులకు కార్పొరేట్ కాలేజీల్లో ఇంటర్మీడియేట్ ఉచితంగా చదివే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ప్రభుత్వ, జిల్లా పరిషత్, ఎయిడెడ్, కేజీబీవీ, నవోదయ, గురుకులాలు, ఆదర్శ పాఠశాలలు, బెస్ట్ అవైలబుల్ పథకం కింద చదివిన దివ్యాంగ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ వర్గాలకుచెందిన వారికి అవకాశం కల్పించారు.
పదో తరగతిలో సాధించిన జీపీఏ, రిజర్వేషన్లను పరిగణలోకి తీసుకుని 2024–25లో ఇంటర్మీడియేట్ మొదటి సంవత్సరంలో ప్రవేశం పొందేందుకు అవకాశం కల్పించారు. కార్పొరేట్ కాలేజీల్లో ఇంటర్ చదివే విద్యార్థుల ఫీజును ప్రభుత్వం ఆయా కళాశాలల యాజమాన్యాలకు చెల్లిస్తుంది.
ఒక్కో విద్యార్థికి ఫీజు కింద రూ.35 వేలు, ఖర్చుల కోసం ఏడాదికి రూ.3 వేలు అందిస్తుంది. ప్రతీ సంవత్సరం కార్పొరేట్ కాలేజీల్లో ప్రభుత్వం అవకాశం కల్పిస్తుండగా, పేద విద్యార్థులు ఉన్నత చదువులను అందుకునేందుకు ఈ పథకం తోడ్పాటు అందిస్తోంది.
ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు
ఇంటర్‌లో కార్పొరేట్ కాలేజీల్లో చేరేందుకు విద్యార్థులు www.telanganaepass.cgg.gov.i n వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్థి వివరాలను, పదో తరగతిలో సాధించిన జీపీఏ, సెల్ నంబర్, ఈ మెయిల్ ఐడీ, కులం, ఆదాయం, నివాస, దివ్యాంగ ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ కార్డు జిరాక్స్ జతచేయాల్సి ఉంటుంది.
4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివిన పాఠశాలలకు చెందిన బోనఫైడ్‌లు, ఫొటోను సైతం వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలి. పదో తరగతిలో సాధించిన జీపీఏతోపాటు, వారి రిజర్వేషన్ల ఆధారంగా విద్యార్థుల ఎంపిక ప్రక్రియను చేపడతారు.
ఆన్‌లైన్ ద్వారా ఈనెల 15వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ నెల 30వ తేదీ వరకు గడువు ఉంది. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు సంబంధించిన తొలి జాబితాను జూన్ 3వ తేదీన ప్రకటించి, జూన్ 6వ తేదీ నుంచి సర్టిఫికెట్ల పరిశీలన చేపడతారు. ఎంపికై న వారికి ఇంటర్మీడియేట్‌లో ప్రవేశాలు కల్పిస్తారు.
పేద విద్యార్థులకు మంచి అవకాశం
జిల్లాలోని ఎస్సీ విద్యార్థులు 1వ తరగతిలో నాన్ రెసిడెన్షియల్‌లో, 5వ తరగతిలో రెసిడెన్షియల్‌లో ప్రైవేటు పాఠశాలల్లో చేరేందుకు బెస్ట్‌అవేలబుల్ పథకం అవకాశం కల్పిస్తోంది. పేద విద్యార్థులకు ఇది మంచి అవకాశం. కార్పొరేట్ కాలేజీల్లో ఇంటర్‌లో చదివేందుకు ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీ, దివ్యాంగ విద్యార్థులు అర్హులు. జిల్లాకు చెందిన పేద విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి.
– పోటు రవీందర్‌రెడ్డి, జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి