పైతరగతిలో చేర్పించేందుకు మెజారిటీ తల్లిదండ్రులు, టీచర్ల మొగ్గు
![Majority of parents and teachers prefer to enroll in upper classes](/sites/default/files/images/2022/07/20/school-1658313830.jpg)
చాలా వరకు విద్యార్థులకు చదువులో తడబాటు తప్పడం లేదు. కింది తరగతిలోని ప్రాథమిక అంశాలపై అవగాహన లేకున్నా.. పైతరగతుల్లో చేరి చదవాల్సి వస్తోంది. కరోనాతో రెండేళ్లపాటు దూరమైన ప్రత్యక్ష బోధన ఇప్పుడు తిరిగి పూర్తి స్థాయిలో మొదలైంది. ఇన్నాళ్లూ పెద్దగా చదువు లేనందున కొద్దిమంది తల్లిదండ్రులు తమ పిల్లలను కింది తరగతిలోనే కొనసాగించేందుకు సిద్ధపడినా.. మెజారిటీ తల్లిదండ్రులు మాత్రం వయసును బట్టి పైతరగతికి ప్రమోట్ చేయిస్తున్నారు. పైతరగతుల్లో చేరినా ప్రాథమిక అంశాలపై అవగాహన లేక.. చదువు ఎలాగన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
చదవండి: ఆంగ్ల మాధ్యమంపైనే ఆసక్తి
రెండేళ్లుగా బోధన లేక..
కరోనా సమయంలో ఒకటో తరగతిలో చేరాల్సిన ఐదేళ్ల వయసున్న విద్యార్థులకు 2020లో చదువే లేదు. 2021 నాటికి ఆరేళ్ల వయసుకు వచ్చారు. అప్పుడు 2వ తరగతిలో చేర్చినా రెండో దశ కరోనాతో మళ్లీ బోధన కొన్నాళ్లు కుంటుపడింది. పెద్ద తరగతుల వారికి బోధన సాగినా.. ప్రాథమిక స్థాయి విద్యార్థులకు పెద్దగా తరగతులు జరగలేదు. వారంతా ఈసారి 3వ తరగతికి వచ్చేశారు. కానీ ఒకటో తరగతి, రెండో తరగతిలో నేర్చుకున్నదేమీ లేకపోయినా.. నేరుగా మూడో తరగతి పాఠాలను మాత్రం పూర్తిస్థాయిలో అభ్యసించాల్సిన పరిస్థితి.
చదవండి: లాటరీ విధానంలో ఈ స్కూళ్లలో పేద పిల్లలకు సీట్లు
ప్రాథమిక అంశాలపై శ్రద్ధ పెడితే మేలు
కరోనా ప్రభావం రెండేళ్ల పాటు పిల్లల అభ్యసనపై ప్రభావం చూపినా.. ఇప్పుడు టీచర్లు తలచుకుంటే ఇదేమీ సమస్య కాబోదని విద్యావేత్తలు చెబుతున్నారు. టీచర్లు ప్రాథమిక అంశాలపై దృష్టి సారించి.. పిల్లలకు నేర్పిస్తే సరిపోతుందని అంటున్నారు. ఈ ఉద్దేశంతోనే ప్రభుత్వ పాఠశాలల్లో నెల రోజుల పాటు రెడీనెస్ ప్రోగ్రాం నిర్వహించినా.. అది మొక్కుబడిగానే సాగిందన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రైవేట్ స్కూళ్లలో ఇలాంటి కార్యక్రమమేదీ లేకపోవడం తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఈ కారణంతోనే పిల్లలను ట్యూషన్లకు పంపడం లేదా స్వయంగా దృష్టి పెట్టడం ద్వారా ప్రాథమిక అంశాలపై అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు.
చదవండి: ఇంత మంది విద్యార్థులు దాటితే రెండో టీచర్
విద్యాహక్కు చట్టంలోనూ నిబంధన
వయసును బట్టి నిర్దేశిత తరగతిలో విద్యార్థులను చేర్పించాలన్న నిబంధన విద్యా హక్కు చట్టంలోనూ ఉంది. ఐదేళ్లు నిండిన వారిని ఒకటో తరగతిలో చేర్పించాలని విద్యాహక్కు చట్టం చెబుతోంది. వారు చదవకపోయినా 7 ఏళ్లు నిండిన వారిని 3వ తరగతిలో చేర్చుకోవాలని చెబుతోంది. వయసు పెరిగిన కొద్దీ పిల్లల్లో గ్రహణ శక్తి పెరుగుతుందని విద్యావేత్తలు అంటున్నారు. అందువల్ల నేరుగా పై తరగతుల్లో చేర్పించినా ఇబ్బందేమీ ఉండదని చెబుతున్నారు. అయితే అలాంటి వారికి ప్రాథమిక అంశాలను ప్రత్యేకంగా నేర్పించాల్సి ఉంటుందని.. ఈ ప్రయత్నం జరిగితే విద్యార్థులకు మేలు జరుగుతుందని వివరిస్తున్నారు.
చదవండి: ప్రైవేటు పాఠశాలల్లో ‘విద్యాహక్కు’ సీటు ఫీజు ఖరారు
టీచర్ తలుచుకుంటే నేర్పించడం సులభమే..
కరోనా వల్ల విద్యార్థుల చదువు దెబ్బతింది. వయసు పెరుగుదలతో గ్రహణ శక్తి పెరుగుతుంది. అందువల్ల కింది తరగతిలో చేర్పించాల్సిన అవ సరం లేదు. వయోజన విద్యలో 15 ఏళ్లు దాటిన వారికి 1 నుంచి 5 తరగతులకు సంబంధించిన అన్ని పాఠాలను 6 నెలల్లో చెబుతున్నాం. కాబట్టి చదువులో రెండేళ్లు వ్యవధి వచ్చినా టీచర్లు సరిగ్గా చెబితే విద్యార్థులకు నష్టం ఉండదు.
–డాక్టర్ ఆనందకిషోర్, రిటైర్డ్ డైరెక్టర్, ఎస్‌సీఈఆర్‌టీ
పైతరగతులకే మొగ్గు
పిల్లలను పైతరగతులకు పంపించేందుకు తల్లిదండ్రులు మొగ్గు చూపుతున్నా రు. ఒక్కరు కూడా తమ పిల్లలను అదే తరగతిలో ఉంచాలని చెప్పలేదు. పైతరగతుల్లో శ్రద్ధగా చదివిస్తామనే వారే ఎక్కువగా ఉన్నారు.
– బస్వరాజుకుమార్, టీచర్, చాట్లపల్లి, సిద్దిపేట
ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాం
మా అబ్బాయి ప్రేమ్‌కుమార్. 3వ తరగతి. కరోనా వల్ల రెండేళ్లు స్కూల్‌కు వెళ్లలేదు. ప్రాథమిక అంశాలను నేర్పించడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాం. ట్యూషన్ చెప్పిస్తున్నాం.
–పేర్ల శైలజ, విద్యార్థి తల్లి, తెట్టెలపాడు, ఖమ్మం
మళ్లీ అదే తరగతిలో చేర్పించా..
కరోనా వల్ల చదువు సాగలేదు. మా పాప ఇప్పుడు 3వ తరగతికి వచ్చింది. కానీ 2వ తరగతిలోనే చేర్చాం. ప్రాథమిక అంశాలు ముఖ్యమనే అలా చదివిస్తున్నాం.
– వై.సుధీర్, మావల, ఆదిలాబాద్
ఒక్కరే కింది తరగతిలో..
కరోనా వల్ల ఆన్‌లైన్ బోధన నిర్వహించాం. అందరిని ప్రమోట్ చేశాం. 1, 2 తరగతులు అలాగే పూర్తయ్యాయి. 20 మందిలో ఒక్కరు మాత్రమే మళ్లీ ఒకటో తరగతి చదువుతున్నారు.
– కె.శోభ, ప్రైవేట్ టీచర్, నిజామాబాద్