ఇంత మంది విద్యార్థులు దాటితే రెండో టీచర్
ఇంతకు ముందు కనీస విద్యార్థుల సంఖ్య 31 ఉంటే రెండో ఎస్జీటీని నియమించేలా జీవో 117ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ జీవోలోని అంశాలపై ఉపాధ్యాయ సంఘాల నుంచి అభ్యంతరాలు రావడంతో ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వారితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వారి వినతులను పరిగణనలోకి తీసుకొని జీవో 117కు కొన్ని సవరణలు ప్రతిపాదిస్తూ పాఠశాల విద్యా శాఖ తాజాగా జీవో 128 విడుదల చేసింది. దీని ఆధారంగా పాఠశాల విద్యా శాఖ కమిషనర్ జూలై 14న సవరణలపై ప్రొసీడింగ్స్ విడుదల చేశారు. దీని ప్రకారం రెండో ఎస్టీటీ నియామకానికి కనీస విద్యార్థుల సంఖ్య 21 చేశారు. అలాగే ఫౌండేషన్ ప్లస్ (పీపీ1, పీపీ2, 1 నుంచి 5 వతరగతి వరకు) స్కూళ్లలో కూడా ఇదే విధానంలో రెండో ఎస్జీటీ పోస్టును కేటాయిస్తారు. ప్రైమరీ స్కూళ్లలో 121 మంది విద్యార్థులుంటే హెడ్మాస్టర్ పోస్టు కేటాయించాలని గత జీవోలో పేర్కొనగా తాజా జీవోలో విద్యార్ఠుల సంఖ్యను 150 చేశారు.
చదవండి: బాలికల హైస్కూలు ప్లస్‌గా 292 హైస్కూళ్లు
టీచర్ల సంఖ్య ఇలా
5 నుంచి 10వ తరగతి వరకు ఉండే హైస్కూళ్లలో స్కూల్ అసిస్టెంట్ సబ్జెక్టు టీచర్ల సంఖ్యలో కూడా సవరణలు చేశారు. విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా ప్రతి హైస్కూలుకు ఒక హెచ్‌ఎం ఉంటారు. 5 సెక్షన్లుంటే హెచ్‌ఎంతో పాటు 8 మంది స్కూల్ అసిస్టెంట్ టీచర్లుంటారు. సెక్షన్ల సంఖ్యను అనుసరించి 6 సెక్షన్లకు హెచ్‌ఎం, 9 మంది ఎస్‌ఏలు, 7కు హెచ్‌ఎం 10 మంది ఎస్‌ఏలు, 8కి హెచ్‌ఎం 11 మంది ఎస్‌ఏలు, 9కి హెచ్‌ఎం 12 మంది ఎస్‌ఏలు, 10కి హెచ్‌ఎం 14 మంది ఎస్‌ఏలు ఉంటారు. ఆపై పెరిగే ఒక్కో సెక్షన్‌కు స్కూల్ అసిస్టెంటు టీచర్‌ను అదనంగా కేటాయిస్తారు. ఇలా 17 సెక్షన్లుండే హైస్కూల్‌లో హెచ్‌ఎం, 21 మంది ఎస్‌ఏ టీచర్లను కేటాయిస్తారు. మంత్రి హామీ మేరకు
చదవండి: ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు బేస్‌లైన్ టెస్టు తేదీ ఇదే..
సవరణలు చేయాలి: ఉపాధ్యాయ సంఘాలు
ఇలా ఉండగా మంత్రి బొత్స సత్యనారాయణ సమక్షంలో పేర్కొన్న ప్రకారం జీవోలో సవరణలు లేవని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. ప్రైమరీ పాఠశాలకు హెచ్‌ఎం పోస్టుకు 121 విద్యార్థుల సంఖ్యకు బదులు 150 దాటి ఉండాలనడం సరికాదని ఏపీటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.హృదయరాజు, ఎస్.చిరంజీవి పేర్కొన్నారు. ఇంకా అనేక అంశాలు సవరించలేదని వివరించారు. ప్రీ హై స్కూల్, తక్కువ మంది విద్యార్థులు ఉన్న ఉన్నత పాఠశాలల్లో పీఈటీ, హెచ్‌ఎంల పోస్టులు ఉంటాయా లేదా అనే అంశం, ప్రీ హైస్కూల్లో తక్కువ మంది విద్యార్థులు ఉంటే స్కూల్ అసిస్టెంట్లతో బోధన చేయిస్తారా లేదా అనే అంశం, హైస్కూల్లో సెక్షన్‌కు 50 మంది విద్యార్థులు దాటితే రెండో సెక్షన్ ఇస్తామన్న హామీ అమలు చేయట్లేదని ఎన్‌టీఏ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కరణం హరికృష్ణ, ఎం.శ్రీనివాస్ చెప్పారు. మంత్రి హామీ మేరకు పూర్తిస్థాయిలో జీవో 117కు సవరణ ఉత్తర్వులు ఇవ్వాలని ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు సామల సింహాచలం కోరారు.
చదవండి: కార్పొరేట్ స్కూళ్లలోనూ ‘కోటా’