Skip to main content

English Medium: ఆంగ్ల మాధ్యమంపైనే ఆసక్తి

ఉన్నత విద్యావకాశాలను ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతున్నా క్షేత్రస్థాయిలో ఆంగ్ల మాధ్యమం వైపే విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు.
English Medium
ఆంగ్ల మాధ్యమంపైనే ఆసక్తి

తమ ప్రాంతీయ భాషల్లో పరీక్షలు రాసేందుకు ముందుకు రావడం లేదు. ప్రాంతీయ భాషల్లో పరీక్షలు రాసే వారు అతి తక్కువ మంది కాగా.. వారిలోనూ మెరిట్‌ ర్యాంకుల్లో నిలిచేలా స్కోర్‌ సాధించిన వారు శూన్యం. IIT, NIT తదితర జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే Joint Entrance Examination (JEE) మెయిన్‌లో ఈ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. 

చదవండి: దేశంలో అత్యుత్తమ విద్యాసంస్థ - ఐఐటీ–మద్రాస్‌

డిమాండ్ల నేపథ్యంలో..

ఉన్నత విద్యావకాశాలను ముఖ్యంగా ఇంజనీరింగ్‌ తదితర కోర్సులను ఆయా ప్రాంతీయ భాషల్లోనూ విద్యార్థులకు అందుబాటులో ఉండేలా కేంద్ర ప్రభుత్వం 2020–21 నుంచి చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. నూతన జాతీయ విద్యా విధానాన్ని అనుసరించి నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ గతేడాది నుంచి జేఈఈ మెయిన్‌ను ఆంగ్లంతో పాటు 12 ప్రాంతీయ భాషల్లో నిర్వహింపజేస్తోంది. హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూ భాషల్లోనూ జేఈఈ మెయిన్‌ రాసేందుకు విద్యార్థులకు అవకాశమిచ్చింది. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ఏర్పాటుకు ముందు జేఈఈ నిర్వహణ బాధ్యతలు చూసిన సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ).. 2014 వరకు ఆంగ్లం, హిందీ, గుజరాతీ, మరాఠీ, ఉర్దూ మాధ్యమాల్లో జేఈఈని నిర్వహించేది. 2016 తర్వాత ఆంగ్లం, హిందీ, గుజరాతీల్లో జేఈఈని కొనసాగిస్తూ మరాఠీ, ఉర్దూలను తొలగించారు. అయితే తమ రాష్ట్రం నుంచి అత్యధిక సంఖ్యలో జేఈఈ పరీక్షలకు విద్యార్థులు హాజరవుతున్నందున బెంగాలీ భాషా మాధ్యమంలో ఈ పరీక్షలను నిర్వహించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డిమాండ్‌ చేయడంతో.. ప్రాంతీయ భాషా మాధ్యమాల్లో జేఈఈ మెయిన్‌ నిర్వహణకు బీజం పడింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచి కూడా అత్యధిక సంఖ్యలో విద్యార్థులు ఈ పరీక్షలు రాస్తుండటం, తమిళనాడు నుంచి కూడా అంతకు ముందు నుంచే ఆ భాషా మాధ్యమంలో పరీక్ష నిర్వహించాలన్న డిమాండ్‌ ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ సూచనలతో ఎన్టీఏ.. జేఈఈలో ఆంగ్లం, హిందీ, గుజరాతీలతో పాటుగా కొత్తగా మరో 10 ప్రాంతీయ భాషా మాధ్యమాలను ప్రవేశపెట్టింది.

చదవండి: ఉత్తమ విద్యాసంస్థల జాబితాలో మ‌న‌ ఐఐటీ

ఆయా సబ్జెక్టులకు ఆంగ్లమే అనువు

జేఈఈకి దరఖాస్తుచేసే అభ్యర్థుల్లో కొంతమంది పాఠశాల స్థాయి విద్యను వారి మాతృభాషలో పూర్తి చేసినా.. ఎక్కువ మంది ఆంగ్ల మాధ్యమంలోనే చదువుతున్నారు. పైగా ఇంటర్‌ విద్యను పూర్తిగా ఆంగ్ల మాధ్యమంలోనే అభ్యసిస్తున్నారు. జేఈఈకి కీలకమైన మేథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ తదితర సబ్జెక్టులు ఆంగ్ల మాధ్యమంలోనే చదవడం, తెలుగు మాధ్యమంలోని ఆయా సబ్జెక్టుల పదాలు అంత త్వరగా అర్థం చేసుకునే పరిస్థితి లేకపోవడంతో విద్యార్థులు ఆంగ్ల మాధ్యమం వైపే మొగ్గు చూపుతున్నారు. జేఈఈ వంటి అత్యంత కీలకమైన పోటీ పరీక్షల్లో ప్రశ్నలు చాలా చిక్కుముడులతో ఉండటంతో అర్థం చేసుకోవడం చాలా కష్టం. దాని కోసం ప్రత్యేకంగా తీసుకునే కోచింగ్‌ను కూడా ఆంగ్ల మాధ్యమంలోనే కొనసాగిస్తున్నారు. ఆంగ్లంలో ఉండే ప్రశ్నలనే అర్థం చేసుకుని సరైన సమాధానాలు గుర్తించడం కత్తి మీద సాము. అలాంటిది తమకు అర్థం కాని పారిభాషిక పదాలతో ఉండే తెలుగు తదితర ప్రాంతీయ భాషా మాధ్యమాల్లో ఆయా ప్రశ్నలను, సమాధానాలను అసలు అర్థం చేసుకునే పరిస్థితి విద్యార్థులకు లేదు. తప్పుడు సమాధానాలకు మైనస్‌ మార్కులుండే జేఈఈ వంటి పరీక్షల్లో విద్యార్థులు రిస్క్‌ తీసుకోలేక ఆంగ్ల మాధ్యమంలోనే ఆ పరీక్షలు రాసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

చదవండి: ఐఐటీఎం ఆచార్యునికి ప్రతిష్టాత్మక పురస్కారం

అవకాశమిచ్చినా అరకొరగానే..

ప్రాంతీయ భాషా మాధ్యమాల్లో జేఈఈ పరీక్ష రాసేందుకు అవకాశం కల్పించినా ఎక్కువ మంది ఆంగ్ల మాధ్యమంలో రాసేందుకే ఆసక్తి చూపుతున్నారు. 2020–21లో జేఈఈ మెయిన్‌ పరీక్షలకు 11 లక్షల వరకు దరఖాస్తు చేయగా.. వారిలో తెలుగు విద్యార్థులు 1.80 లక్షల దాకా ఉన్నారు. వీరిలో కేవలం 371 మందే తెలుగు మాధ్యమంలో పరీక్ష రాసేందుకు ముందుకొచ్చారు. బెంగాలీ, గుజరాతీ మినహా తక్కిన ప్రాంతీయ భాషా మాధ్యమాల్లోనూ ఇదే పరిస్థితి. హిందీలో పరీక్షలు రాసేందుకు 76,459 మంది, గుజరాతీలో 44,094 మంది, బెంగాలీలో 24,841 మంది, తమిళంలో 1,264 మంది దరఖాస్తు చేయగా.. అస్సామీలో 700, కన్నడలో 234, మలయాళంలో 398, మరాఠీలో 658, ఒడియాలో 471, పంజాబీలో 107, ఉర్దూలో 24 మంది దరఖాస్తు చేశారు. అలాగే, 2021–22లో జేఈఈ మెయిన్‌కు కూడా ప్రాంతీయ భాషా మాధ్యమాల్లో గతంలో కన్నా అతి తక్కువ దరఖాస్తులొచ్చాయి. గత నెల 23 నుంచి జేఈఈ మెయిన్‌ తొలి సెషన్‌ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. రెండో సెషన్‌ పరీక్షలు ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్నాయి. రెండో సెషన్‌ పరీక్షలు కూడా పూర్తయితే ప్రాంతీయ భాషా మాధ్యమాలకు ఎంతమంది విద్యార్థులు దరఖాస్తు చేశారన్నది తేటతెల్లమవుతుంది. అలాగే జేఈఈలో అత్యధిక మార్కులతో ఉత్తమ ర్యాంకులు పొందిన విద్యార్థులు పూర్తిగా ఆంగ్ల మాధ్యమంలో పరీక్షలు రాసినవారే కావడం గమనార్హం. గతేడాదిలోనే కాకుండా ఇటీవల ముగిసిన జేఈఈ మెయిన్‌–2022 తొలి విడత పరీక్షల్లో దేశ వ్యాప్తంగా 100 శాతం ఎన్టీఏ స్కోరు సాధించిన 14 మంది విద్యార్థులు ఆంగ్ల మాధ్యమం వారే. వీరిలో నలుగురు తెలంగాణ, ముగ్గురు ఆంధ్రప్రదేశ్‌ వారున్నారు.

Published date : 19 Jul 2022 12:44PM

Photo Stories