NIRF Rankings 2022: దేశంలో అత్యుత్తమ విద్యాసంస్థ - ఐఐటీ–మద్రాస్
దేశంలో అత్యుత్తుమ విద్యా సంస్థల జాబితాలో ఐఐటీ–మద్రాస్ వరసగా నాలుగో ఏడాది తొలి స్థానంలో నిలిచింది. నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్‌ఐఆర్‌ఎఫ్) కింద 11 విభాగాల్లో ర్యాంకుల జాబితాను కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ జూలై 15న విడుదల చేశారు. 2016 నుంచి కేంద్ర విద్యా శాఖ ఈ ర్యాంకులను ప్రకటిస్తోంది. ఉత్తమ విశ్వవిద్యాలయాల విభాగంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ)–బెంగళూరు తొలి స్థానం దక్కించుకుంది. ఫార్మసీ విభాగంలో నైపర్–హైదరాబాద్ రెండో ర్యాంకు, న్యాయ విద్యలో హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా నాలుగో ర్యాంకు సాధించాయి. ఉస్మానియా యూనివర్సిటీకి 22వ ర్యాంకు, ఆంధ్ర యూనివర్సిటీ 36వ ర్యాంకు లభించింది.
Also read: GK International Quiz:. ఐక్యరాజ్యసమితిలో హిందీ భాషను ప్రోత్సహించడానికి భారతదేశం ఎంత మొత్తాన్ని అందిస్తోంది?
టాప్–100 ఇంజనీరింగ్ కాలేజీల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 9 కాలేజీలున్నాయి. టాప్–100 ఫార్మసీ కాలేజీల్లో రెండు రాష్ట్రాలకు చెందిన 15 కాలేజీలున్నాయి. పరిశోధన విభాగంలో ఐఐటీ–హైదరాబాద్ 12వ ర్యాంకు సాధించింది. మెడికల్ విభాగంలో 50 ర్యాంకులు ప్రకటించగా తెలంగాణ, ఏపీలోని కళాశాలలకు స్థానం దక్కలేదు.
ఓవరాల్ ర్యాంకింగ్
ఐఐటీ–మద్రాస్ (87.59 స్కోరు) తొలిస్థానంలో నిలవగా, 83.57 స్కోరుతో ఐఐఎస్సీ–బెంగళూరు రెండోస్థానంలో, 82.35 స్కోరుతో ఐఐటీ–బాంబే మూడో స్థానంలో నిలిచాయి. ఐఐటీ–హైదరాబాద్ 62.86 స్కోరుతో 14వ ర్యాంకు, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 59.67 స్కోరుతో 20వ ర్యాంకు, ఎన్‌ఐటీ–వరంగల్ 50.61 స్కోరుతో 45వ ర్యాంకు, ఉస్మానియా యూనివర్సిటీ 50.60 స్కోరుతో 46వ ర్యాంకు సాధించాయి. కాలేజీల విభాగంలో ఆంధ్రా లయోలా కాలేజ్ (విజయవాడ) 52.38 స్కోరుతో 94వ ర్యాంకు సాధించింది.
Also read; Nonorocks ISS : అంతరిక్షంలో తయారయ్యే వ్యర్థాలకు చెక్..!
ఇంజినీరింగ్
ఐఐటీ మద్రాస్ 90.94 స్కోరుతో తొలిస్థానం, ఐఐటీ న్యూఢిల్లీ 88.12 స్కోరుతో రెండో స్థానం, ఐఐటీ బాంబే 83.96 స్కోరుతో మూడో స్థానంలో నిలిచాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐఐటీ హైదరాబాద్ 68.03 స్కోరుతో తొమ్మిదో స్థానం, ఎన్‌ఐటీ వరంగల్ 60 స్కోరుతో 21వ ర్యాంకు, కేఎల్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ 44వ ర్యాంకు, ఐఐటీ తిరుపతి 48.16 స్కోరుతో 56వ ర్యాంకు, ఐఐఐటీ–హైదరాబాద్ 46.41 స్కోరుతో 62వ ర్యాంకు, జేఎన్‌టీయూ–హైదరాబాద్ 42.77 స్కోరుతో 76వ ర్యాంకు సాధించాయి.
మేనేజ్‌మెంట్
ఐఐఎం–అహ్మదాబాద్ 83.35 స్కోరుతో తొలి ర్యాంకు, ఐఐఎం–బెంగళూరు 82.62 స్కోరుతో 2వ ర్యాంకు, ఐఐఎం–కలకత్తా 78.64 స్కోరుతో మూడో ర్యాంకు సాధించాయి. ఇక్ఫాయ్ ఫౌండేషన్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్–హైదరాబాద్ 54.88 స్కోరుతో 32వ ర్యాంకు, ఐఐఎం–విశాఖపట్నం 54.36 స్కోరుతో 33వ ర్యాంకు, కేఎల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ 51.27 స్కోరుతో 47వ ర్యాంకు సాధించాయి.
Also read: GK Persons Quiz: త్రిపుర ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణం చేశారు?
ఫార్మసీ
జామియా హమ్‌దర్ద్–న్యూఢిల్లీ 79.50 స్కోరుతో తొలి ర్యాంకు, నైపర్–హైదరాబాద్ 79.46 స్కోరుతో రెండో ర్యాంకు సాధించగా, హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీ 47.38 స్కోరుతో 44వ ర్యాంకు సాధించింది.