ఉపాధ్యాయులను నియమించండి.. పాఠశాలకు తాళం వేసి నిరసన తెలిపిన విద్యార్థులు..
జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మున్సిపాలిటీ పరిధిలోని తుపత్రాల ప్రాథమికోన్నత పాఠశాలలో మొత్తం 190 మంది విద్యార్థులున్నారు. వారికి పాఠాలు బోధించేందుకు కేవలం ముగ్గురు ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారు. దీంతో సరైన బోధన అందడం లేదని, వెంటనే ఉపాధ్యాయులను నియమించాలని కొన్నిరోజులుగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. విద్యాశాఖ అధికారులు స్పందించడం లేదని ఆగ్రహం చెందిన విద్యార్థులు ఆగస్టు 26న పాఠశాల ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ.. పాఠశాలలో గతంలో ముగ్గురు ప్రభుత్వ ఉపాధ్యాయులతో పాటు నలుగురు విద్యావలంటీర్లు ఉండేవారని, ఇప్పుడు ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారని తెలిపారు. కరోనా కారణంగా రెండేళ్లుగా విద్యార్థులకు సరైన విద్య అందలేదని, ఇప్పుడు ఉపాధ్యాయుల కొరత ఉండడంతో విద్యార్థులు అన్ని సబ్జెక్టులను నేర్చుకోలేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులను నియమించేంతవరకు విద్యార్థులను పాఠశాలకు పంపబోమని స్పష్టం చేశారు. వెంటనే టీచర్లను నియమించాలని ఇంచార్జ్ ఎంఈఓకు వినతిపత్రం అందజేశారు. ఇంచార్జ్ ఎంఈఓ నరసింహ సమస్యను ఉన్నతాధికారులకు తెలియజేశారు.
చదవండి: