Skip to main content

Admissions: ఈ విద్యా సంస్థల్లో సీట్లు ఖాళీ లేవంటూ బోర్డులు

గురుకుల విద్యా సంస్థల్లో అడ్మిషన్లకు డిమాండ్‌ ఏమాత్రం తగ్గడం లేదు.
gurukula educational institutions
ఈ విద్యా సంస్థల్లో సీట్లు ఖాళీ లేవంటూ బోర్డులు

పూర్తిస్థాయిలో అడ్మిషన్లు చేపట్టినట్లు సొసైటీలు ప్రకటిస్తున్నా... ‘ఒక్క సీటు’ కావాలంటూ ప్రవేశాల కోసం విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కార్యాలయాలు కిక్కిరిసి పోతున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల పరిధిలోని గురుకుల సొసైటీ పాఠశాలల్లో ఐదోతరగతిలో నూతన అడ్మిషన్ల ప్రక్రియ, బ్యాక్‌లాగ్‌ ఖాళీ సీట్ల భర్తీ ప్రక్రియ దాదాపు పూర్తయినట్లు ఆయా సొసైటీలు బహిరంగంగా ప్రకటించాయి. అర్హత పరీక్షల ద్వారా విద్యార్థి సామర్థ్యాన్ని గుర్తించి మెరిట్‌ ప్రకారం గురుకుల సొసైటీలు అడ్మిషన్లు చేపట్టాయి. కౌన్సెలింగ్‌ నిర్వహించి అడ్మిషన్లు చేపట్టాయి. అడ్మిషన్లు పూర్తయ్యాయని, సీట్లు లేవని బోర్డులు ఏర్పాటు చేసినప్పటికీ సీట్లు కావాలంటూ విద్యార్థులు, తల్లిదండ్రులు సొసైటీ కార్యాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నారు.

చదవండి: Admissions: టెన్త్‌ సప్లిమెంటరీ విద్యార్థులకూ గురుకులాల్లో సీట్లు

ఫిజికల్‌ రిపోర్టింగే మిగిలింది...

రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ గురుకుల సొసైటీలు, విద్యాశాఖకు చెందిన జనరల్‌ గురుకుల సొసైటీల పరిధిలో 750 గురుకుల పాఠశాలలున్నాయి. వీటిలో ప్రతి సంవత్సరం ఐదో తరగతిలో దాదాపు 50 వేల మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తారు. నాల్గోతరగతి చదివే విద్యార్థులకు రాత పరీక్ష నిర్వహించి, మార్కుల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. రిజర్వేషన్లకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఆన్‌లైన్‌ పద్ధతిలో ప్రక్రియ పూర్తి చేస్తారు. 2022–23 విద్యా సంవత్సరంలో ఇదే తరహాలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ, తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ, మహాత్మా జ్యోతిభాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ, తెలంగాణ గురుకుల విద్యా సంస్థల సొసైటీలు ఉమ్మడిగా అర్హత పరీక్ష నిర్వహించాయి. దాదాపు 1.6 లక్షల మంది విద్యార్థులు ఈ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోగా.. ఒక్కో సీటుకు సగటున ముగ్గురు పోటీపడ్డారు. పరీక్ష అనంతరం మెరిట్‌ ఆధారంగా సొసైటీలు సీట్లు కేటాయించారు. మైనార్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ ప్రత్యేకంగా అర్హత పరీక్ష నిర్వహించి ఆమేరకు అడ్మిషన్లు చేపట్టింది. 6, 7, 8, 9 తరగతుల్లోని బ్యాక్‌లాగ్‌ సీట్ల భర్తీకి సైతం సొసైటీల వారీగా పరీక్షలు నిర్వహించారు. అర్హులైన విద్యార్థులకు సీట్లు కేటాయించారు. అన్ని గురుకుల సొసైటీల్లో సీట్ల కేటాయింపులు పూర్తయ్యాయి. ఈ వారాంతంలోగా పాఠశాలల్లో ఆయా విద్యార్థులు ఫిజికల్‌ రిపోర్టింగ్‌ చేయాల్సి ఉంటుంది. దీంతో ప్రవేశాల ప్రక్రియ దాదాపు ముగిసినట్లే.

చదవండి: గురుకులాల్లో వీఆర్వోల అలజడి

సీట్లు లేవు... దయచేసి రావొద్దు...

ఐదు గురుకుల సొసైటీల పరిధిలో సీట్ల కేటాయింపులు పూర్తయినప్పటికీ విద్యార్థులు, తల్లిదండ్రులు అడ్మిషన్ల కోసం గురుకుల సొసైటీ కార్యదర్శి కార్యాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. దీంతో సీట్లు లేవంటూ సొసైటీలు ఇప్పటికే ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశాయి. గిరిజన గురుకుల సొసైటీ, జనరల్‌ గురుకుల సొసైటీలు కార్యాలయాల వద్ద సూచనలు చేస్తూ పోస్టర్లు అంటించాయి. అయినప్పటికీ సీట్ల కోసం దూరప్రాంతాల నుంచి వచ్చే వారి సంఖ్య తగ్గడం లేదు. సీట్ల కోసం వచ్చే వారిని కార్యాలయాల్లోకి అనుమతించకుండా, వారిని నిలువరించేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేశారు.

చదవండి: మంజూరు చేసిన చోటే గురుకులాలు

Published date : 25 Aug 2022 03:03PM

Photo Stories