కొత్తగా మరిన్ని బీసీ గురుకుల పాఠశాలలు మంజూరు
రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు ఒక పాఠశాలను కేటాయించిన ప్రభుత్వం, 2022–23 విద్యా సంవత్సరం నుంచే ఈ పాఠశాలలను ప్రారంభించనున్నట్లు స్పష్టం చేసింది. కొత్త పాఠశాలల ఏర్పాటుకు భవనాలను గుర్తించి, మౌలిక వసతులు కల్పించాలని సొసైటీని ఆదేశించింది. ఈ మేరకు తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు.
బీసీ విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మరిన్ని పాఠశాలలు ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉన్నందున మరో నాలుగేళ్ల పాటు ప్రతి సంవత్సరం జిల్లాకు ఒక పాఠశాలను కొత్తగా ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల నేపథ్యంలో బీసీ గురుకుల సొసైటీ కొత్త పాఠశాలల ప్రారంభంపై కసరత్తు ప్రారంభించింది.
చదవండి: మంజూరు చేసిన చోటే గురుకులాలు
బీసీలకు నాణ్యమైన ఉన్నత విద్యను ఉచితంగా అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఇందులో భాగంగా బీసీ గురుకుల సొసైటీని విడతలవారీగా అభివృద్ధి చేస్తున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆగస్టు 25న ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. 2022లో కొత్తగా 33 గురుకుల పాఠశాలలతో పాటు మరో 15 డిగ్రీ కాలేజీలను కూడా ప్రారంభించనున్నట్లు మంత్రి వెల్లడించారు.
తెలంగాణ ఏర్పాటుకు ముందు కేవలం 19 బీసీ గురుకుల పాఠశాలలు మాత్రమే ఉండగా, ఇప్పుడు వాటి సంఖ్య 294కు పెరిగిందని వివరించారు. కాగా, మంత్రి గంగుల కరీంనగర్‌లో విలేకరులతో మాట్లాడుతూ, తెలంగాణ ఏర్పాటుకు ముందు సరైన విద్యా సదుపాయాలు లేక బీసీలు వెనుకబడ్డారని, ఈ నేపథ్యంలో వారిని ప్రోత్సహించేందుకు సీఎం కేసీఆర్ కోట్ల రూపాయలు ఖర్చు చేసి పెద్ద ఎత్తున గురుకులాలు ప్రారంభించారని తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ముందు 19 గురుకులాల్లో కేవలం 7,500 మంది మాత్రమే చదువుకునేవారని, తెలంగాణ వచ్చాక ఆరేళ్లలో 261 గురుకులాలు ఏర్పాటు చేస్తే ప్రస్తుతం 1.52 లక్షల మంది బీసీ విద్యార్థులు చదువుకుంటున్నారని వెల్లడించారు.
చదవండి: గురుకులాల్లో 317 గుబులు!
గురుకులాల్లో చదువుకునే విద్యార్థు ల సౌకర్యార్థం ఇకపై వేడి నీరు అందుబాటులో ఉంచనున్నామని ప్రకటించారు. ఇందుకోసం రూ.85 కోట్లు వెచ్చించనున్నట్లు మంత్రి తెలిపారు. కాగా, గురుకుల డిగ్రీ కాలేజీల్లో మార్కెట్‌లో డిమాండ్ ఉన్న ఎనిమిది రకాల కోర్సులనే
అందుబాటులో ఉంచుతామని వివరించారు.
చదవండి: Gurukul admissions: గురుకులాల్లో స్థానికులకే సగం సీట్లు