TET: ఫలితాలు ఆలస్యం
ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 27న ఫలితాలను వెల్లడించాల్సి ఉంది. అయితే ఇది వాయిదా పడింది. తదుపరి తేదీని త్వరలో ప్రకటిస్తామని టెట్ కన్వీనర్ రాధారెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఫలితాల వెల్లడిలో జాప్యానికి మాత్రం ఆమె కారణాలను చెప్పలేదు. మా ర్కుల క్రోడీకరణ, సాంకేతికంగా తలెత్తిన కొన్ని సమస్యల వల్లే ఫలితాల వెల్లడిని వాయిదా వేసినట్టు అధికారవర్గాల ద్వారా తెలిసింది. టెట్‌ను జూన్ 12న రాష్ట్రవ్యాప్తంగా జరిగిన విషయం తెలిసిందే. మునుపెన్నడూ లేని విధంగా ఈసారి పరీక్షకు 90 శాతానికిపైగా విద్యార్థులు హాజరయ్యారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు అర్హత గల పేపర్–2 రాసే అభ్యర్థులు, సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకూ అర్హత పొందేలా అవకాశం ఇవ్వడంతో పేపర్–1ను ఎక్కువ మంది రాశారు. టెట్‌ను జీవితకాల అర్హతగా గుర్తించడంతో పోటీ పెరిగింది. పేపర్–1 పరీక్షకు 3,18,506 మంది (90.62 శాతం), పేపర్–2కు 2,51,070 (90.35 శాతం) మంది అభ్యర్థులు హాజరయ్యారు. విద్యాశాఖ ఇటీవల విడుదల చేసిన సమాధానాల కీపై పేపర్–1కు 7,930, పేపర్–2కు 4,663 అభ్యంతరాలు రాగా, వీటిపై చర్యలు చేపట్టామని అధికారులు తెలిపారు. అయినప్పటికీ ఫలితాలను అప్‌లోడ్ చేయడం, క్రాస్ చెక్ దగ్గర ఆలస్యమైందని అధికారులు అంటున్నారు. అప్లికేషన్ల ఆన్‌లైన్ అప్‌లోడ్ ప్రక్రియ చాలారోజులు తికమక పెట్టింది. ఆ తర్వాత తప్పులను సరి చేసుకునే అవకాశం ఇవ్వకపోవడం గందరగోళానికి దారి తీసింది. ఆఖరుకు హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌లోనూ అభ్యర్థులు ఇబ్బంది పడ్డారు. వాటిపై ఫొటోలు, సంతకాలు లేకపోవడం, డీఈవోల చుట్టూ అనుమతి కోసం తిరగడం వంటి అనుభవాలు ఎదురయ్యాయి. ఇప్పుడు ఫలితాల వెల్లడిలోనూ సరైన సమాచారంలేక నిరాశకు గురవుతున్నారు.
చదవండి: