Skip to main content

Kamal Success Journey: బంట్రోత్‌ నుంచి అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ వరకు... కమల్‌ సక్సెస్‌ జర్నీ సాగిందిలా

ప్రొఫెసర్‌ కమల్‌కిశోర్‌ గురించి వింటే సినిమా కష్టాలను విన్నట్లే ఉంటుంది. కఠిక పేదరికం, ఎప్పుడు కూలుతుందో తెలియని ఇళ్లు, అనారోగ్యంతో బాధపడే తల్లి క్లుప్తంగా కిశోర్‌ జీవితం ఇదే.
kamal kishore

కానీ, ఎలాంటి కష్టాలు వచ్చినా మొక్కవోని సంకల్పంతో ముందుకు కదిలారు. నైట్‌ వాచ్‌మెన్‌గా జీవితాన్ని ప్రారంభించి.. ఇప్పుడు యూనివర్సిటీకి ప్రొఫెసర్‌గా ఎదిగారు. ఆయన జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. 
2003లో నైట్‌ వాచ్‌మెన్‌గా....
కమల్‌ కిశోర్‌ మండల్‌(42) .. ఉండేది బీహార్‌ భగల్‌పూర్‌ ముండీచాక్‌ ప్రాంతం. చాలా పేద కుటుంబం ఆయనది. కమల్‌ తండ్రి గోపాల్‌ రోడ్డు పక్కన టీ అమ్ముతుంటారు(ఇప్పటికీ). డిగ్రీ వరకు ఎలాగోలా స్కాలర్‌షిప్‌ మీద నెట్టుకొచ్చారు కమల్‌. అయితే ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా డిగ్రీతోనే చదువు ఆపేశారు. పొలిటికల్ సైన్స్‌ చదివినా... కుటుంబ పోషణ కోసం 2003లో ముంగర్‌లో ఉండే ఆర్డీఅండ్‌ డీజే కాలేజీ నైట్‌ వాచ్‌మెన్ గా చేరాడు. 

bihar university commission


ఉదయం కాలేజీ... మధ్యాహ్నం బంట్రోతు పని
కష్టపడే వారికి ఆ దైవం కూడా అండగా ఉంటుందంటారు. అలాగే కమల్‌ అదృష్టం కొద్దీ నెల రోజులకే డిప్యుటేషన్‌  మీద తిల్కా మాంజీ భగల్‌పూర్‌ యూనివర్సిటీకి ప్యూన్ గా వెళ్లాడు. అక్కడ పీజీలోని అంబేద్కర్‌ థాట్‌ అండ్‌ సోషల్‌ వర్క్‌ డిపార్ట్‌మెంట్‌కు ప్యూన్ గా పని చేశాడు. అది ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. స్టాఫ్‌కు చాయ్‌లు, టిఫిన్‌లు, పేపర్లు అందించిన కమల్‌కి... అక్కడికి వచ్చే విద్యార్థులు, అధ్యాపకులను చూసిన కిశోర్‌కు మళ్లీ చదువుకోవాలనే కోరిక కలిగింది. దీంతో సంబంధిత విభాగానికి ఆయన అర్జీ పెట్టుకున్నారు. వెంటనే అనుమతి దొరికింది. ఉదయం కాలేజీ.. మధ్యాహ్నం నుంచి బంట్రోతు పని.. రాత్రిళ్లు చదువు.. ఇలా ఏళ్లకు ఏళ్లు గడిచిపోయింది.

చ‌ద‌వండి: 19 ఏళ్ల‌కే ఫిఫా ఎంట్రీ... ఎంబాపె గురించి మీకు ఈ విషయాలు తెలుసా
2009లో ఎంఏ పూర్తి
మొత్తానికి ఎంఏ(అంబేద్కర్‌ థాట్‌ అండ్‌ సోషల్‌ వర్క్‌)ను 2009లో పూర్తి చేశారు. ఆ వెంటనే పీజీ కోసం డిపార్ట్‌మెంట్‌లో అనుమతి కోరగా.. మూడేళ్ల తర్వాత అది లభించింది. ఆపై 2013లో పీహెచ్‌డీ కోసం దరఖాస్తు చేసుకుని.. 2017లో థీసిస్‌ సమర్పించారు. 2019లో పీహెచ్‌డీ పట్టా దక్కింది కమల్‌కి. అంతేకాదు.. అదే ఊపుతో లెక్చరర్‌షిప్‌కు సంబంధించిన నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌(నెట్‌) పూర్తి చేసి.. నోటిఫికేషన్ల కోసం ఎదురు చూశారు. 
2022లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా....
అయితే లక్ష్య సాధనకు ఆయనకు ఎంతో సమయం పట్టలేదు. 2020లో బీహార్‌ స్టేట్‌ యూనివర్సిటీ సర్వీస్‌ కమిషన్‌ (బీఎస్‌యూఎస్‌సీ) టీఎంబీయూకి సంబంధించిన నాలుగు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. 12 మంది ఇంటర్వ్యూకి హాజరయ్యారు. అందులో కమల్‌ కిషోర్‌ మండల్‌ కూడా ఒకరు. మే 19, 2022న ఫలితాలు వెలువడగా.. అందులో అర్హత సాధించి.. ఏ యూనివర్సిటీలో అయితే బంట్రోతుగా పని చేశారో.. ఆ యూనివర్సిటీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా అర్హత సాధించారు. అక్టోబర్‌ 12వ తేదీ ఆయన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ విధుల్లో చేరారు.   

చ‌ద‌వండి:హార్మోన్‌ లోపంతో ఇబ్బంది... ఇప్పుడు ప్రపంచకప్‌ విన్నర్‌... మెస్సీ జీవిత విశేషాలు

‘‘ పేదరికం, కుటుంబ సమస్యలు నా చదువుకు ఆటంకంగా మారలేదు. ఉదయం కాలేజీకి వెళ్లి.. మధ్యాహ్నం డ్యూటీ చేసేవాడిని. రాత్రి పూట చదువుకునేవాడిని. సహకరించిన ప్రొఫెసర్లు, ఉన్నతాధికారులకు ఈ విజయాన్ని అంకితం ఇస్తున్నా ’’ అని అంటారు కమల్‌ కిశోర్‌ మండల్‌.

‘‘ పరిస్థితులు అనుకూలించలేదని, పేదరికం వల్లే తాము చదువు దూరమయ్యామని, మంచి ఉద్యోగం సాధించలేకపోయామని కొందరు చెబుతుంటారు. కానీ, చదువుకోవాలనే కోరిక మనసులో బలంగా ఉంటే పేదరికం ఆటంకం కాదనే నిరూపించాడు కమల్‌. ప్రతికూల పరిస్థితులను అధిగమించి లక్ష్యాన్ని చేరుకుని విజయం సాధించిన కిశోర్‌ మండల్‌ సమాజానికి ఓ ప్రేరణ.. చదువుకోవాలనే అతడి సంకల్పానికి సెల్యూట్‌ చేస్తున్నా ’’ అని నెట్‌ కోసం కిశోర్‌కు ఉచిత శిక్షణ ఇచ్చిన ప్రొఫెసర్‌ సంజయ్‌ కుమార్‌ జైస్వాల్‌ అంటారు.

Published date : 20 Dec 2022 03:46PM

Photo Stories