Skip to main content

France Superstar Mbappe Career and Achievements: 19 ఏళ్ల‌కే ఫిఫా ఎంట్రీ... ఎంబాపె గురించి మీకు ఈ విషయాలు తెలుసా

మరో పది రోజుల్లో 2022 ముగియనుంది. ఈ ఏడాదిలో ఎన్నో ప్రాముఖ్యమైన ఘట్టాలు, సంఘటనలు, విషాదాలు చోటుచేసుకున్నాయి. అయితే ఏడాది చివర్లో వచ్చిన ఫిఫా ప్రపంచాన్ని ఫుట్‌బాల్‌ వైపు తిరిగేలా చేసింది.
Mbappe

మొత్తం ఈ ప్రపంచకప్‌లో మెస్సీ, రొనాల్డో, నెయ్‌మర్‌ గురించే అందరూ మాట్లాడారు. కానీ, ఓ 23 ఏళ్ల ఆటగాడు తన సూపర్‌ ఫర్మామెన్స్‌తో గోల్డెన్‌ బూట్‌ సంపాదించాడు అతడే ఫ్రాన్స్‌ సూపర్‌ స్టార్‌ కైలియన్‌ ఎంబాపె. అతడి జీవిత విశేషాలు మీ కోసం...
అర్జెంటీనాకు ముచ్చెటమలు...
డిసెంబర్‌ 18(ఆదివారం) జరిగిన ఫిఫా వరల్డ్‌కప్‌ ఫైనల్లో అర్జెంటీనాకు ముచ్చెమటలు పట్టించాడు ఫ్రాన్స్‌ సూపర్‌స్టార్‌ కైలియన్‌  ఎంబాపె. మరో 10 నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా రంగంలోకి దిగిన ఎంబాపె మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేశాడు. కేవలం 97 సెకన్ల వ్యవధిలో రెండు గోల్స్‌ కొట్టి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. అదనపు సమయంలోనూ జట్టు వెనుకబడ్డ దశలో మరో పెనాల్టీ గోల్‌తో మ్యాచ్‌ను షూటౌట్‌కు తీసుకెళ్లాడు. షూటౌట్‌లోనూ గోల్‌ గొట్టి అదరహో అనిపించాడు.   

చ‌ద‌వండి:హార్మోన్‌ లోపంతో ఇబ్బంది... ఇప్పుడు ప్రపంచకప్‌ విన్నర్‌... మెస్సీ జీవిత విశేషాలు
19 ఏళ్లకే ఫిఫా ఎంట్రీ...
నాలుగేళ్ల క్రితమే ఫ్రాన్స్‌ ఫిఫా వరల్డ్‌కప్‌ గెలవడంలో ఎంబాపెది కీలకపాత్ర. 19 ఏళ్ల వయస్సులోనే ఫిఫా టైటిల్‌ను కొల్లగొట్టిన అతను.. ఈసారి కూడా అదే ఆటతీరుతో అదరగొట్టాడు. ముఖ్యంగా అర్జెంటీనాతో ఫైనల్లో ఎంబాపె ఆటతీరుకు ముచ్చటపడని వారుండరు. పట్టుమని పాతికేళ్లు కూడా లేని 23 ఏళ్ల కుర్రాడు ఫుట్‌బాల్‌లో సంచలన ప్రదర్శన చేస్తూ ఇక వచ్చే శకం తనదేనని ప్రపంచానికి సగర్వంగా చాటాడు.  

Mbappe


పేదరికమే పాఠాలు నేర్పింది...
ఎంబాపె తల్లిదండ్రులిద్దరు క్రీడాకారులే. కామెరూన్‌ నుంచి శరణార్థిగా పారిస్‌ శివారులోని బాండీకి వచ్చిన ఎంబాపె తండ్రి విల్‌ఫ్రెడ్‌ ఫుట్‌బాల్‌ ఆడేవాడు. ఆ తర్వాత కోచ్‌గా మారాడు. అల్జీరియాకు చెందిన అతని భార్య ఫైజా హ్యాండ్‌బాల్‌ క్రీడాకారిణిగా రాణించింది. ఎంబాపె తన చిన్నతనం నుంచే తన ఇద్దరు సోదరులతో కలిసి ఫుట్‌బాల్‌ ఆడేవాడు. 1998లో ఫ్రాన్స్‌ తొలిసారి ఫుట్‌బాల్‌ వరల్డ్‌కప్‌ అందుకున్నప్పుడు పుట్టాడు కైలియన్‌  ఎంబాపె. అయితే ఎంబాపె పుట్టడమే గోల్డెన్‌ స్పూన్‌ తో పుట్టలేదు. ఇరుకు గదుల్లో ఉంటూ.. కడు పేదరికంలో పెరిగిన ఎంబాపె చిన్నప్పటి నుంచే ఫుట్‌బాల్‌పై ఇష్టాన్ని పెంచుకున్నాడు.

చ‌ద‌వండి: అమిత్‌ లోధా... ఖాఖీ వెబ్‌సిరీస్‌లోని ఈ ‘ఖాఖీ’ గురించి తెలుసా....
తండ్రే మొదటి గురువు...
ఎంబాపెకు ఫుట్‌బాల్‌ ఆటలో ఓనమాలు నేర్పిన మొదటి గురువు  అతని తండ్రే. ఆ తర్వాత ఎంబాపెను తాను పనిచేసే ఏఎస్‌ బాండీ క్లబ్‌లో జాయిన్‌  చేశాడు. అలా ఫుట్‌బాల్‌ ఆటలో పట్టు సాధించిన ఎంబాపె రెండేళ్ల పాటు మొనాకోకు ఆడాడు. 2017 ఎంబాపె కెరీర్‌లో టర్నింగ్‌ పాయింట్‌గా నిలిచింది. పారిస్‌ సెయింట్‌ జెర్మైన్‌ తో(పీఎస్‌జీ) ఎంబాపెకు ఒప్పందం కుదిరింది. ఇక్కడే మెస్సీ, నెయమర్‌ లాంటి స్టార్‌ ఆటగాళ్లతో ఆడే అవకాశం వచ్చింది. ఆ తర్వాత స్పెయిన్‌  దిగ్గజ క్లబ్‌ రియల్‌ మాడ్రిడ్‌ నుంచి ఎంబాపెకు పిలుపొచ్చినా .. పీఎస్‌జీకి కొనసాగడంలో ఆ దేశ అధ్యక్షుడు ఎమాన్యుయెల్‌ మక్రాన్‌  ముఖ్య పాత్ర పోషించాడు. దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు.. ఎంబాపెకు ఎంత ప్రాముఖ్యత ఉందనేది.
కప్‌ గెలవడంలో కీలకపాత్ర...
2018 ఫిఫా వరల్డ్‌కప్‌ రానే వచ్చింది. అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఫైనల్‌ చేరిన ఫ్రాన్స్‌ విశ్వవిజేతగా అవతరించింది. 19 ఏళ్ల వయసులోనే ఫిఫా వరల్డ్‌కప్‌ టైటిల్‌ సాధించిన ఎంబాపె ఆ ప్రపంచకప్‌లో నాలుగు గోల్స్‌ కొట్టాడు. అయితే ఈసారి ఫిఫా వరల్డ్‌కప్‌లో అన్నీ తానై నడిపించిన ఎంబాపె ఏకంగా ఎనిమిది గోల్స్‌ కొట్టి గోల్డెన్‌ బూట్‌ ఎగురేసుకుపోయాడు. 23 ఏళ్ల వయసులోనే ప్రత్యర్థి జట్లను అల్లాడిస్తూ ఫుట్‌బాల్‌ను శాసిస్తున్న ఎంబాపె ఇదే ఆటతీరు ప్రదర్శిస్తే భవిష్యత్తులో దిగ్గజ ఆటగాడిగా పేరు పొందడం ఖాయం.

Published date : 20 Dec 2022 01:45PM

Photo Stories