Skip to main content

IPS Amit Lodha Success Story: అమిత్‌ లోధా... ఖాఖీ వెబ్‌సిరీస్‌లోని ఈ ‘ఖాఖీ’ గురించి తెలుసా....

యాక్టర్‌ అవ్వాలనుకుని డాక్టర్‌ని అయ్యా. పాత సినిమాల్లో ఈ డైలాగ్‌ చాలా ఫేమస్‌. కానీ, చాలా మంది తాము ఒకటి కావాలి అని అనుకుంటూ ఉంటారు. అనుకోని కారణాలతో ఇంకో మార్గంలోకి వెళుతుంటారు. అలా వెళ్లిన వాళ్లలో ఐపీఎస్‌ అమిత్‌ లోధా ఒకరు.

మంచి ఆఫీసర్‌గా పేరు ప్రఖ్యాత్యలు గడిద్దామనుకుంటే అది కుదరకపోవడంతో.. ఒకానొక సమయంలో ఐపీఎస్‌ను వదిలేసి ప్రైవేట్‌ జాబ్‌ వైపు వెళ్లాలనుకున్నారు. అలా వెళ్లి ఉంటే ఈ రోజు ఆయన గురించి దేశమంతా తెలిసేది కాదేమో. ఆయ‌న స‌ర్వీస్‌లో ఎదుర్కొన్న ఘ‌ట్టాల‌తో ఖాఖీ అనే వెబ్ సిరీస్ తెర‌కెక్కింది. నెట్‌ఫిక్స్‌లో విడుద‌లైన ఈ సిరీస్‌తో అమిత్ లోధా పేరు దేశ‌వ్యాప్తంగా మార్మోగుతోంది. ఆటుపోట్లు ఎదుర్కొంటూ ఆయన సాధించిన విజయాలు ప్రతీ ఒక్కరికి స్ఫూర్తిగా నిలుస్తాయనడంలో ఎలాంటి సందేహం ఉండదు. లోధా సక్సెస్‌ స్టోరీ మీ కోసం... 
జాబ్‌ రాక... సివిల్స్‌ రాశా
మాది రాజస్థాన్‌ లోని జైపూర్‌. అమ్మానాన్నలిద్దరూ ఉపాధ్యాయులు. చిన్నప్పటి నుంచీ నాకు మ్యాథ్స్‌ అంటే అభిరుచి. మ్యాథ్స్‌ చాలా ఇష్టంగా చేసేవాణ్ని. దీంతో ఇంటర్‌ పూర్తయ్యాక ఐఐటీ ఢిల్లీలో చేరా. కానీ, నాకు అక్కడి చదువు అబ్బలేదు. అన్ని సెమిస్టర్స్‌లో ‘డి’ గ్రేడ్‌కే పరిమితమయ్యా. క్యాంపస్‌ ఇంటర్వ్యూలలో నన్ను ఏ కంపెనీ తీసుకోలేదు. బంధువులందరూ ‘జాబ్‌ ఎక్కడ? ఎంత ప్యాకేజీ?’ అని అడుగుతుంటే సిగ్గుగా అనిపించేది. వాళ్ల ప్రశ్నల నుంచి తప్పించుకునేందుకు సివిల్స్‌ రాస్తున్నానని  అబద్ధం చెప్పా. ఊరికే అబద్ధం ఎందుకు చెప్పడమని... ప్రిలిమ్స్‌కి ప్రిపేర్‌ కావడం ప్రారంభించా. రెండో ప్రయత్నంలోనే ఐపీఎస్‌ సాధించా. శిక్షణ తర్వాత 2001లో బిహార్‌ కేడర్‌ ఇచ్చారు. 2001లో కిడ్నాప్‌లకు అడ్డాగా ఉన్న పాట్నాలో ఓ బ్యాంకు మేనేజర్, ఇంకో వీఐపీ దంపతుల 11 ఏళ్ల చిన్నారిని దుండగులు అపహరిస్తే వారిని సురక్షితంగా కాపాడటంతో మంచి పేరొచ్చింది. చిన్న వయసులోనే నలందా, మీర్జాపూర్‌లాంటి పెద్ద జిల్లాలకి ఎస్పీగా వెళ్లగలిగా. IPS Amith Lodha
మూడు నెలలు జీతం కూడా కట్‌...
విధి నిర్వహణలో గెలుపోటములు సహజమే. కానీ, ఓ రికమెండేషన్‌ పనిని చేయనందుకు ఓ ఉన్నతాధికారి ఎస్పీగా తొలగించి... బీహార్‌లోని చిన్న బెటాలియన్‌ కి కమాండెంట్‌గా నియమించారు. మూడు నెలలపాటు జీతాన్నీ ఆపేశారు. ఆ సమయంలో ఇక ఐపీఎస్‌ హోదాకన్నా ప్రయివేటు ఉద్యోగాలు నయం అనుకున్నా. అటువైపు వెళ్దామనుకుంటూ ఉండగా... నన్ను షేక్‌పూర్‌కి ఎస్పీగా వేశారు.  

చ‌ద‌వండి: కథ బాగుంది.... నువ్వయితే సినిమానే వద్దు
ఒకేరోజు 24 మంది హత్య...!
షేక్‌పూర్‌లోని మీనాపూర్‌లో గ్యాంగ్‌స్టర్‌ అశోక్‌ మహతో ఒకే రోజు 24 మందిని హత్య చేశాడు. ఓ వ్యక్తి తన గురించి పోలీసులకు సమాచారం ఇస్తున్నాడన్న కారణంగా అతనితో పాటు గ్రామంలో కనిపించిన ప్రతీ ఒక్కరిపై కాల్పులు జరిపిందీ ఆ ముఠా. ఆ రాత్రి ఆ గ్రామస్తులకు కాళరాత్రిగా మిగిలింది. దీంతో అప్పటి సీఎం నితీష్‌ ఎస్పీతో పాటు కలెక్టర్‌ను సస్పెండ్‌ చేశారు. అలా సస్పెండ్‌ అయిన ఎస్పీ స్థానంలోకి నేను వెళ్లా.
సాయం చేసిన వ్యక్తినీ చంపేశాడు...
అశోక్‌ది షేక్‌పురాలోని ఓ కుగ్రామం. చిన్ననాటి నుంచే హింసాత్మకంగా వ్యవహరించేవాడు. ఓసారి గ్రామానికి చెందిన భూస్వామి స్థలాన్ని కబ్జా చేయబోతే అతను సర్వేశ్వర్‌ అనే దాదా చేత కొట్టించాడు. దీంతో సర్వేశ్వర్‌కి శత్రువైన పంకజ్‌సింగ్‌ గ్యాంగ్‌తో అశోక్‌ చేతులు కలిపాడు. వాళ్ల సాయంతో సర్వేశ్వర్‌ని చంపాడు. ఆ తర్వాత తనకి సాయం చేసిన పంకజ్‌సింగ్‌నీ చంపేశాడు. అక్రమ మైనింగ్‌లూ, ఇసుక తరలింపులపైన పట్టు సాధించాడు. ‘బిహార్‌ వీరప్పన్‌గా పేరు తెచ్చుకున్నాడు. పోలీసుల లెక్కప్రకారమే అతను చంపినవాళ్ల సంఖ్య 70కి పైనే.

చ‌ద‌వండి: రిక్షావాలా కూతురు .... మిస్‌ ఇండియా రన్నరప్‌
పోలీస్‌శాఖలోనే ఇన్‌ఫార్మర్లు...
అశోక్‌ని పట్టుకోవడానికి ఏ పోలీసైనా బయల్దేరిన మరుక్షణమే... అతనికి తెలిసిపోతోంది. అతనికి పోలీసుల్లోనే కొంత మంది అధికారులు.. స్థానిక రాజకీయ నాయకులు సమాచారం ఇచ్చేశాళ్లు. దీంతో అతన్ని పట్టుకోవడానికి అప్పుడప్పుడే కొత్తగా పరిచయమైన ‘మొబైల్‌ ట్యాపింగ్‌’ని ఎంచుకున్నా. అశోక్‌ మహతో, అతని అనుచరుడు పింటూ మహతోలతోపాటు మరో ఐదుగురి సెల్‌ఫోన్‌ సంభాషణలు వినడం మొదలుపెట్టా. అలా వారం రోజుల తర్వాత పింటూ మహతోని అరెస్ట్‌ చేశాం. అశోక్‌కి అది పెద్ద షాక్‌. ఆ తర్వాత అశోక్‌కి తాము ఫోన్‌ ట్యాపింగ్‌ చేస్తున్నట్లు అర్థమవడంతో నెంబర్‌ మార్చేశాడు. దీంతో ఇన్వెస్టిగేషన్‌ నెమ్మదించింది. వారం తర్వాత అశోక్‌ కొత్త నంబర్‌ ట్రేస్‌ చేయగలిగాం. ఎంతో చాకచక్యంగా అతన్ని ముగ్గులోకి లాగి అరెస్టు చేశాం. నా సేవలకు 2008లో రాష్ట్రపతి నుంచి ప్రతిష్ఠాత్మక గ్యాలెంట్రీ అవార్డు అందుకున్నాను.

Published date : 19 Dec 2022 04:01PM

Photo Stories