Inspirational Success Story: వైకల్యాన్ని అధిగమించి... ఐఆర్‌ఎస్‌గా ఎంపికై...
ఇరుగు, పొరుగు వారు తోటి విద్యార్థులు ఎంత హేళన చేసినా, అన్ని దిగమింగి తన సక్సెస్‌ను లక్షలాదిమందికి వెలుగెత్తి చూపింది. ఆమె సారికా జైన్. ఆమె సక్సెస్ ఆమె మాటల్లోనే...
స్కూల్లో చేర్పించుకోలేదు....
ఒడిశాకు చెందిన సారికా జైన్ తల్లిదండ్రులకు నలుగురు అమ్మాయిలు, ఒక అబ్బాయి. కిరాణా కొట్టే జీవనాధారం. ఇలాంటి కుటుంబంలో పుట్టింది సారికా. పోలియోతో చిన్నపుడే ఓ కాలు చచ్చుబడిపోయింది. వేరొకరి సాయం లేకుండా నడవలేదు. ఈ పరిస్థితుల్లోంచి వచ్చిన అమ్మాయి సివిల్స్ సాధిస్తుందని ఎవరైనా ఊహిస్తారా? తను అవిటిదని నిర్లక్ష్యం చేయలేదు కన్నవాళ్లు. ఐదేళ్లపుడు బడిలో చేర్పించే ప్రయత్నం చేశారు. ‘ మీ అమ్మాయికి పోలియో. మేం చేర్చుకోం ’ అన్నారు స్థానిక స్కూళ్ల నిర్వాహకులు. ఎన్నో పాఠశాలల చుట్టూ తిరిగాక ప్రవేశం దొరికింది. కొంచెం పెద్దయ్యాక కర్ర ఊతంగా నడవడం మొదలుపెట్టింది. ఎలాగో తన కాళ్లపై తాను నిలబడినా సమాజం నుంచి చిన్నచూపు మాత్రం తప్పలేదు.
డాక్టరు కావాలనుకుని ఐఆర్‌ఎస్‌గా...
సారిక కలెక్టరు కావాలని ఎప్పుడూ కలలు కనలేదు. లక్షలు పెట్టి కోచింగ్ తీసుకునే పరిస్థితి ఎలాగూ లేదు. కష్టపడి చదివి డాక్టరు కావాలనుకుంది. ఆ పట్టుదలతోనే ప్రతి క్లాసులో టాపర్‌గా నిలిచేది. పది దాకా సొంతూరు కంతభంజీలోనే చదువుకుంది. ఇంటర్ చదవాలంటే కాలేజీ మారాలి. చాలాదూరం వెళ్లాలి. చేసేదేం లేక తన ఇష్టానికి వ్యతిరేకంగా కామర్స్‌లో చేరింది. బీకామ్‌లో టాపర్‌గా నిలిచింది. సీఏ చేస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని పక్క రాష్ట్రంలోని రాయ్‌పూర్ చేరింది. ఒంటికాలితో కిలోమీటర్ల దూరంలో ఉన్న కాలేజీకి వెళ్లొచ్చేది. టీచర్ల అండదండలతో సీఏలో గోల్డ్ మెడల్ సాధించింది. రూ.లక్షల్లో వేతనం ఇస్తామంటూ కార్పొరేట్ కంపెనీలు వెంటపడ్డాయి. నీలో కష్టపడేతత్వం ఉంది. నువ్వెందుకు సివిల్స్ ప్రయత్నించకూడదు అన్న అధ్యాపకుల మాటలను సీరియస్‌గా తీసుకున్న సారిక తన దృష్టిని సివిల్స్ వైపు మళ్లించారు.
ఇంటర్న్‌షిప్ డబ్బులతో కోచింగ్...
ఇంటర్న్‌షిప్‌లో కూడబెట్టిన డబ్బుతో ఆర్నెళ్లు కోచింగ్ తీసుకుంది. రోజుకు పన్నెండు గంటలు చదివింది. ఆమె శ్రమ, పట్టుదల ఫలించాయి. 2013 సివిల్స్ ఫలితాల్లో 527 ర్యాంకు సాధించింది. తన జర్నీ గురించి మాట్లాడుతూ... వైకల్యాన్ని చూసి ఎప్పుడూ కుంగిపోలేదు. నా ప్రతిభ చూసుకొని మురిసిపోయేదాన్ని. దానికి కష్టం తోడైతే ఎలాంటి విజయాన్నైనా అందుకోగలననే నమ్మకం ఉండేది. అదే చేసి చూపించా’ అని గర్వంగా చెబుతున్నారు సారికా జైన్. ప్రస్తుతం ఐఆర్‌ఎస్ అధికారిగా ఉంటూ.. మోటివేషనల్ స్పీకర్‌గా లక్షలాదిమంది యువతలో స్ఫూర్తినింపుతున్నారు.