Success Story: వరుసగా మూడు సార్లు ఫెయిల్.... ఈ విజయం మా అమ్మదే
పదిమందిలో ఒకరిలా కాకుండా తన వెనక పది మంది ఉన్నప్పుడే గుర్తింపు, గౌరవం లభిస్తుందనుకున్నాడు. అదే లక్ష్యంతో జాబ్‌కు రిజైన్ చేసి, సివిల్స్ వైపు అడుగులేశారు. ఎడ్మ రిషాంత్ రెడ్డి. తన సక్సెస్ అంతా తన అమ్మకే దక్కుతుందని చెబుతున్నారు. ఆయన విజయగాథ మీకోసం...
వ్యవసాయాధారిత కుటుంబం...
రిషాంత్ తల్లి పేరు పద్మావతి. నల్గొండ జిల్లా జంగారెడ్డిగూడెం దగ్గరలోని పిళ్లాయిపల్లి స్వస్థలం. బాగా చదువుకుని జీవితంలో ఏదో సాధించాలన్నది ఆమె కల. అయితే చిన్న వయసులోనే ఆమెకు పెళ్లి చేశారు. అయితేనేం తన పిల్లలు ఉన్నత స్థితికి రావాలన్నది ఆమె తపన. ఆ తపనే ఇవాల తన కుమారుడిని ఐపీఎస్‌ను చేసింది. నేనున్నానంటూ ఆ అమ్మ ఇచ్చిన భరోసాయే అతడిని విజేతగా నిలిపింది.
చదువుల కోసం హైదరాబాద్‌కు...
మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తిలో ఓ వ్యవసాయ కుటుంబంలో రిషాంత్ పుట్టారు. తల్లి పద్మావతి, తండ్రి గోపాల్‌రెడ్డి. పెద్ద చదువులు చదవాలి, ఉన్నతంగా ఉండాలన్న లక్ష్యంతో పిల్లలను హైదరాబాద్‌లో చదివించారు. వీరి కోసం చైతన్యపురిలో ఇల్లు అద్దెకు తీసుకున్నారు. ఇద్దరు అక్కలతో కలిసి రిషాంత్ ఉండేవారు. 9వ తరగతి నుంచే హైదరాబాద్‌లో ఆయన చదువు మొదలైంది. ఇంటర్ పూర్తి అయ్యాక ఐఐటీలో చేరాలని రిషాంత్ భావించారు. ఇందుకోసం రామయ్య ఐఐటీ సెంటర్లో శిక్షణ కోసం రాసిన ఎంట్రన్స్‌లో ఫెయిల్ అయ్యారు. మరో కోచింగ్ సెంటర్‌లో జాయినై ఐఐటీ ముంబైలో 2004లో సీటు సంపాదించారు.
చదువు పూర్తికాగానే ఉద్యోగం...
చదువు పూర్తి కాగానే 2008లో ఫ్యూచర్స్ ఫస్ట్ అనే కంపెనీలో చేరారు. కొన్నాళ్లు పని చేశాక ఫ్లాగ్‌స్టో¯Œ లో జాయిన్ అయ్యారు. నెల జీతం రూ. లక్షపైనే. అయినా మనసులో ఏదో ఓ వెలితి. జీవితం అన్నాక ఓ పర్పస్ ఉండాలి. గూగుల్‌లో వెతికితే పేరు కనపడాలి. గౌరవం పొందే ఉద్యోగం చేయాలి అని ఆయన భావించారు. ఇందుకు సివిల్స్ ఒక్కటే పరిష్కారం అని నిర్ణయించుకున్నారు. ఏం చదవాలో తెలియదు. పరిచయాలూ లేవు. మొదటి ప్రయత్నంలో మెయిన్స్‌లో ఫెయిల్ కావడంతో ఢిల్లీ వెళ్లి ప్రిపరేషన్ మొదలుపెట్టారు. రెండో ప్రయత్నంలో ఇంటర్వ్యూ దాకా వెళ్లినా ఫలితం దక్కలేదు. 2015లోనూ సేమ్ సీన్.
నాలుగోసారి 180వ ర్యాంకు...
వైఫల్యాలు సహజం అంటూ అమ్మ, నాన్న ఇచ్చిన భరోసాతో నాల్గవ ప్రయత్నం మొదలు పెట్టారు. వైఫల్యాలను బేరీజు వేసుకున్నారు. తప్పుల్ని పునరావృతం చేయకుండా మళ్లీ పరీక్ష రాశారు. 2016 మే 10న వచ్చిన సివిల్స్ ఫలితాల్లో 180వ ర్యాంకు సాధించారు. నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకుని, ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు ఎంపికయ్యారు. రిజల్ట్స్ వచ్చిన రోజు నాకు కలిగిన అనుభూతి ఎప్పటికీ మర్చిపోలేనని చెబుతారు రిషంత్. తాను కూర్చున్న సోఫాలోనే రిపోర్టర్లు ఇంటర్వ్యూ చేయడం మర్చిపోలేని అనుభూతి అని, అమ్మ నా నుదుట ముద్దు పెట్టుకున్న ఫోటోతో సాక్షి పేపర్లో ఫోటో వచ్చిందని గుర్తు చేసుకుంటుంటారు. తన విజయం తన అమ్మకే దక్కుతుందని గర్వంగా చెబుతారు.