Skip to main content

Civils Ranker Preethi beniwal Success Story: ప్ర‌మాదంలో కాళ్లు పోయాయి...భర్త వదిలేశాడు... కుంగిపోకుండా సివిల్స్‌ కొట్టారిలా

చిన్న చిన్న కారణాలతో ఆత్మహత్య చేసుకునే వారు ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయారు. ఏ చిన్న సమస్య వచ్చినా ఫేస్‌ చేయలేక ఆత్మనూన్యతాభావంతో భాదపడుతూ.. డిప్రెషన్‌తో సతమతమవుతున్నారు.
Preethi Beniwal

కానీ, ప్రమాదంలో తన రెండు కాళ్లు కోల్పోయినా... ఆ కారణంతో భర్త వదిలేసినా తన దృఢ  సంకల్పాన్ని వదిలిపెట్టలేదు. పట్టుదలతో ప్రయత్నించి సివిల్స్‌కు ఎంపికైన ప్రీతిబెనివాల్‌ సక్సెస్‌ స్టోరీ మనందరికి స్ఫూర్తిదాయకం. 
కుటుంబ నేపథ్యం ఇలా...
హర్యాణాలోని కర్నాల్‌ జిల్లా దూపేడి గ్రామానికి చెందిన సురేష్, బబిత దంపతులకు కుమార్తె, కుమారుడు. కుమార్తె ప్రీతి బెనివాల్, కుమారుడు పంకజ్‌ బెనివాల్‌.  ప్రీతి తండ్రి సురేష్‌ కుమార్‌ ప్రభుత్వ ఉద్యోగి.. తల్లి అంగన్‌ వాడీ టీచరు. ప్రీతి 2013లో ఎంటెక్‌  పూర్తి చేసి.. స్థానిక గ్రామీణ బ్యాంక్‌లో క్లరికల్‌  ఉద్యోగంలో జాయిన్‌ అయ్యింది. మూడేళ్లపాటు బహదూర్‌గఢ్‌లో ఉద్యోగిగా బాధ్యతలు నిర్వహించిన తర్వాత.. 2016లో ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో అసిస్టెంట్‌ జనరల్‌ ఉద్యోగం సాధించింది. దీంతో అదే ఏడాది ఫిబ్రవరిలో తల్లిదండ్రులు ప్రీతికి మట్లౌడా బ్లాక్‌లోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తితో పెళ్లి చేశారు.
డిపార్ట్‌మెంటల్‌ ఎగ్జామ్‌ కోసం వెళ్తూ...
2016 డిసెంబర్‌లో ఎఫ్‌సీఐ డిపార్ట్‌మెంటల్‌ ప్రమోషన్‌ కోసం నిర్వహిస్తున్న ఎగ్జామ్స్‌ కోసం గజియాబాద్‌కు  వెళ్తూ ట్రైన్‌ ఎక్కే సమయంలో ప్రీతి ప్రమాదానికి గురైంది. రైళ్లు ఎక్కేసమయంలో కాలు జారీ కిందపడిపోయింది. ప్రమాదంలో ప్రీతి తీవ్రంగా గాయపడింది. బతకడానికి ప్రీతి పోరాడితే.. ఆమెను బతికించడానికి వైద్యులు బైపాస్‌ సర్జరీ సహా మొత్తం 14 ఆపరేషన్లు  చేశారు. కాళ్లు చచ్చుబడిపోవడంతో బెడ్‌కే ప్రీతి పరిమితమైంది. దీంతో నడవలేని భార్య అనవసరమని భర్త భావిస్తే... కోడలు తమకు వద్దంటూ అత్తమామలు వదిలేశారు.
ఏడాదిపాటు బెడ్‌పైనే... 
ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రీతి ఏడాదిపాటు బెడ్‌కే పరిమితమవ్వాల్సి వచ్చింది. నడవలేని తనపై అందరూ జాలి చూపిస్తుంటే తట్టుకోలేకపోయింది. మరోవైపు భర్త వదిలేసి వెళ్లడంతో ఆ బాధ రెట్టింపైంది. కానీ, కన్న కూతురుని ఆ తల్లిదండ్రులు అక్కున చేర్చుకున్నారు. జీవితం ఇంతటితో ఆగిపోలేదని.. చదువుపై దృష్టిసారిస్తే బాధలన్నీ మర్చిపోవొచ్చని ధైర్యం చెప్పారు. దీంతో ఆమె దృష్టి సివిల్స్‌పై పడింది. 
మొదటి రెండు సార్లు ఫెయిల్‌....
మొదటి సారి సివిల్స్‌ రాస్తే ప్రిలిమ్స్‌ కూడా క్వాలిఫై కాలేకపోయింది. కానీ, ఎక్కడా కుంగిపోకుండా మళ్లీ రెండో సారి రాస్తే... ఈ సారి మెయిన్స్‌లో ఫెయిల్‌. దీంతో మరింత పట్టుదలతో చదివి మూడో ప్రయత్నంలో సివిల్స్‌ క్లియర్‌ చేసింది. 2020 సివిల్స్‌ పరీక్షల్లో 737 మార్కులు సాధించడంతో 754 ర్యాంకు వచ్చింది.  తాను ఈరోజు సివిల్స్‌లో ఉత్తీర్ణత సాధించడానికి కారణం తన తండ్రి సురేష్‌ కుమార్, తల్లి బబిత అని ఆమె గర్వంగా చెబుతుంది. ప్రీతి కథ ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమే.

Published date : 16 Dec 2022 03:06PM

Photo Stories