Love today Director Pradeep Inspirational Story: కథ బాగుంది.... నువ్వయితే సినిమానే వద్దు
అలా నిర్మించిన సినిమానే లవ్‌టుడే. ఏ మాత్రం అంచనాలు లేకుండా, విడుదలై సూపర్ సక్సెస్ సాధించి వంద కోట్ల వసూళ్లు సాధించింది. ఆ సినిమా డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ పడిన కష్టాలు, కన్నీళ్ల గురించి మీకు తెలుసా...
కుటుంబ నేపథ్యం ఇలా...
మా నాన్న తమిళనాడు దిండివనం పట్టణం దగ్గర్లోని ఓ మారుమూల పల్లెటూరి నుంచి వచ్చాడు. పదో తరగతి వరకు చదువుకుని చెన్నై హార్బర్‌లో రాళ్లు కొట్టే కూలీగా కుదిరాడు. పెళ్లి చేసుకున్న తర్వాత షార్ట్‌హ్యాండ్, టైపింగ్ నేర్చుకుని జిరాక్స్ షాపు పెట్టాడు. నాకు ఓ అన్నయ్య, అక్క. ఉన్నత చదువులు చదివించాలన్న లక్ష్యంతో మా తల్లిదండ్రులు ఇద్దరూ కష్టపడి తాము పస్తులుండీ మరీ మమ్మల్ని మంచి ప్రయివేటు స్కూల్లో చేర్పించారు. అన్నయ్య ఇంజినీరు కావాలనీ, అక్కయ్యని డాక్టర్‌ని చేయాలనీ, నన్ను కలెక్టర్‌గా చూడాలనీ నాన్న కలలుకన్నాడు. అమ్మానాన్నలు ఆశించినట్టే పదో తరగతి, ప్లస్ టూల్లో 98 శాతం మార్కులు సాధించా. చెన్నైలోని ప్రఖ్యాత ఎస్‌ఎస్‌ఎన్ ఇంజినీరింగ్ కాలేజీలో సీటొచ్చింది.
సివిల్స్‌తో స్టార్ట్ చేసి.. షార్ట్ ఫిల్మ్ వైపు....
విద్యార్థులు అన్ని రకాలుగా ఎదిగేందుకు ఎస్‌ఎస్‌ఎన్ కాలేజీ సహకారం అందించేది. నేను సివిల్స్ రాయాలని ఉందని చెప్పడంతో మంచి మెటీరియల్‌తోపాటు గైడెన్స్ అందజేయడం మొదలు పెట్టారు. అలా ప్రిలిమ్స్‌కి ప్రిపేర్ అవుతున్న సమయంలోనే అనుకోకుండా సినిమా వైపు అడుగులేయాల్సి వచ్చింది. కోలీవుడ్‌లో ఏ సినిమా కోసం కాలేజీ సీన్స్ తీయాలన్నా... దర్శకులు మా క్యాంపస్‌కే వస్తుండేవాళ్లు. అలా ఓ సినిమా షూటింగ్ చూశాక సినిమా ప్రపంచం నన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. తర్వాత ప్రిలిమ్స్‌ని గాలికొదిలేసి కాలేజీలోని షార్ట్‌ఫిల్మ్ క్లబ్‌లో చేరిపోయా.
చదవండి: రిక్షావాలా కూతురు .... మిస్ ఇండియా రన్నరప్
షార్ట్‌ఫిల్మ్‌కే రెండేళ్లు....
‘వాట్సాప్ కాదల్’ అన్న షార్ట్‌ఫిల్మ్ తీయడం ప్రారంభించా. దానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, కెమెరా, ఎడిటింగ్, హీరో అన్నీ నేనే కావడంతో రెండేళ్లకు పూర్తి చేశా. ఇంజనీరింగ్ చివరి సెమిస్టర్‌లో దానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఫస్ట్ ప్రైజ్ వచ్చినా... నాన్న మీద గౌరవంతో సినిమా వైపు వెళ్లకుండా ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో జాబ్ జాయినయ్యా. ఐటీ ఉద్యోగిగా... ఉదయమంతా పనిచేసి రాత్రి ఓ హాబీగా స్క్రిప్టు రాస్తుండేవాణ్ణి. ఏడాది తిరక్కుండానే ‘కోమాలి’ సినిమా స్క్రిప్టు సిద్ధమైంది. రెండేళ్లపాటు ఉద్యోగం చేసి, ఇంట్లో చెప్పకుండా జాబ్ వదిలేసి అనుకున్నట్టే రెండో ఏడాది ఉద్యోగానికి రాజీనామా చేశాను కానీ... ఆ విషయం మా ఇంట్లోవాళ్లెవరికీ చెప్పనేలేదు. ‘కోమాలి’ స్క్రిప్ట్‌ను తీసుకుని స్టూడియోల చుట్టూ తిరగడం ప్రారంభించా. ఐషరీ గణేశ్ అనే నిర్మాత పిలిచి మరీ అవకాశం ఇవ్వడంతో ‘జయం’ రవి హీరోగా సినిమా ప్రారంభమైంది. అప్పుడు కూడా ఉద్యోగానికి రాజీనామా చేశానని చెప్పే ధైర్యంలేక నాన్నతో ‘నాలుగు నెలలు సెలవు పెట్టాను’ అని చెప్పా.
చదవండి: ట్యాక్సీ డ్రైవర్‌గా మొదలుపెట్టి... ఇప్పుడు ప్రపంచమేటి దర్శకుడిగా ఎదిగిన...
చిత్రం పూర్తయ్యాక...
ఎన్నో కష్టాలు పడి సినిమా నిర్మాణం పూర్తి చేస్తే ఈ కథ తనదేనంటూ ఓ వ్యక్తి ప్రకటన చేశాడు. అది విన్న వెంటనే కళ్లనిండా నీళ్లు వచ్చేశాయి. ఫుల్‌గా ఏడ్చేశా. తొలిసినిమాకే కాపీ ముద్రపడితే... ఇంక కెరీర్‌కు అదే చివరి సినిమా అవుతుంది. పూర్తిగా సిద్ధమైన వెర్షన్‌ని చూపించాక అతను వెనక్కి తగ్గాడు. అలా 2017లో విడుదలైన కోమాలి పెద్ద హిట్టుగా నిలిచింది. అప్పుడు చెప్పాు మానాన్నకి... నేను కిందటి ఏడాదే ఉద్యోగానికి రాజీనామా చేశానని.
విజయ్ చాన్స్ వచ్చి మిస్....
కోమాలి మంచి హిట్ అవడంతో... తమిళ మెగాస్టార్ విజయ్ పిలిచి సినిమా చేద్దామన్నాడు. కథ సిద్ధమయ్యాక ‘బావుంది కానీ... ఇంకొంత కాలం ఆగుదాం’ అన్నాడు. దీంతో ఆరునెలల్లో కొత్త కథ రాసుకుని నా ప్రయత్నాలేవో చేశా. అప్పటికే రెండేళ్లు గడిచిపోయాయి. నాన్న ఎప్పట్లాగే ‘ఖాళీగా ఉండకుండా ఉద్యోగం చేయరా!’ అనడం ప్రారంభించాడు. మూడు నిమిషాల స్టోరీగా ‘‘అప్పాలాక్’’ చేశా. కానీ, దాన్నే రెండున్నర్ర గంటల సినిమాగా మార్చా. తమిళంలోని టాప్ నిర్మాణ సంస్థలకి కథ వినిపించడం ప్రారంభించా. అందరికీ కథ నచ్చేదికానీ ‘హీరో ఎవరు’ అన్నాకే వచ్చేది పేచీ! ‘మీరే హీరోగా చేస్తారని ముందు చెప్పి ఉంటే... ఫోన్ లోనే రిజెక్ట్ చేసి ఉండేవాళ్ళం’ అన్నారు దాదాపు అందరూ. ఆ కథకి నేనైతేనే సరిగ్గా సరిపోతానని బల్లగుద్ది చెప్పసాగా. నా వాదనకి ఏజీఎస్ నిర్మాణ సంస్థ మాత్రమే కన్విన్స్ అయింది.
ఐదు కోట్లతో తీస్తే.. వంద కోట్లు సాధించింది
ఎట్టకేలకు ఐదేళ్ల నిరీక్షణ ఫలించి... కేవలం ఐదుకోట్ల ఖర్చుతో ఆరు నెలల్లో సినిమా పూర్తిచేశా. తమిళంలో పెద్దగా అంచనాలు లేకుండానే రిలీజు చేశాం. మౌత్ టాక్‌తో సూపర్ హిట్ అయ్యింది. యువతని టార్గెట్ చేస్తే... కుటుంబసమేతంగా అందరూ వచ్చి చూడటం ప్రారంభించారు. మూడువారాల్లోనే మా సినిమా వందకోట్ల వసూళ్ల మైలురాయిని దాటేసింది. సూపర్‌స్టార్ రజినీకాంత్ స్వయంగా పిలిచి అభినందించారు. తెలుగులో లవ్‌టుడే పేరుతో డబ్ చేశాక... తమిళంలో కన్నా వేగంగా కలెక్షన్స్ నమోదయ్యాయి.