Skip to main content

James Cameron Success Story: ట్యాక్సీ డ్రైవర్‌గా మొదలుపెట్టి... ఇప్పుడు ప్రపంచమేటి దర్శకుడిగా ఎదిగిన...

ఎక్కడ చూసినా అవతార్‌ నామ జపమే నడుస్తోంది. ప్రపంచమంతటా అవతార్‌ మానియా నడుస్తోంది. ఎక్కడ విన్నా అవతార్‌ సినిమా దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌ పేరే వినిపిస్తోంది. కామెరూన్‌ జీవితం ఏమీ పూలబాటలా సాగలేదు. ఎన్నో ఆటుపోట్లున్నాయి.
James Cameron

ఒకానొక సమయంలో క్యాబ్‌ డ్రైవర్‌గా కూడా పని చేశారు. ఆయన సక్సెస్‌ మనకందరికి ఒక స్ఫూర్తిదాయకమే.
పుట్టింది కెనడాలో....
కామెరూన్‌ పుట్టింది కెనడాలోని ఓ మధ్యతరగతి కుటుంబంలో. తండ్రి ఇంజనీర్‌.. తల్లి సాధారణ గృహిణి. తనలాగే తన కొడుకుని ఇంజనీర్‌ చేయాలని ఆ తండ్రి అనుకున్నాడు.. కానీ కామెరూన్‌ చదువు అబ్బ లేదు. కానీ ఫిజిక్స్‌.. ల్యాబ్‌లలో ప్రయోగాలు నచ్చేవి. తల్లి చెప్పే కథలు వింటూ పెరిగాడు. తర్వాత సైన్స్‌ ఫిక్షన్‌ కథల మీద ఆసక్తి పెంచుకున్నాడు. ఇప్పుడు ప్రపంచం మొత్తం తన వైపు చూసేలా గొప్ప సినిమాలు తీశాడు. 
కాలేజీ మానేసి.. క్యాబ్‌ డ్రైవర్‌గా...Titanic
హైస్కూల్‌ పూర్తవగానే జేమ్స్‌ కామెరూన్‌ను అతని తండ్రి కాలేజీలో చేర్పించాడు. కానీ, చదువు, ఉద్యోగంపై ఆసక్తి లేకపోవడంతో కామెరూన్‌ మధ్యలోనే మానేశాడు. తల్లిదండ్రులకు భారం కాకుండా ఉండేందుకు టాక్సీ డ్రైవర్‌ గా అవతారం ఎత్తాడు. డ్రైవ్‌ చేస్తున్న సమయంలోనూ తనకు ఏదైన కొత్త ఆలోచనలు వస్తే ట్యాక్సీ ఆపి మరీ రాసుకునేవాడు. 
మలుపు తిప్పిన స్టార్‌ వార్స్‌....
1977 రిలీజైన ‘స్టార్‌ వార్స్‌’ సినిమాలు కామెరూన్‌ జీవితాన్ని మలుపు తిప్పాయి. వాటిని చూసిన ఆయన అలాంటి సినిమాలు తీయాలని నిర్ణయించుకున్నాడు. తన లక్ష్యం ఏమిటో స్పష్టత వచ్చింది. వెంటనే అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేయాలనుకున్నాడు. కానీ, రెండేళ్లపాటు కాళ్లరిగేలా తిరిగితే చివరకు ఒక ప్రొడక్షన్‌ సంస్థలో పనిచేసే అవకాశం వచ్చింది. పది రోజులు పని చేయగానే నిర్మాతలు  కామెరూన్‌ను తొలగించి మరొకరికి అవకాశం ఇచ్చారు. 
పట్టువదలకుండా...
తొలగించన తర్వాత కూడా కామెరూన్‌ అక్కడే ఉండేవాడు. ప్రొడక్షన్‌ అసిస్టెంట్‌గా చేరి సినిమా ఎలా తీస్తున్నారో గమనించేవాడు. తర్వాత అనుకోకుండా ఫిరానా 2కి అవకాశం దక్కడంతో కామెరూన్‌ జీవితం మరో మలుపుతిరిగింది. తర్వాత తనకు వచ్చిన ఓ కలని బేస్‌ చేసుకుని తీసిన ది టెర్మినేటర్‌ కామెరూన్‌ జీవితాన్ని మార్చింది. తర్వాత ఓ చానెల్‌ కోసం డాక్యుమెంటరీలు చేస్తున్న సమయంలోనే టైటానిక్‌ ఆలోచన వచ్చింది. టైటానిక్‌ షిప్‌ను చూసేందుకు డైవ్‌ కూడా చేసేవాడు. అలా ప్రపంచంలోనే అద్భుతంగా నిలిచిన టైటానిక్‌ సినిమా తీశారు. 
ఒక్కసారి ఫిక్స్‌ అయితే....

Avatar


అవతార్‌ సినిమా కథలను కామెరూన్‌ 1999 లోనే సిద్ధం చేసుకున్నాడు. డబ్బులు, సాంకేతిక పరిజ్ఞాన పరంగా ఇబ్బందులు తలెత్తడంతో విరామం తీసుకున్నాడు. చాలా ప్రొడక్షన్‌ హౌస్‌ లకు అవతార్‌ కథ నచ్చినప్పటికీ ఖర్చుకు వెనుకాడేవారు. దీంతో కామెరూన్‌ ఆస్తులు అమ్ముకుని, అప్పులు చేసి సొంతంగా నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి అవతార్‌ సినిమా తీశాడు. ప్రపంచానికి తాను ఏంటో నిరూపించుకున్నాడు. సినీ రంగంలోకి వచ్చాకా మొక్కల ఆధారిత మాంసం, చీజ్, డెయిరీ ఉత్పత్తులు తయారు చేయాలని ఒక స్టార్టప్‌ను మొదలు పెట్టాడు. కామెరూన్‌ ప్యూర్‌ వెజిటేరియన్‌.
పురాణ కథల స్ఫూర్తితో....
కామెరూన్‌కు హిందుత్వం అంటే అభిమానం. పురాణాల్లోని రాముడు, కృష్ణుడు, విష్ణుమూర్తి, శివుడి పాత్రలే ఆయన కథలకు స్ఫూర్తి. వాటి నుంచి ప్రేరణ పొందే అవతార్‌ సీరిస్‌లో సినిమాలు తీశాడు. ఆ విషయాన్ని అతడు బాహటంగానే చెప్పాడు. ఆయన ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని, పట్టుదలతో దృఢ సంకల్పం ఉండడంతోనే కామెరూన్‌ సక్సెస్‌ సాధించాడు. ట్యాక్సీ డ్రైవర్‌గా నిలిచిపోయుంటే ... ప్రపంచం మెచ్చే సినిమాలను మనమంతా మిస్‌ అయ్యే వాళ్లమనడంలో ఎలాంటి సందేహం లేదు.

Published date : 17 Dec 2022 03:59PM

Photo Stories