Skip to main content

Superstar Krishna : సూపర్‌ స్టార్‌ కృష్ణ ఇక‌లేరు.. ఈయ‌న‌ కెరీర్‌ను మలుపుతిప్పింది ఇక్క‌డే..

ప్రముఖ తెలుగు సినీ నటుడు, సూపర్‌స్టార్‌ కృష్ణ (79 కన్నుమూశారు. తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సీనియర్‌ నటుడు, స్టార్‌ హీరో మహేశ్‌ బాబు తండ్రి సూపర్‌ స్టార్‌ కృష్ణ (79) కన్నుమూశారు.

కొంతకాలంగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ న‌వంబ‌ర్ 15వ తేదీ (మంగళవారం) తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.ఆయన మృతితో టాలీవుడ్‌ సినీ పరిశ్రమలో ఒక్కసారిగా విషాదం నెలకొంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ సినీ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. 

సూపర్‌స్టార్‌ కృష్ణ కుటంబ నేప‌థ్యం :

superstar krishna family

కృష్ణ అసలు పేరు ఘట్టమనేని శివరామకృష్ణ మూర్తి. 1942 మే 31న గుంటూరు జిల్లా, తెనాలి మండలములోని బుర్రిపాలెంలో జన్మించాడు. 1965లో ఆయన ఇందిరను పెళ్లిచేసుకున్నారు. వారికి ఐదుగురు పిల్లలు. రమేశ్ బాబు, మహేష్ బాబు, పద్మావతి, ప్రియదర్శిని, మంజుల ఉన్నారు. వీరిలో రమేశ్ బాబు, భార్య ఇందిర ఇటీవల మరణించారు. మొదటి పెళ్లి తర్వాత సినీనటి విజయనిర్మలను కృష్ణ రెండో పెళ్లి చేసుకున్నారు. ఆమెకూడా ఈ మధ్యనే మృతి చెందారు. 

చిన్నప్పటి నుంచి ఆయనకు సినిమాలపై ఎంతో ఆసక్తి ఉండేది. అయితే ఆయన తల్లిదండ్రులు మాత్రం కృష్ణను ఇంజినీర్‌ చేయాలనుకున్నారు. సీటు దొరక్కపోవడంతో డిగ్రీలో చేరారు. అక్కడ చదువుతున్నప్పుడు ఏలూరులో ప్రఖ్యాత నటుడు అక్కినేని నాగేశ్వరరావుకు ఘనంగా సన్మానం జరిగింది. ఆ కార్యక్రమానికి హాజరైన కృష్ణకు సినిమాలపై ఇష్టం మరింత పెరిగి ఈ రంగంవైపు వచ్చేశారు.

ఆ సినిమా ఘన విజయంతో..

superstar krishna

కృష్ణ ఇక సినిమాలనే తన భవిష్యత్తుగా ఎంచుకున్నారు. నటులు జగ్గయ్య, గుమ్మడి, నిర్మాత చక్రపాణి తెనాలికి చెందినవారు కావడంతో మద్రాసు వెళ్లి వారిని కలిశారు కృష్ణ. వయసు తక్కువగా ఉందనీ, కొంతకాలం ఆగి మద్రాసు వస్తే సినిమాల్లో మంచి అవకాశాలు వస్తాయని వారు సలహా ఇవ్వడంతో తిరిగి వచ్చిన కృష్ణ, ప్రజానాట్య మండలిలో చేరి గరికపాటి రాజారావు సహకారంతో పలు నాటకాల్లో నటించి నటనపై అవగాహన పెంచుకున్నారు. 

1964లో ప్రముఖ దర్శక నిర్మాత ఆదుర్తి సుబ్బారావు తెరకెక్కించిన ‘తేనె మనసులు’ సినిమాతో కృష్ణ సినీప్రయాణం మొదలైంది. ఈ సినిమాలో కృష్ణ నటన బాగోలేదని, ఆయనను తొలగించాలని దర్శకుడిపై ఒత్తిడి వచ్చింది. అయినా ఆదుర్తి సుబ్బారావు తన నిర్ణయం మార్చుకోలేదు. 1965లో విడుదలైన ఆయన సినిమా ఘన విజయం సాధించింది.

ఆయన కెరీర్‌ను మలుపుతిప్పింది ఇక్క‌డే..

superstar krishna pics

రెండో సినిమా కన్నె మనసుల్లో నటిస్తుండగానే ‘గూఢచారి 116’లో కృష్ణకు అవకాశం వచ్చింది. ఈ సినిమా అఖండ విజయం సాధించి ఆయన కెరీర్‌ను మలుపుతిప్పింది. అంతేనా.. తెలుగు ప్రేక్షకులు ముద్దుగా ఆయనను ఆంద్రా జేమ్స్‌బాండ్‌గా పిలుచుకునేవారు. ఈ విజయంతో కృష్ణ ఏకంగా 20 సినిమాలకు హీరోగా ఎంపికయ్యారు. 

గూఢచారి 116తో ఆయన ఇమేజ్‌ అమాంతం పెరగడమే గాక.. ఆ తర్వాత రెండు దశాబ్దాల్లో ఆయన మరో 6 జేమ్స్‌బాండ్‌ తరహా చిత్రాలు చేశారు. అవన్నీ ఆయనకు విజయాన్ని తెచ్చిపెట్టాయి. బాపు తీసిన పూర్తి అవుట్ డోర్ చిత్రం ‘సాక్షి’ కృష్ణ ఇమేజిని పెంచింది. మానవత్వం మీద నమ్మకంగల పల్లెటూరి అమాయకుడి పాత్రలో నటించి మెప్పించిన చిత్రమిది. విజయనిర్మలతో నటించిన మొదటిచిత్రం కూడా ఇదే. 2016లో వచ్చిన ‘శ్రీ శ్రీ’ కృష్ణ నటించిన చివరి చిత్రం.

సినీ ప్ర‌స్థానం :

superstar krishna movies

➤ 1965లో కృష్ణ తొలిచిత్రం తేనె మనసులు విడుదల 
➤ తెలుగులో తొలి జేమ్స్ బాండ్, కౌబాయ్ హీరో కృష్ణ 
➤ హీరోగా 350 పైగా సినిమాల్లో నటించిన సూపర్ స్టార్ కృష్ణ
➤ సింహాసనం సినిమాతో మెగాఫోన్ 
➤ తెలుగు సినిమాలకు సాంకేతిక హంగులద్దిన కృష్ణ
➤ అల్లూరి సీతారామరాజుతో నటుడిగా ఎనలేని ఖ్యాతి
➤ హీరోగా,నిర్మాతగా,దర్శకుడిగా,ఎడిటర్‌గా టాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపు 
➤ పద్మాలయ స్టూడియో పతాకంపై ఉత్తమ చిత్రాల నిర్మాణం
➤ విజయనిర్మలతో దాదాపు 48 వరకు చిత్రాల్లో స్క్రీన్ షేర్

అవార్డులు..
సినీరంగంలో విశేష సేవలందించిన కృష్ణక ఎన్నో పురస్కారాలు వరించాయి.  ఫిల్మ్‌ఫేర్ సౌత్ జీవిత సాఫల్య పురస్కారం (1997), ఎన్టీఆర్ జాతీయ పురస్కారం (2003), ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ (2008), పద్మభూషణ్ పురస్కారం (2009) లభించాయి.

రాజ‌కీయాల్లోనూ..
మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ.. కృష్ణకు సన్నిహితులు. ఆ అభిమానంతోనే 1984లో కృష్ణ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. 1989లో హస్తం పార్టీ తరఫున ఏలూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 1991 ఎన్నికల్లో మరోసారి ఏలూరు నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత రాజీవ్‌ గాంధీ హత్యకు గురవడం.. ఏలూరులో ఓటమితో కృష్ణ ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

Published date : 15 Nov 2022 08:47AM

Photo Stories