Group 1 Ranker Success Story : ఇప్పటికిప్పుడే అనుకొని చదివితే ప్రభుత్వ ఉద్యోగం వస్తుందా..? అన్నారు.. కానీ నేను మాత్రం..
ఉద్యోగం నాకు రాదులే అని కాకుండా నాకే వస్తుంది అని మనపై మనకు నమ్మకం ఉండి.. కష్టపడితే ప్రభుత్వ ఉద్యోగం కల నెరవేరుతుందని నిరూపించారు గ్రూప్-1 రజనీకాంత్ రెడ్డి. ఆయన సక్సెస్ స్టోరీ మీకోసం..
కుటుంబ నేపథ్యం :
మాది మెదక్ జిల్లా రేగోడ్ మండలం దోసపల్లి. నాన్న రామకృష్ణారెడ్డి సన్నకారు రైతు. అమ్మ సరళమ్మ గృహిణి. మేం మొత్తం ముగ్గురు అన్నదమ్ములం. అందరిలో నేనే చిన్నవాడిని.
Also read: TSPSC : టీఎస్‌పీఎస్సీ 833 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
నా ఎడ్యుకేషన్ :
మా ఊరి ప్రాథమిక పాఠశాలలోనే 5వ తరగతి వరకు, 6 నుంచి 10వ తరగతి వరకు రేగోడ్ మండలం గజవాడ ఉన్నత పాఠశాలలో చదివాను. ఇంటర్మీడియట్ జహీరాబాద్, డిగ్రీ హైదరాబాద్‌లో పూర్తిచేశాను. ఉస్మానియా యూనివర్సిటీలో పీజీలో జర్నలిజం చేశాను.
నా గ్రూప్-1 ప్రిపరేషన్ ఇలా..
2011లో గ్రూప్-1 నోటిఫికేషన్ వచ్చింది.అప్పుడే ప్రిపరేషన్ ప్రారంభించాను. సమయం తక్కువ.. అయినా గ్రూప్స్ కొట్టాలనే కసితో చదివాను. 2011లో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రాశాను. 2012లో మొయిన్స్ రాసి, ఇంటర్వ్యూ పూర్తిచేశాను. కొంతమంది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అనివార్య కారణాలతో 2016లో మళ్లీ మెయిన్స్ నిర్వహించారు. అప్పటికే గ్రూప్-2 ఉద్యోగం చేస్తున్నాను. మళ్లీ ఒక్కసారి రివిజన్ చేసుకొని వెళ్లి పరీక్ష రాశా. స్టేట్ 5వ ర్యాంకు వచ్చింది.ఇంగ్లిష్‌లో పరీక్ష రాస్తే ఎక్కువ మార్కులొస్తాయని, తెలుగులో రాస్తే తక్కువ వస్తాయనే అపోహ అందరిలాగే నాలోనూ ఈ ఉండేది. కానీ త్వరగానే అందులో నుంచి బయటికి వచ్చి తెలుగులోనే రాయాలని నిర్ణయించుకొన్నాను. తెలుగులో పరీక్ష వద్దని కొంతమంది వారించారు. అయినా నాపై నాకున్న నమ్మకంతో తెలుగులోనే రాశాను. ఇంగ్లిష్ బాగా వచ్చిన నా స్నేహితుల్లో ఎవరికీ ఉద్యోగం రాలేదు. తెలుగులో రాసిన నాకు వచ్చింది.
Anwesha Reddy IAS Success Story : అమ్మ మాటను నిలబెట్టా.. అనుకున్నది సాధించి కలెక్టర్ అయ్యానిలా..
ఇవన్నీ ఉంటే గ్రూప్స్‌లో విజయం తథ్యం..
తపన, పట్టుదల, ప్రణాళిక, కసి, క్రమశిక్షణ.. ఇవన్నీ ఉంటే గ్రూప్స్‌లో విజయం తథ్యం. అదే తపన గ్రూప్స్ ర్యాంకర్‌ని చేసింది. సివిల్స్ లేదా గ్రూప్-1 స్థాయి పోస్టు కొట్టాలని ముందే నిర్ణయించుకొన్నాను. అందుకే అవకాశం ఉన్నప్పుడల్లా మన సంస్కృతి, సంప్రదాయాల గురించి తెలుకొనేవాడిని. తెలంగాణ చరిత్ర, ప్రభుత్వ పాలసీలు, అమలు.. వంటి వాటిపై ఎక్కువ శ్రద్ధ ఉండేది. జాతీయ, అంతర్జాతీయ రాజకీయాల గురించి మిత్రులతో సరదాగా చర్చిస్తూ ఉండేవాడిని. కనిపించిన ప్రతి పుస్తకాన్ని చదవడం నాకు చిన్నప్పటి నుంచే అలవాటు. ఇంటర్వ్యూలో ఇది నాకెంతగానో ఉపయోగపడింది.
అపోహల జోలికి..
గ్రూప్-1 నోటిఫికేషన్ వచ్చిన వెంటనే అందులో నాకొక జాబ్ ఉన్నదని మనసులో ముందే రాసి పెట్టేసుకొన్నాను. ఆ ఉద్యోగం వచ్చిందనే ఊహలోనే బతికేవాడిని. నన్ను నేను పూర్తిగా నమ్ముకొనే వాడిని. ఎవరెన్ని చెప్పినా లైట్‌గా తీసుకొనేవాడిని. అపోహల జోలికి అసలే వెళ్లేవాడిని కాదు. పుట్టిన ఊరి పేరు, కన్న తల్లిదండ్రుల ఆశలు నిజం చేయాలని ప్రతిక్షణం పరితపించేవాడిని.
అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నావ్ అంటూ..
మా ఇంట్లో ఒక్కరంటే ఒక్కరూ.. కనీసం చిన్నపాటి ప్రభుత్వ ఉద్యోగి కూడా లేరు. అందుకే ఆ లోటును నేను పూర్తిచేయాలని బలంగా అనుకొనేవాడిని. ‘చాలామంది ఏండ్ల తరబడి చదువుతున్నారు.. నువ్వు ఇప్పటికిప్పుడే అనుకొని చదివితే ప్రభుత్వ ఉద్యోగం వస్తుందా? అందులోనూ గ్రూప్-1 వంటి పెద్ద ఉద్యోగం, అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నావ్’ అంటూ ఎంతోమంది నిరుత్సాహపరిచారు. అయినా.. వెనకడుగు వేయలేదు. వారితో అనవసరపు వాదనలు పెట్టుకోలేదు. నేను సాధించే ఉద్యోగమే వాళ్లకు సమాధానం కావాలని బలంగా విశ్వసించాను.
IAS Lakshmisha Success Story: పేపర్‌బాయ్ టూ 'ఐఏఎస్'..సెలవుల్లో పొలం పనులే...
సరైన మెంటార్ లేకపోవడంతో..
సివిల్స్ తర్వాత అంత క్రేజ్ ఉన్నది గ్రూప్-1 ఉద్యోగానికే. జిల్లా స్థాయి అధికారిగా నియామకమయ్యే గొప్ప అవకాశం ఉన్న ఉద్యోగం. అందుకే.. గ్రూప్-1 కొట్టాలని లక్షలమంది ఆశిస్తూ ఉంటారు. కానీ పరిస్థితులు వాళ్లకు అనుకూలించవు. అన్నీ ఉన్నా సరైన మెంటార్ లేకపోవడంతో ఎంతో మంది గ్రూప్స్ కొట్టలేకపోతున్నారు.
ప్రస్తుతం నేను గ్రేడ్-1 మున్సిపల్ కమిషనర్‌గా ఉన్నానంటే..
నేను ప్రిపేరయ్యేటప్పుడు నాకో మంచి మెంటార్ ఉంటే బాగుంటుందని అనుకొనేవాడిని. ఆ అవకాశం లేక అనునిత్యం అప్పటి ఐఏఎస్ ఆఫీసర్ ముత్యాలరావు సార్‌ని ఫాలో అవుతూ ఉండేవాడిని. ఆయన జీవితం నిజంగా ఎందరికో ఆదర్శం. ప్రస్తుతం నేను గ్రేడ్-1 మున్సిపల్ కమిషనర్‌గా ఉన్నానంటే దానికి ఆయనా ఓ కారణమే. అందుకే.. నేను ఓ మెంటార్‌గా ఉండాలనుకొన్నా.
UPSC Civils Ranker : అమ్మ కలను నిజం చేశానిలా..| ఆ ఒక్క మార్క్ వల్లే పోయింది
ఇద్దరం కలిసి ఆన్‌లైన్‌లో..
అదే సమయంలో నా స్నేహితురాలు ప్రశాంతి ఇటువంటి ఓ ప్రతిపాదనతో ముందుకొచ్చారు. వెంటనే నా ఆలోచన చెప్పేశాను. ఇద్దరం కలిసి ఆన్‌లైన్‌లో కొంత మందికి ఉచితంగా కోచింగ్ ఇస్తున్నాం. నిత్యం వాళ్లకు టచ్‌లో ఉంటాను. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం, సెలవు దినాల్లో వాళ్ల అనుమానాలను నివృత్తి చేస్తూ ఉంటాను. వాళ్లతో ఎప్పటికప్పుడు స్ఫూర్తి నింపుతాను. వాళ్లకు ఆన్‌లైన్‌లోనే పరీక్షలు నిర్వహిస్తాం.
ఇలా చదివితే ఉద్యోగం ఖాయం..
గ్రూప్-1కు ప్రిపేరయ్యేవాళ్లు మీకు మీరే స్ఫూర్తిగా తీసుకోవాలి. కలలు కనండి.. అవి నిజం చేసుకోండి. టార్గెట్ పెట్టుకోండి.. అదే జీవితాశయమని అనుకోండి. ప్రత్యేకంగా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. అవకాశం ఉన్నన్ని సార్లు రివిజన్ చేసుకోండి. పది, ఇంటర్, డిగ్రీలో ఎన్ని మార్కులు వచ్చాయన్నది ముఖ్యం కాదు. చదువులో ఆఖరి వరుసలో ఉన్నా ఎంతోమంది సివిల్స్, గ్రూప్స్‌లో సక్సెస్ అయ్యారు.
అందుకే అటువంటి అపోహలను వీడండి. మీ బలమేంటి? బలహీనత ఏంటి? అనేది బేరీజు వేసుకోండి. అందుకు తగిన ప్రణాళిక రూపొందించుకోండి. అవకాశం ఉంటే కంబైన్డ్ స్టడీస్కు ఎక్కువ సమయం ఇవ్వండి. సాధించాలన్న తపన.. అందుకు తగిన కష్టం.. సరైన ప్రణాళిక ఉంటే.. గ్రూప్-1 నోటిఫికేషన్‌లో మీకొక ఉద్యోగం ఖాయం.
UPSC Civils Ranker Sridhar Interview : అసెంబ్లీ వద్ద ఆ ఘటన చూసే.. సివిల్స్ వైపు వచ్చా..