Supreme Court: డీఈడీ అభ్యర్థులకే ఎస్జీటీ పోస్టులు
ఒకటి నుంచి 5వ తరగతి వరకు బోధించే ఎస్జీటీ పోస్టులకు డీఈడీతో పాటు బీఈడీ పూర్తి చేసిన వారికి ఎన్‌సీటీఈ గతంలో అవకాశం కల్పించింది. అయితే ఎన్‌సీటీఈ ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్‌ను రాజస్తాన్ హైకోర్టు కొట్టివేసింది. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం ఆగస్టు 11న తుది తీర్పు ప్రకటించింది.
ఎలిమెంటరీ టీచర్ పోస్టులకు కేవలం డీఎడ్ శిక్షణ పూర్తి చేసిన వారు మాత్రమే అర్హులని స్పష్టం చేసింది. నూతన విద్యావిధానం ప్రకారం ప్రాథమిక స్థాయిలోని పిల్లలకు విద్యాబోధన చేయాలంటే ప్రత్యేక మెళకువలు అవసరమని పేర్కొంది. డీఎడ్ శిక్షణ పొందిన వారే ఆ విధంగా బోధన చేయగలుగుతారని న్యాయస్థానం స్పష్టం చేసింది.
చదవండి: DSC Notification 2023: 6,612 పోస్టుల భర్తీ.. భర్తీ చేసే పోస్టులు ఇవీ..
సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పును ఎన్‌సీటీఈ తాజాగా తన వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. దానికి అనుగుణంగా నోటిఫికేషన్లలో నిబంధనలు చేర్చేలా రాష్ట్రాలకు దిశానిర్దేశం చేసింది. ఇప్పటికే కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయ సంస్థలు వేలాది ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చాయి. వీటిలో కొన్ని నియామక ప్రక్రియలు దాదాపు చివరి దశకు వచ్చాయి. అలాగే కొన్ని రాష్ట్రాల్లో టీచర్ పోస్టుల నియామకాలకు నోటిఫికేషన్లు జారీ అయ్యాయి.