Good News for Group 1 Aspirants: గ్రూప్–1 నియామకాలకు లైన్ క్లియర్.. ఫలితాలు ఏప్పుడంటే!

563 పోస్టుల భర్తీకి సంబంధించి గత ఏడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ జారీ చేసిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్.. ప్రిలిమినరీ పరీక్షలు, మెయిన్ పరీక్షలను సైతం వేగంగానే నిర్వహించిన విషయం తెలిసిందే. కానీ మెయిన్స్ పరీక్షల కోసం అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన జీఓ 29పై, వికలాంగులకు వర్టికల్ పద్ధతిలో రిజర్వేషన్లు అమలు చేయాలనే అంశంపై వేర్వేరుగా కేసులు నమోదయ్యాయి.
ఈ రెండు కేసులకు సంబంధించి సుదీర్ఘ వాదన లు విన్న సుప్రీంకోర్టు.. తాజాగా వాటిని డిస్మిస్ చేసింది. దీంతో గ్రూప్–1 ఉద్యోగ నియామకాలకు సంబంధించిన అడ్డంకులన్నీ తొలగిపోయి.. తుది ఫలితాల ప్రకటనకు మార్గం సుగమమైంది. ఇప్పటికే మెయిన్స్ పరీక్షలకు సంబంధించి జవాబు పత్రాల మూల్యాంకనం దాదాపు కొలిక్కి వచ్చినట్టు టీజీపీఎస్సీ వర్గాలు తెలిపాయి. సుప్రీంకోర్టులో కేసుల నేపథ్యంలో వేచి ఉన్నామని, త్వరలోనే ఫలితాలు వెల్లడిస్తామని వెల్లడించాయి.
ఏడాదిగా అనుకూల తీర్పులే.. :
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గత ఏడాది కాలంలో దాదాపు 25 కేటగిరీల్లో 13 వేలకు పైబడి ఉద్యోగాలను భర్తీ చేసింది. దీనిపై కోర్టుల్లో వందల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. ఈ న్యాయపరమైన చిక్కులను అధిగమించేందుకు టీజీపీఎస్సీ ప్రత్యేకంగా లీగల్ టీమ్‌ను ఏర్పాటు చేసింది. పరీక్షలు, ఫలితాలు, కీ, మెరిట్ జాబితాలు తదితర అంశాలను న్యాయబద్ధంగా పూర్తి చేస్తూ ఉద్యోగాల భర్తీని కొనసాగించింది. దీంతో పెద్దసంఖ్యలో కేసులు నమోదైనా.. పక్కాగా వ్యవహరించడంతో అనుకూల తీర్పులు వచ్చాయని టీజీపీఎస్సీ వర్గాలు చెబుతున్నాయి.
పరీక్షలయ్యాక జోక్యం చేసుకోలేం: సుప్రీంకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో గ్రూప్–1 పరీక్షలు ఇప్పటికే పూర్తయి, ఫలితాల ప్రకటనకు సిద్ధమైన నేపథ్యంలో.. ఈ అంశంలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ పరీక్షలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్–29ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్లను సోమవారం డిస్మిస్ చేసింది.
గత నెల 22న జీవో 29ను రద్దు చేయాలని కోరుతూ.. గ్రూప్–1 అభ్యర్థులు బి.శ్రుతి, పి.రాంబాబు, ఎల్.మంజుల, జి.సుధాకర్ తదితరులు సుప్రీంకోర్టులో రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. వాటిపై ఫిబ్రవరి 3న జస్టిస్ పమిడిఘంటమ్ శ్రీనరసింహ, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం విచా రణ చేపట్టింది. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 29తో వేల మంది విద్యార్థులకు నష్టం వాటిల్లుతుందని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ఆదిత్య సోంది, మోహిత్ రావు ధర్మాసనం దృష్టికి తెచ్చారు.
జీవో 29ను రద్దు చేసి, గ్రూప్–1 పరీక్షలను తిరిగి నిర్వహించేలా ఆదేశించాలని కోరారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ‘‘గ్రూప్–1 పరీక్షలు ఇప్పటికే పూర్తయ్యాయి కదా. ఫలితాలు ప్రకటించేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కాబట్టి ఈ అంశంలో ఇప్పుడు జోక్యం చేసుకోవడం సరికాదు. ఈ పిటిషన్లను డిస్మిస్ చేస్తున్నాం..’’అని పేర్కొంది.
Tags
- group 1
- Group 1 Aspirants
- 563 Group 1 Jobs
- Telangana Public Service Commission Notification
- TGPSC
- group 1 exams
- Supreme Court
- Group 1 Recruitment Process
- Group 1 Results
- TSPSC Group 1 Aspirants
- Supreme Court of India
- Telangana News
- Protesting Telangana PSC exam group 1 aspirants
- Supreme Court has dismissed petitions challenging the Telangana Group-1 recruitment process
- RecruitmentUpdates
- telanganajobs